ఇండియన్‌ సినిమాకి దిక్సూచి 'బాహుబలి'

తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది.. అన్న మాట చాలా చాలా చిన్నది. ఎందుకంటే, 'బాహుబలి' సినిమా సాధించిన విజయం అలాంటిది. దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది 'బాహుబలి'. సరిగ్గా రెండేళ్ళ క్రితం 'బాహుబలి' ప్రభంజనం మొదలయ్యింది. ముందుగా సినీ రంగాన్ని షాక్‌కి గురిచేసింది 'బాహుబలి ది బిగినింగ్‌'. మధ్యలో చిన్న గ్యాప్‌, మళ్ళీ 'బాహుబలి ది కంక్లూజన్‌' వచ్చేసింది. షాక్‌ అనే మాట సరిపోదు, 'బాహుబలి ది కంక్లూజన్‌' సాధించిన విజయం గురించి చెప్పడానికి. 

తెలుగు సినిమా మార్కెట్‌ ఎంత.? మహా అయితే 100 కోట్లు. ఆ లెక్కలిప్పుడు పటాపంచలైపోయాయి. ఓ ఐదొందల కోట్లు.. కాదు కాదు వెయ్యి కోట్లు.. అదీ కాదు.. అంతకు మించి, 1500 కోట్ల దాకా మార్కెట్‌ చేసుకోవచ్చునని 'బాహుబలి' నిరూపించింది. ఓ గొప్ప సినిమా తీయాలంటే ఏం కావాలి.? ఏం చేయాలి.? అన్న విషయాల్ని 'బాహుబలి' అందరికీ అర్థమయ్యేలా చూపించింది. 

సినిమాని తెరకెక్కించడం, దానిపై హైప్‌ క్రియేట్‌ అయ్యేలా చేయడం, ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డప్పుడు, వాటిని అందుకునేలా సరైన వ్యూహాలు రచించి, సినిమాని మార్కెటింగ్‌ చేసి, ప్రేక్షకుల ముందుకు 'అందంగా తీసుకురావడం..' ఇలా చెప్పుకుంటూ పోతే, 'బాహుబలి' సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి సరికొత్తగా మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ నేర్పిందనడం అతిశయోక్తి కాకపోవచ్చునేమో.! 

రాజమౌళి దర్శకత్వం, ఆర్కా మీడియా నిర్మాణం, ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితర నటీనటుల ప్రతిభ.. ఇలా అన్ని విభాగాల్లోనూ 'బాహుబలి' ఇండియన్‌ సినిమాకి సరికొత్త పాఠాలు చెప్పిందన్నది నిర్వివాదాంశం. అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా, వెయ్యి కోట్ల వసూళ్ళు దాటిన తొలి భారతీయ సినిమా, 1500 కోట్ల మార్క్‌ అందుకున్న తొలి ఇండియన్‌ మూవీ.. తొలి రోజు, తొలి వారం వసూళ్ళలో ప్రభంజనం.. ఇలా రాస్తే, ఓ పెద్ద చరిత్ర అవుతుంది 'బాహుబలి'. 

'మా సినిమా అంత, మా సినిమా ఇంత.. ఈ స్థాయిలో తీశాం, ఆ స్థాయిలో తీసుకున్నాం..' అని చెప్పుకోవడమొక్కటే సినిమా మార్కెటింగ్‌ అనుకోవడం చూస్తూనే వున్నాం. అసలు సిసలు సినిమా మార్కెటింగ్‌ అంటే ఏంటో 'బాహుబలి' చూపించింది. తెలుగు సినీ పరిశ్రమ ఆనందంతో ఆశ్చర్యపోవడం ఒక ఎత్తయితే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ.. ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమలూ ఆశ్చర్యంతో 'సాహోరే బాహుబలి' అనడం.. నిజంగానే మన తెలుగు సినిమాకి దక్కిన గౌరవంగా భావించాలి. 

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇండియన్‌ సినిమాకి దిక్సూచిగా 'బాహుబలి' మారిందనడం అతిశయోక్తి కానే కాదు. ఎనీ డౌట్స్‌.?

Show comments