బాహుబలి-2 : ప్రభాస్‌ గురించి 10 కొత్త విషయాలు

విడుదలైన 4రోజులకే దేశవ్యాప్తంగా మేజర్‌ బాక్సాఫీస్‌ రికార్డుల్ని తుడిచిపెట్టేసింది బాహుబలి - ది కంక్లూజన్‌ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిగా ప్రభాస్‌ నటించిన ఈ సినిమా మొదటి వారాంతానికే 3వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్‌ ఐదేళ్లపాటు పూర్తిగా బాహుబలి ఫ్రాంచైజీకే అంకితమైపోయాడు. అయితే ప్రభాస్‌ ఇవేం ఆలోచించలేదు. బాహుబలి-1 విడుదలైన టైమ్‌లో ఓ న్యూస్‌ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్‌.. ''రాజమౌళి అడిగితే ఏకంగా ఏడేళ్లు కూడా అంకితమైపోవడానికి తను రెడీ'' అంటూ ప్రకటించాడు. దటీజ్‌ ప్రభాస్‌.

2012లో వచ్చిన ఈశ్వర్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌.. వర్షం, బిల్లా, ఛత్రపతి, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, మిర్చి లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో ఇప్పుడు ఆలిండియా స్టార్‌ అయిపోయాడు. బాహుబలి అలియాస్‌ ప్రభాస్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు.

1.ప్రభాస్‌... ది సూపర్‌ స్టార్‌

సౌతిండియాలో ప్రభాస్‌ ఇప్పుడు సూపర్‌ స్టార్‌ అయి పోయాడు. 15ఏళ్లుగా ఎన్నో హిట్స్‌  అందుకుంటున్న ఈ నటుడు బాహుబలి ఫ్రాంచైజీతో టోటల్‌ సౌత్‌కు హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయాడు. చాలామంది ఇప్పుడు ప్రభాస్‌ను సూపర్‌ స్టార్‌ అని సంభోదించడం ప్రారంభమైంది.

2.రాజమౌళితో అనుబంధం

ఛత్రపతి సినిమాతో రాజమౌళి-ప్రభాస్‌ అనుబంధం ప్రారంభమైంది. 2005లో వచ్చిన ఛత్రపతి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ఆల్‌టైం హిట్స్‌గా నిలిచాయి.

3.బాహుబలి కోసం ఐదేళ్లు అంకితం

బాహుబలి ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి నుంచి వేరే సినిమాకు సంతకం చేయలేదు ప్రభాస్‌. ఐదేళ్ల పాటు పూర్తిగా బాహుబలి ప్రాజెక్టుకే అంకితమైపోయాడు. రాజమౌళి అడిగితే మరికొన్ని సంవత్సరాలు పనిచేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు ప్రభాస్‌.

4.బాహుబలి కోసం శ్రమించిన విధానం

బాహుబలి కోసం ప్రభాస్‌ పడ్డకష్టం అంతాఇంతా కాదు. బాహుబలి పాత్ర కోసం 22కిలోలు పెరిగిన ప్రభాస్‌.. అదే సినిమాలో శివుడి క్యారెక్టర్‌ కోసం అమాంతం బరువు తగ్గాడు. బాహుబలి- ది కంక్లూజన్‌లో అమరేంద్రబాహుబలి, మహేంద్రబాహుబలి పాత్రల్లో కనిపించిన ప్రభాస్‌.. బాహుబలి క్యారెక్టర్‌కోసం 105కిలోల బరువు పెరిగాడు.

5.ప్రభాస్‌... ఓ పుస్తక ప్రియుడు

సినిమాలు, జిమ్‌ కాకుండా ప్రభాస్‌కు ఇష్టమైన మరో పని పుస్తక పఠనం. అవును.. పుస్తకాలు చదవ డం అంటే ప్రభాస్‌కు చాలాఇష్టం. ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీనే మెయింటైన్‌ చేస్తున్నాడు ప్రభాస్‌.

6.క్రీడా ప్రేమికుడు

ప్రభాస్‌కు ఆటలంటే చాలాఇష్టం. జిమ్‌లో చేసే వర్కవుట్స్‌ కంటే ప్లేగ్రౌండ్‌లో ఆడే ఆటల్నే ఎక్కువగా ఇష్టపడతాడు. మీకో విషయం తెలుసా.. బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రభాస్‌ జిమ్‌లో వర్కవుట్‌ కంటే గ్రౌండ్‌లో వాలీబాల్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. యుద్ధ సన్నివేశాల్లో నటించడానికి వాలీబాల్‌ బాగా పనికొచ్చిందంటున్నాడు ప్రభాస్‌. వత్తిడిని దూరం చేయడానికి వాలీబాల్‌కు మించిన సాధనం లేదంటాడు ఈ హీరో. అందుకే టైమ్‌ దొరికినప్పుడల్లా స్నేహితులతో సరదాగా వాలీబాల్‌ ఆడుతుంటాడు. ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్‌ పెట్టే ప్రభాస్‌.. దేహధారుడ్యం కోసం కొండలు, గుట్టలు ఎక్కేస్తుంటాడు.

7.మొహమాటస్తుడు

ఆర్భాటాలకు పోకుండా సాధారణంగా ఉండడం ప్రభాస్‌కు అలవాటు. వివాదాలకు దూరంగా ఉండే అతికొద్దిమంది హీరోల్లో ఒకడు. ఎన్ని హిట్స్‌ వచ్చినా, ఎంత స్టార్‌డమ్‌ పెరిగినా ఎలాంటి భేషజాలకు పోకుండా, అందరివాడులా ఉండడం ప్రభాస్‌ గొప్పదనం.

8.పెళ్లి ఆలోచనలు

ప్రభాస్‌కు సంబంధించి చాలామందిని ఎట్రాక్ట్‌ చేస్తున్న ఎలిమెంట్‌ ఇది. ఇప్పటివరకు ఈ హీరోకు దాదాపు 6వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటివరకు వచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించాడు ప్రభాస్‌.

9.తిరుగులేని డేడికేషన్‌

ఓ సినిమాకు కమిట్‌ అయితే దానికి పూర్తిగా అంకితమైపోతాడు ప్రభాస్‌. బాహుబలి-1 రిలీజ్‌ తర్వాత 10కోట్ల రూపాయల యాడ్‌ ఆఫర్‌ వస్తే తిరస్కరించాడు. దీంతోపాటు పలు బాలీవుడ్‌ ఆఫర్లను కూడా వద్దనుకున్నాడు. సినిమాపై ఫోకస్‌ మిస్‌ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పాడు.

10.ప్రకృతి ప్రేమికుడు

పక్షుల్ని పంజరంలో బంధించడానికి ప్రభాస్‌ పూర్తి వ్యతిరేకి. తన ఇంట్లో ఉన్న గార్డెన్‌లో చాలా రకాల పక్షుల్ని స్వేచ్ఛగా పెంచుతున్నాడు ప్రభాస్‌. బాహుబలి-2 సక్సెస్‌ను   ఎంజాయ్‌ చేస్తున్న ప్రభాస్‌ ప్రస్తుతం ''సాహో'' సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సాహో విడుదలకానుంది.

-ఎల్‌.విజయలక్ష్మి

Show comments