'బాహుబలి'ని చూడలేదుగానీ..

మొన్నీమధ్యనే షారుక్‌ఖాన్‌, 'బాహుబలి' సినిమాపై స్పందించాడు. 'బాహుబలి' సినిమాని ఓ అద్బుతంగా షారుక్‌ఖాన్‌ అభివర్ణించాడు. కానీ, కండిషన్స్‌ అప్లయ్‌. అవేంటో, తర్వాత మాట్లాడుకుందాం. 

తాజాగా, మరో బాలీవుడ్‌ 'ఖాన్‌' 'బాహుబలి' సినిమాని అద్భుతమని కొనియాడాడు. 'బాహుబలి'ని ఇంకే చిత్రంతోనూ పోల్చడం సబబు కాదని కూడా అన్నాడు. ఆయనెవరో కాదు, బాలీవుడ్‌ మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌. 'బాహుబలి' సినిమాని తన సినిమా 'దంగల్‌'తో పోల్చడం తగదని అమీర్‌ఖాన్‌ చెప్పుకొచ్చాడు. చైనాలో 'దంగల్‌' వసూళ్ళను కుమ్మేస్తుండడంపై హర్షం వ్యక్తం చేశాడీ బాలీవుడ్‌ హీరో. 'బాహుబలి'ని పొగిడేస్తూనే, అమీర్‌ఖాన్‌ కూడా 'కండిషన్స్‌ అప్లయ్‌' అనే సస్పెన్స్‌కి తెరలేపాడు. 

ఇంతకీ, ఆ కండిషన్స్‌ అప్లయ్‌ ఏంటనే కదా మీ డౌట్‌.? అద్భుతమని పొగిడేశారుగానీ అటు షారుక్‌ఖాన్‌గానీ, ఇటు అమీర్‌ఖాన్‌గానీ ఇంకా 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని చూడలేదు. మరెలా, 'బాహుబలి'ని అద్భుతమని ప్రశంసించేశారట.! పది మంది చెప్పుకుంటోంటే వినడం ద్వారా, 'బాహుబలి ది కంక్లూజన్‌' సృష్టిస్తున్న రికార్డుల్ని తెలుసుకోవడం ద్వారా.. అనుకోవాలంతే. 

అక్కడికేదో 'బాహుబలి కంక్లూజన్‌' సినిమాని చూడటం నామోషీనా.? అన్న అనుమానం కలుగుతోంది 'ఖాన్స్‌', ఇంకా ఈ సినిమా చూడకపోవడం గురించి ఆలోచిస్తే. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందీలో విడుదల చేశాడు. రికార్డుల దుమ్ము దులిపేసిన చిత్రం 'బాహుబలి ది కంక్లూజన్‌'. అలాగని, ఈ సినిమాని చూడకపోతే నేరమేమీ కాదు. కానీ, ఓ సినీ నటుడిగా అప్పటికి అందరి ప్రశంసలు అందుకున్న సినిమాలు చూడటం ద్వారా తమను తాము అప్‌డేట్‌ చేసుకోవడానికీ, ఆయా సినిమాల్ని మించిన సినిమాలు చేయాలనే కసిని పెంచుకోవడాకీ వీలుంటుంది. 

ఇంతకీ, 'చూడలేదు' అనే విషయాన్ని 'ఖాన్స్‌' నొక్కి వక్కాణించాల్సిన అవసరమేమొచ్చిందట.. ఏమో మరి, ఇది బాలీవుడ్‌ అహంకారం అనుకోవాలో, ఇంకేమన్నా అనుకోవాలో అర్థం కాని పరిస్థితి.

Show comments