‘ఎన్నికల ముందు అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాకా ప్రజలకు అర్థం కాని గణాంకాలు చెప్పడం చూస్తుంటే.. వీళ్లంతా అబద్ధాలు ఆడుతున్నారని అనుకోవాలి…’ అని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాన్. తన అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ ఈ వ్యాఖ్య చేశారు. పవన్ ఒక అమాయక చక్రవర్తిలా మాట్లాడుతున్నాడు. తను కూడా మోసంలో భాగస్వామినే అనే విషయాన్ని కప్పిపెడుతూ వ్యవహరిస్తున్నాడు.
మొన్నటి ఎన్నికల ముందు పవన్ కల్యాన్ చెప్పిన మాటలను పవనే పరోక్షంగా గుర్తుకు చేస్తుండటం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు అనవిగాని హామీలను ఎన్నో ఇచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇచ్చిన ప్రతి హామీ విషయంలోనూ ఆ పార్టీలు మోసపూరిత వైఖరినే ప్రదర్శించాయి. రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ దగ్గర నుంచి కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా వరకూ.. ప్రతి వ్యవహారంలోనూ మోసమే చేశాయి.
అది నిజమే.. కానీ.. పవన్ ఆ కూటమి తరపున ప్రచారం చేస్తూ ఏం చెప్పాడో ఆయన మరిచిపోయినట్టున్నాడు. ఎన్డీయే కూటమిలోని నేతగా ‘బీజేపీ, తెలుగుదేశం పార్టీల హామీల అమలుకు నేనే పూచీ..’ అని పవన్ హామీని ఇచ్చాడు! ఆ పార్టీలను గెలిపించాలని, అవి హామీలను అమలు చేసేలా తను చూసుకొంటానని ఓటర్లకు నమ్మబలికాడు పవన్ కల్యాణ్!
బీజేపీ, తెలుగుదేశంలు హామీలు ఇచ్చిన మాట ఎంత వాస్తవమో, పవన్ కల్యాణ్ వాటిని గట్టిగా ప్రచారం చేసి పెట్టడం కూడా అంతే వాస్తవం! అచ్చం ఆ పార్టీల్లాగానే.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలంగాణలో, వ్యతిరేకంగా సీమాంధ్రలో మాట్లాడిన మేధావి శ్రీ శ్రీ పవన్ కల్యాన్! ఇక.. ఆ పార్టీలు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం గడిచిపోయింది.
ఒకవేళ ఆ పార్టీలు హామీలు అమలు చేయకపోతే.. వాటి విషయంలో తను ప్రశ్నిస్తానని చెప్పింది కూడా పవన్ కల్యానే! అయితే రైతు రుణమాఫీ లో అయితేనేం.. ఇతర సవాలక్ష హామీల విషయంలో అయితేనేం.. ఇంత వరకూ చంద్రబాబును గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు!