చినబాబు నారా లోకేష్‌కి పదవిని కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెగ అత్యుత్సాహం చూపుతున్నాయి. చంద్రబాబు తలచుకుంటే, నారా లోకేష్‌కి ప్రభుత్వంలో పదవి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. 'మంత్రి పదవి.. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం.. నేనేమీ వ్యాఖ్యానించలేను..' అని నారా లోకేష్ పైకి చెబుతున్నారుగానీ, తెరవెనుక జరగాల్సిన కసరత్తు ఈపాటికే పూర్తయిపోయింది.
మంత్రి వర్గ విస్తరణ చేయడం, అందులో నారా లోకేష్‌కి అవకాశం కల్పించడం, అది కూడా ముఖ్యమైన పదవిని కట్టబెట్టడం.. ఇదీ అసలు ప్రాసెస్. దీనికోసం కసరత్తులు దాదాపుగా పూర్తయినప్పటికీ, వ్యతిరేకతపైన భయంతో చంద్రబాబు వ్యవహారాన్ని ఇంకా ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారట. చినబాబు సన్నిహితులు మాత్రం, 'ముఖ్యమైన పదవి' దక్కబోతోందంటూ మీడియాకి లీకులు అందిస్తుండడం గమనార్హం.
ముఖ్యమైన పదవి అంటే మొదటిది హోంశాఖ, రెండోది ఆర్థిక శాఖ. కొత్త రాజధాని అమరావతి నిర్మితమవ్వాల్సి వున్నందున, ప్రస్తుతం మంత్రి నారాయణ నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖకీ ప్రాధాన్యత ఎక్కువే. హోం, ఆర్థిక శాఖల్ని మాత్రం చినబాబుకి, చంద్రబాబు కట్టపెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఆ పదవులు ఇస్తే, పార్టీలో వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం కాస్తయినా చంద్రబాబుకి వుండదా.? పైగా, ఆ పదవుల్లో చినబాబు తేలిపోతే, అసలుకే మోసమొస్తుంది మరి.
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరినవారిలో కనీసం ముగ్గురికి మంత్రి పదవులు వస్తాయన్నది టీడీపీ నుంచి అందుతున్న లీకుల సారాంశం. చాలా ఏళ్ళుగా టీడీపీనే పట్టుకుని వేలాడుతున్న నేతల్లోనూ ఒకరిద్దరికి కొత్తగా మంత్రివర్గంలో ఛాన్స్ కల్పిస్తారట. ఇదంతా జరగాలంటే, పలువురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన తప్పదు. నిన్న మొన్నటిదాకా 'చినబాబు కోసం పదవీ త్యాగానికి సిద్ధం..' అంటున్నవారేమో, ఇప్పుడు కాస్త జంకుతుండడం మరో విశేషం.
మంచి ముహూర్తం చూసుకుని, అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఆ ముహూర్తం ఎప్పుడు.? అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో, ఈలోగానే తన కుమారుడ్ని మంత్రిగా చూసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ మాత్రం తొందరపాటు తప్పదు.. ఎందుకంటే, పరిస్థితులు ఇప్పుడిప్పుడే వెక్కిరిస్తున్నాయ్ మరి టీడీపీని.!