సుమంత్ 'నరుడి'కి బ్రేక్

అన్నీ వున్నా ఎక్కడో శని వుందన్నట్లు, పాపం అక్కినేని ఫ్యామిలీలో అన్నీ వుండి కూడా సరైన కెరీర్ సాగనిది సుమంత్ కే. చాన్నాళ్ల గ్యాప్ తరువాత 'నరుడా డోనరుడా' సినిమా ఈ శుక్రవారం జనం ముందుకు రావాల్సి వుంది. సినిమాకు వైవిధ్యమైన టైటిల్, ట్రయిలర్లలో తనికెళ్ల మాటల విరుపుల పుణ్యమా అని కాస్త బజ్ వచ్చింది. 

ఈవారం విడుదలయ్యే అనేకానేక సినిమాల్లో అదే ఫస్ట్ చాయిస్ గా వుంది. కానీ ఇప్పుడేమయింది..ఆ సినిమా విడుదలపై స్టే విధించింది కోర్టు. ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు అయింది. తాళ్లపల్లి ప్రసాద్ అనే వ్యక్తి నరుడా డోనరుడా సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసారు. దీంతో ఈ పిటిషన్ డిస్పోజ్ చేసేవరకు నరుడా డోనరుడా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.  

ఈ సమస్యను అధిగమించేందుకు నిర్మాతలు, సుమంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎలా లేదన్నా దీనికి ఒక రోజు సమయం అన్నా పడుతుంది. పిటిషనర్ తో చర్చలు ఫలించి, రాజీ కుదిరితే, మళ్లీ కోర్టు ద్వారానే స్టే ఉత్తర్వులను ఉపసంహరించాల్సి వుంటుంది. అంటే ఎలా లేదన్నా రేపటి సాయంత్రం వరకు అది సాధ్యమేనా అన్నది అనుమానం. 

ఇదిలా వుంటే నరుడా డోనరుడా సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసారు. కేవలం కోటి రూపాయిల లోపు బడ్జెట్ తో సినిమా రూపొందించినట్లు, అలాగే సుమంత్ పారితోషికం లేకుండా నటించినట్లు, అదే విధంగా అన్నపూర్ణ స్టూడియో సహకారం కూడా చాలావరకు అందించినట్లు తెలుస్తోంది. మరి ఇంత తక్కువ మొత్తంతో తయారైన సినిమాకు కూడా ఫైనాన్స్ సమస్యలేమిటో అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Show comments