కేంద్రం మెడలు వంచి సాధించిన కేసీఆర్!

రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం ఎదుట రకరకాల కోరికలు విన్నవిస్తుంటాయి. కానీ సాధారణంగానే.. వాటిలో చాలా వరకు తీరకుండా మిగిలిపోతాయి. కేంద్రం సహజంగానే రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తులకు పెద్దగా స్పందించదు . ప్రాసెస్ లో భాగంగా.. రాష్ట్రాలతో వ్యవహరిస్తుందే తప్ప.. వారి ప్రత్యేక కోరికల విషయంలో నిర్లిప్తతనే పాటిస్తుంది. ఈ వ్యవహారం తెలుగు ప్రాంతపు వ్యక్తులుగా మనకు ఈ పాటికి బాగానే అర్థమై ఉండాలి. ఎందుకంటే.. అనాథ రాష్ట్రంలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి.. రకరకాల కోరికలను కేంద్రం ముందుంచినప్పటికీ.. ప్రభుత్వంలో తాము భాగస్వామి అయినప్పటికీ.. చంద్రబాబునాయుడు సాధించినవి మాత్రం చాలా తక్కువ. అలాంటిది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. తాను తలచింది తలచినట్లుగా కేంద్రంనుంచి సాధించారు. కేంద్రంనుంచి అత్యంత కష్టసాధ్యమైన కోరికను, వారి మెడలు వంచి సాధించారని ఇప్పుడంతా విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రస్తుతం ఉన్న సచివాలయం అంటే.. ఆయనకు అపారమైన విముఖత ఏర్పడింది. ఇది వాస్తు అనుకూల భవన సముదాయం కాదనే ముద్ర ఆయన మదిలో పడిపోయింది. మూడేళ్లు గడచినా ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆ మాటకొస్తే.. ఈ సచివాలయ వాస్తు ప్రకారం.. ఏ ముఖ్యమంత్రికీ ఆయన కొడుకు ఇక్కడ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదనే భయం కూడా ఆయన మదిలో  తిష్ట వేసింది. దాంతో ఆయన ఇంటినుంచే అన్ని పనులూ చక్క బెడుతున్నారు. 

ఈ సచివాలయ సముదాయాన్ని సమూలంగా కూల్చేసి.. కొత్త సచివాలయం నిర్మించాలని ఆయన సంకల్పించారు. అందుకే రకరకాల స్థలాల పరిశీలన అనంతరం సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్స్ ను ఆయన ఎంపిక చేసుకున్నారు. అయితే అది కేంద్ర రక్షణ శాఖకు చెందిన, ప్రస్తుతం మిలిటరీ ఆధీనంలో ఉన్న మైదానం. కేంద్ర రక్షణ శాఖ నుంచి వారి ఆస్తిని రాష్ట్రప్రభుత్వం తీసుకోవడం అనేది... మామూలు విషయం కాదు! కేంద్రం తమ ఆస్తుల విషయంలో మొండిగా ఉంటుంది. రాష్ట్రాల్ని ఖాతరు చేయదు. పైగా ఇది రక్షణశాఖ భూమి. ఆయన కోరిక నెరవేరదని అంతా అనుకున్నారు. గతంలో తెరాస ఎంపీలు పలుదఫాలుగా కేంద్రంలోని పెద్దలకు విన్నవించినా పెద్దగా సానుకూల స్పందన రాలేదు. కానీ కేసీఆర్ ఏం మాయ చేశారో గానీ.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని కలిసి.. పోలో గ్రౌండ్స్ ను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వానికి తీసుకోవడానికి ఒప్పించారు. నిజంగా ఇది చాలా పెద్ద  ఘనతగా పరిగణించాలి. ఒకవైపున ఏపీ సీఎం తమకు రావాల్సిన వాటిని రాబ్టటడంలోనూ ఫెయిలవుతోంటే.. తెలంగాణ సీఎం.. తమవి కాని వాటిని కూడా రాబట్టుకోవడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. అదే వైచిత్రి. 

Show comments