ముద్రగడ అదే తప్పిదం..మరోసారి

మొత్తానికి ముద్రగడ నిరశన దీక్ష మరోసారి గడబిడలో పడింది. విరమించేసారు..ఫ్లూయిడ్స్ ఎక్కించేసాం..తుని కేసులు కాస్త లోతుగా విచారించి, నిందితులను కొత్తగా నిర్థారిస్తాం అనే టైపులో నిన్నటికి నిన్న మంత్రులు ప్రకటించేసారు. అదేం కాదు..మాకుచెప్పింది ఒకటి..మంత్రులు చేసింది మరొకటి అని ముద్రగడ మథనపడిపోతున్నారంటూ సాక్షి పత్రిక కథనం.

అసలు ముద్రగడ నిరశన వ్యవహారం గతంలోనూ, ఇప్పుడు కూడా వివాదాస్పదంగా, సందేహాస్పదంగా వుందన్నది వాస్తవం. దీన్ని కాపు కులేతరులు భలే టేకిట్ ఈజీగా తీసుకుంటున్నారన్నది వాస్తవం. లేస్తే మనిషిని కాను అనే టైపు వ్యవహారం ఇదంతా అని వాళ్లు కామెంట్లు చేస్తున్న సంగతి అంతకన్నా వాస్తవం. నిరశన చేసే వాళ్లు, ఎప్పుడు విరమించాలా అని చూడరు. 

కానీ ముద్రగడ వ్యవహారం అలా లేదు. ‘మా నాన్న డిస్కషన్లకు రెడీ అని కొడుకు’, ముద్రగడతో చర్చలు సాగించి, రెండు రోజుల్లో దీక్ష విరమింప చేయాలని కాపు సెలబ్రిటీలు అల్టిమేటమ్ ఇచ్చినపుడే అర్థం అయిపోయింది..దుకాణం ఎంత వేగిన లేపుదాం అని చూస్తున్నారని.  అంటే ఇక్కడ ముద్రగడ వర్గానికి ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయి వుండాలి. ప్రభుత్వం మొండికేసిందని, ముద్రగడ ఎన్నాళ్లు దీక్ష చేసినా పట్టించుకోదని అర్థమైపోయి వుండాలి. 

అలాంటపుడు ఇక దీక్ష చేసి ఏం లాభం? అలా అని చెప్పి, టక్కున గతంలో మాదిరిగా విరమిస్తే మళ్లీ అభాసు కావడం తప్ప ఏం ప్రయోజనం? ప్రభుత్వం నుంచి ఏదో కంటితుడుపు హామీ అన్నా వస్తే, లేచి మంచం దిగేయచ్చు..అందుకే కాపు సెలబ్రిటీలు ఆ డిమాండ్ చేసి వుంటారు.

ఇక ప్రభుత్వం కూడా ఈ వీక్ నెస్ గమనించేసింది. ఇప్పుడు ముద్రగడను నొక్కడమే బెటర్ అన్నట్లు ఆలోచించింది. కాపు సెలబ్రిటీల తాటాకు చప్పుళ్లకు బదులుగా కాపు మంత్రుల చేత కాస్త గట్టి చప్పుళ్లే చేయించింది. దాంతో దాసరి, చిరు సైడ్ నుంచి మరి నో రెస్పాన్స్. బహుశా మాటకు మాట వస్తుందని భయపడి వుంటారు. సో..అలా అన్ని వైపుల నుంచి ముద్రగడకు వచ్చే మద్దతుకు ప్రభుత్వం ముకుతాడు వేసేసింది. 

మంత్రులను పంపించి, ఏదో చెప్పాలి కాబట్టి సమగ్ర దర్యాప్తు జరిపించి కేసలు నిర్థారిస్తాం కానీ, ఇప్పుడు బెయిల్ వంటి వాటిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. అది నిన్నిటికి నిన్నే మంత్రులు క్లారిటీ ఇచ్సేసారు. కానీ ఇప్పుడు ముద్రగడ వర్గం, ప్రభుత్వం ఏదో మాట మాయ చేసిందనే కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే విరమణ జరిగిపోయింది..కానీ అందులో తమ తప్పు లేదని, ప్రభుత్వం మాయ చేయడం వల్లనే అన్న ఫీలర్లు జనంలోకి పంపాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

కానీ ముద్రగడ వర్గం తెలుసుకోవాల్సింది ఏమిటంటే..ఇప్పుడు జనం ఏమీ అంత పట్టించుకునే మూడ్ లో లేరు. ముద్రగడ దీక్ష చేసినా, చేయకున్నా దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పరిస్థితి ఒకలాగే వుంది. కాపులు ఏమీ భయంకరంగా రోడ్ల మీదకు వచ్చేయలేదు. ఒక్క తూ.గో జిల్లాలో మాత్రం అక్కడక్కడ నిరసనలు కనిపిస్తున్నాయి.

అందువల్ల ఇక ఈ విషయం మరింత యాగీ చేయకుండా, మంచం దిగి, ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇకనైనా ముద్రగడ ఒంటెత్తు ఆలోచనలు మానాలి. కాపు జేఎసి అన్నది తెరపైకి వచ్చింది కనుక, ఆ దిశగా ఆలోచనలు చేసుకోవాలి. ప్రతి జిల్లాలోనూ జేఎసిని పటిష్టం చేసుకోవాలి. ఆపై ఉద్యమ కార్యాచరణ అన్నది దశల వారీగా అమలు చేయాలి. 

పార్క్ హయాత్ లాంటి విలాస వంతమైన హోటళ్ల నుంచి కాకుండా, పట్టణాలు, పల్లెలకు కాపు సెలబ్రిటీలు కదలి రావాలి. అప్పుడు వస్తుంది కాపుల్లో చైతన్యం. ఆప్పుడు కదుల్తుంది ప్రభుత్వం. అంతే కానీ, ఊ అంటే నిరశన..ఆ అంటే నిరశన చేపడితే ఇలా జనంలో పలుచన కావడం మినహా ఫలితం ఏమీ వుండదు. కానీ ఇక్కడో సమస్య వుంది.

 కాపు ఉద్యమం నిర్మించి, ముందుకు వెళ్తే ఫలితం ఎవరు అనుభవించాలి? అందరూ ఆశా జీవులే..దాసరి, చిరంజీవి, ముద్రగడ, గంటా, నారాయణ, ఇలా చాలా మంది ముఖ్యమంత్రి కేండిడేట్ లు వున్నారు ఆ వర్గంలో. మరి పవన్ బాబు సంగతి సరేసరి. వీళ్లంతా ముద్రగడ మా వాడు అంటే అనొచ్చు కానీ, వీళ్లంతా కలిసి, ముద్రగడను సింహాసనం ఎక్కించేంత విశాల హృదయం మాత్రం లేదు.

కాపుల్లో వున్న ఈ అనైక్యతే తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి శ్రీరామరక్ష. 

Show comments