‘కమ్మ వాళ్లకు మాత్రమే’ బీజేపీ బయట ఈ బోర్డు పెట్టండి!

భారతీయ జనతా పార్టీ ది హిందుత్వవాదం అనుకున్నాం కానీ, ఇలా కుల వాదం అనుకోలేదని అంటున్నారు ఆ పార్టీకే చెందిన కొంతమంది నేతలు. మేం హిందువులుగా గర్వించే వాళ్లం.. హిందుత్వ వాదాన్ని కాపాడే ఆసక్తి ఉన్న వాళ్లమని.. ఈ పార్టీ వైపు వచ్చాం.. హిందువులవ్వడమే పెద్ద అర్హత అనుకున్నాం కానీ, కమ్మ వాళ్లు కాకపోవడం అనర్హత అవుతుందని మాత్రం ఊహించలేదు.. అని వీరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక వర్గం నుంచి కాదు.. బీజేపీలోని కమ్మేతర వర్గాలన్నింటి నుంచి కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. కమ్మ కాకపోతే బీజేపీలో ఎలాంటి విలువ దక్కదని, అణగదొక్కేస్తున్నారని వీళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో చోటా మోటా నేతలను కాదు.. వీహెచ్ పీ నేఫథ్యం నుంచి వచ్చిన వారిని అయినా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సీనియర్లను అయినా నిన్నలా మొన్న ఇక్కడికి చేరుకున్న కమ్మ లాబీ ఇట్టే అణగదొక్కేస్తోందని.. వాళ్ల అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తోందనే ఆవేదన వ్యక్తం అవుతోందిప్పుడు. ఈ పరిణామాల మధ్య హిందుత్వ వాదానికి కట్టుబడి బీజేపీలో ఉండాలో, కమ్మ కుల వాదానికి తట్టుకోలేక బయటకు పోవాలో అర్థం కావడం లేదని కమలం జెండాను మోస్తున్న వాళ్లు అంటున్నారు.

ఇందులో దాపరికం ఏమీ లేదు.. ఏయే కులాలకు చెందిన ఎవరెవరిని ఏ రకంగా అణగదొక్కారో ప్రజలు కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నారని వీరు సోదాహరణంగా వివరిస్తున్నారు. సోమూ వీర్రాజు.. కాపు కులస్తుడు.. విభజన తర్వాత ఏపీ బీజేపీకి అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి. దాదాపుగా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం లాంఛనమే అనుకున్నారంతా. అయితే చంద్రబాబు మీద సూటిగా స్పందించే తీరుతో ఆయన ఒక కులానికి నచ్చకుండా పోయాడు. బాబుకు ఊడిగం చేసే వ్యక్తే అయితే.. అది ఏ కులం అయినా ఫర్వాలేదు. సోమూ ఆ టైపు కాదు కాబట్టి, పార్టీ అధ్యక్ష స్థానంలో కమ్మ వాడిని కూర్చోబెట్టడమే శరణ్యం అని ఆ లాబీ ఫిక్సయ్యింది. 

మరి అలా అయినా.. తగిన వ్యక్తిని చూపించగలిగారా అంటే అదీ లేదు! బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం కొన్ని సంవత్సరాల పాటు  పార్టీలో పని చేసిన వ్యక్తులు మాత్రమే  అధ్యక్ష బాధ్యతలకు అర్హులు. కామినేని, కావూరి వంటి వాళ్లు నిన్నలా మొన్న వచ్చి చేరిన వాళ్లు కాబట్టి వీళ్లకు ఆ అవకాశం లేదు. సోమూ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. కమ్మ లాబీ మొత్తం రంగం లోకి దిగి.. ఆయనను అధ్యక్షుడిగా ప్రకటన వచ్చే సమయంలో అడ్డం పడింది. విజయవంతంగా అడ్డుకోగలిగింది.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలోకి వచ్చి చేరే ఆసక్తితో ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ జాతీయ పార్టీలోకి వచ్చే ఆసక్తి ఆయనకు ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. అంతో ఇంతో ఆ వర్గం మీద ప్రభావం చూపగలడు. ఈ పార్టీలో కొంత ఉత్సాహం తీసుకురాగలడు. కిరణ్ ఏదో చేసేస్తాడు అని కాదు కానీ, ఇలాంటి వారు వచ్చి చేరడం బీజేపీ ఉనికిని చాటగలదు. అయితే.. కిరణ్ చేరికను విజయవంతంగా అడ్డుకోవడంలోనూ కమ్మ లాబీ విజయవంతం అయ్యిందనే మాట ఆ పార్టీ నుంచినే వినిపిస్తోంది. ఈ విషయంలో వెంకయ్య, పురందేశ్వరి వంటి వాళ్లంతా కలిసి పని చేశారని.. కిరణ్ ను చేర్చుకోవడానికి లేదని అధిష్టానికి తేల్చి చెప్పారని.. సమాచారం. 

కాపు, రెడ్డి.. అయ్యిందా.. ఇక రాజులు. బీజేపీలో చాలా కాలం పని చేసిన కృష్ణం రాజు పరిస్థితి ఏమైంది? ఏదో ఒక రాష్ట్రానికి తనను గవర్నర్ గా పంపాలని ఆయన అధిష్టానాన్ని రెండేళ్లుగా కోరుతున్నాడు. కృష్ణం రాజు కు ఆ గౌరవం వల్ల బీజేపీకే ప్లస్. ఆయనను అభిమానించే సామాజికవర్గం వాళ్లు బీజేపీ కి సానుకూలం కావడంతో పాటు, ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే.. ఆయన కోరికా తీరలేదు! ఇక విజయవాడ వివాదంతో తన చేతిలో అధికారాలేమీ లేకపోయినా.. ఈ సామాజికవర్గానికి చెందిన ఒక నేతను కంభం పాటి హరిబాబు సస్పెండ్ చేశాడు. తను పార్టీ అధ్యక్షుడిని కాదు అని కూడా కంభం పాటికి అవగాహన లేకపోయింది పాపం!

ఎస్సీలు, ఎస్టీలు ఎలాగూ బీజేపీ వైపు మొగ్గు చూపరు. వీర హిందుత్వవాదులైన ఇతర సామాజికవర్గాల నుంచే  అంతో ఇంతో బీజేపీకి ఆదరణ. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి చూపే ఇతర సామాజికవర్గాల నేతలందరినీ అణిచివేయడం జరుగుతోంది బీజేపీలో. ఆఖరికి తెలుగుదేశంలో అయినా ఇతర సామాజికవర్గాల నేతలు అంతో ఇంతో ప్రాధాన్యతను సంపాదించుకోగలరు కానీ.. బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. పైన చెప్పినవన్నీ ప్రముఖ ఉదాహరణలు మాత్రమే.. లోపలకు వెళితే ఈ రొచ్చు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. 

ఏ మాత్రం మొహమాటం లేకుండా.. మరో కులం వాళ్లను ఎదగనీయకుండా తొక్కేస్తున్నారు కమ్మ నేతలు. జాతీయ పార్టీ, జాతీయ వాద పార్టీ అనుకుంటే.. ఇలా ఏక కుల వాద పార్టీ అయిపోయింది బీజేపీ. రాష్ట్ర విభజన తర్వాత ఇది రెండేళ్లలోనే ఈ పరిస్థితి పరిపూర్ణం అయిపోయింది. మరి “బీజేపీ- ఇది కమ్మవాళ్లకు మాత్రమే’’ అంటూ ఒక బోర్డు ఆ పార్టీ కార్యాలయం ముందు పెడితే మంచిదని.. అసంతృప్త కాషాయ ధారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Show comments