ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యింది. కానీ, చిత్రంగా 'టీ' కప్పులో తుపానులా తెలుగుదేశం పార్టీలో తలెత్తిన 'గడబిడ' చల్లారిపోతోంది. డజను మందికి పైగానే టీడీపీ ముఖ్య నేతలు, మంత్రి పదవులు దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు, పదవులు పోవడంతో గుస్సా అయ్యారు. అయితేనేం, అందర్నీ అధినేత చంద్రబాబు 'దార్లో' పెట్టేశారు..!
మంత్రి పదవులకు సంబంధించి ఇద్దరు, ఇంకో వివాదానికి సంబంధించి ఒకరు.. ఇలా ముగ్గురు టీడీపీ ముఖ్య నేతలు, నేడు మీడియా ముందుకొచ్చారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేసేశారు. కొండంత రాగం తీసి.. తుస్సుమనిపించేసిన చందాన, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, దాన్ని వెనక్కి తీసుకున్నారిప్పుడు. 'నేనేమన్నా పార్టీ మారతానని చెప్పానా.? అసలు వివాదమే లేదు, చిన్నపాటి అసంతృప్తి తప్ప..' అంటూ మీడియాకి ఆయన తీసుకున్న క్లాసులు అబ్బో, అద్భుతః అనాల్సిందే.
బొజ్జల వ్యవహారమిలా వుంటే, మరో టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అయితే 'చంద్రబాబు నాకు తండ్రి లాంటివారు.. నేనెందుకు పార్టీని వీడతాను.. పార్టీ కాపులకు చాలా ప్రాధాన్యతనిస్తోంది.. ఇవ్వట్లేదని నేనెప్పుడూ అనలేదు. అన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..' అంటూ మీడియాకి సవాల్ విసిరేశారు.
కొత్తగా, నిన్ననే అంబేద్కర్ జయంతి సందర్భంగా నిరసన గళం విప్పిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఆ నిరసన గళాన్ని కొనసాగిస్తున్నట్లే కన్పించారుగానీ, ఈ రోజు ఉదయం ఆయన చేసిన వ్యాఖ్యలకీ, మధ్యాహ్నం ఆయన చేసిన వ్యాఖ్యలకీ చాలా తేడా. 'చంద్రబాబుతో స్నేహం వదులుకోలేను. చంద్రబాబుని నన్ను ఎవరూ విడదీయలేరు. విడదీయాలని ఎవరనుకున్నా నవ్వులపాలైపోతారు..' అంటూ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో మీడియా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
మొత్తమ్మీద, చంద్రబాబు దగ్గర ఏదో మంత్రదండం వున్నట్లుంది. చంద్రబాబు కన్నెర్రజేసేసరికి ఒకరొకరుగా దార్లోకొచ్చేశారు. చంద్రబాబా మజాకానా.! అన్నట్టు, తెలుగు తమ్ముళ్ళూ అంతే.. అసంతృప్తి పేరుతో నానా హంగామా చేసి, తుస్సుమనిపించేశారు. తమ్ముళ్ళా మజాకానా.? మధ్యలో వెర్రి వెంగళప్పలయ్యింది.. సదరు నేతల్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులే.