ఆ రెండు సినిమాలకు నో ప్రొబ్లెమ్?

పెద్దనోట్ల రద్దు టాలీవుడ్ మీదకు వచ్చి పడిన సంగతి తెలిసిందే. తరువాతి సినిమాల సంగతి అలా వుంచితే ఇప్పుడు నిర్మాణంలో వున్న రెండు భారీ సినిమాలు గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 ఏం చేయాలి అన్నదే అసలు సమస్య.  

ఎందుకంటే ఈ రెండు సినిమాలు 60 నుంచి 70 కోట్ల మేరకు అమ్మకాలు సాగించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు జనాలు పెద్ద  నోట్ల రద్దుతో ఈ సినిమాలు కిందా మీదా అవుతున్నాయి అని వార్తలు వినవచ్చాయి.  కానీ అదేం లేదని, చిన్న మార్పుతో సింపుల్ గా ఈ సమస్యను అధిగమించేస్తున్నాయని తెలుస్తోంది. 

ఇదెలా అంటే ఇప్పటికే కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నవారు ఇచ్చిన అడ్వాన్స్ లను బ్లాక్ లుగా మార్చేసి, కొత్త అగ్రిమెంట్ లు ఫుల్ వైట్ అమౌంట్ కు మారుస్తారని టాక్. అంటే ఇప్పటికి అందింది బ్లాక్. అందాల్సింది వైట్. అగ్రిమెంట్ లు ఆ వైట్ అమౌంట్ కే వుండేలా అన్నమాట. దీనివల్ల ఎవరికీ ఏ సమస్య వుండదు.

ఒకవేళ అడ్వాన్స్ కన్నా బ్లాక్ కాస్త ఎక్కువ ఇవ్వాల్సి వున్నా, ప్రస్తుతానికి తీసుకోకుండా వుంచేస్తారట. సినిమా విడుదలై, కలెక్షన్లు వచ్చిన తరువాత, అప్పుడు బయ్యర్ల దగ్గర నుంచి లెఫ్ట్ లో తీసుకునేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ కలెక్షన్లు స్టార్ట్ అయిన తరవాత డీసీఆర్ లో మతలబులు, టాక్స్ ఎగ్గొట్టే వ్యవహారాలు, బ్లాక్ మళ్లీ చేరడం అన్నది కామన్ . అంటే సినిమా విడుదలకు ముందు ఫుల్ సెటిల్ మెంట్ కొంతవరకు జరగకపోవచ్చు.

అయితే ఇటు మెగా క్యాంప్, అటు నందమూరి బాలయ్య సినిమా కాబట్టి, బయ్యర్లు సినిమా విడుదల తరువాత నాలుక మడతేసి, రివర్సయ్యేంత సీన్ వుండదు. అదీ భరోసా. అందువల్ల ముందుగా బ్లాక్ కొంత, ఆపై ఫుల్ వైట్ తీసేసుకుని, విడుదల తరువాత బ్యాలెన్స్ బ్లాక్ సెటిల్ చేసేలా మాటలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Show comments