సుదీర్ఘ అనుభవం... హుందాతనం శూన్యం... !

'మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...ఎదిగినకొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది'...అన్నాడు సినిమా కవి చంద్రబోస్‌. ఎదిగినకొద్దీ ఒదగడమంటే వంగివంగి సలాములు చేయమనో, నీ బాంచెన్‌ దొరా కాల్మొకుతా అనో, అతి వినయం ప్రదర్శించడమనో అర్థం కాదు. చిల్లర వేషాలేయకుండా, చీప్‌గా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని అర్థం. సహనంగా ఉండాలని అర్థం. అహంకారంతో కొమ్ములొచ్చినట్లుగా వ్యవహరించకూడదని అర్థం. కాని రాజకీయ నాయకులు ఎదిగినకొద్దీ రెచ్చిపోతుంటారు. అహంకారంతో విర్రవీగుతుంటారు. 

చేతిలో అత్యున్నత పదవి ఉంటే కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తుంటారు. దశాబ్దాల రాటుదేలిన అనుభవంతో గౌరవనీయమైన స్థానంలో ఉండాల్సినవారు 'ఏమిటింత చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు' అనుకునేలా చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే ఉన్నారు. ఆయన అవశేష ఆంధ్రకు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. అసహనంగా ప్రవర్తిస్తున్నారు. విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. హుందాతనం మర్చిపోయారు. అనైతికతను అక్కున చేర్చుకుంటున్నారు. 

తాను ఉత్తముడినని, ఎదుటివారు అథములని భావిస్తున్నారు.  దశాబ్దాల అనుభవం, పరిపాలనా సమర్థత ఉన్న చంద్రబాబు సగటు రాజకీయ నాయకుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదు. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాలను గౌరవించడం. విమర్శలను స్వీకరించడం. 'నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కాని అభిప్రాయాన్ని వ్యక్తీకరించే నీ హక్కు కోసం పోరాడతా' అని ఓ మహానుభావుడు అన్నాడు. ఇదే ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ఇన్నేళ్లయినా చంద్రబాబుకు ఇది అర్థం కాలేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే దాన్ని సృష్టించాలన్నాడు ఓ మేధావి. ఎందుకు? పాలకులు సక్రమంగా వ్యవహరించేందుకు, వారు తమను ఎప్పటికప్పుడు 'చెక్‌' చేసుకునేందుకు ప్రతిపక్షం అవసరం. 

ప్రతిపక్షమంటే శత్రువు కాదు. హంతకుడు కాదు. కాని చంద్రబాబు, కేసీఆర్‌ మొదలైన పాలకులకు ప్రతిపక్షమంటే పాముతో సమానమనే భావన ఉంది. 'చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి' అన్నట్లుగా ప్రతిపక్షం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని బతకనివ్వకూడదనే అభిప్రాయం ఉంది. పాత తరం పాలకులు ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొంటూనే గౌరవంగా చూశారు. కాని ఇప్పటి పాలకులు అడ్డదారుల్లో ప్రతిపక్షాలను సర్వనాశనం చేస్తున్నారు. 'మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది. అది పనికిమాలిన పార్టీ' అని చంద్రబాబు వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు. 

అభివృద్ధికి అడ్డుపడే పార్టీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. తెలంగాణలో టీడీపీని కేసీఆర్‌ దిక్కుమాలిన పార్టీ అన్నారు. ఆంధ్రా పార్టీని తరిమికొట్టాలన్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉందన్నారు. కేసీఆర్‌ మాటలకు ఆగ్రహించిన చంద్రబాబు తానూ అదే పని చేస్తున్నారు. అసలు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడటమేమిటో అర్థం కావడంలేదు. ఈమధ్య తెలంగాణ, ఆంధ్రా పాలకులు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అదే పనిగా పాట పాడుతున్నారు. 

అభివృద్ధికి అడ్డుపడితే తమకు మనుగడ ఉండదని ప్రతిపక్షాలకు తెలియదా? అభివృద్ధి పనుల్లో లేదా అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరుగుతన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అధి అభివృద్ధికి అడ్డుపడటం ఎలా అవుతుంది? ప్రతిపక్షాలు చెబుతున్నదాంట్లో వాస్తవాలుంటే సరిచేసుకోవాలి. తాము సరిగ్గా చేస్తున్నామని భావిస్తే ఆ విషయం వివరించాలి. అంతేగాని పనికిమాలిన పార్టీలని, అభివృద్ధి నిరోధకులని నోటికొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోవచ్చు. అప్పుడు అధికారంలోకొచ్చిన పార్టీ దీన్ని పనికిమాలిన పార్టీ అంటే బాబు ఊరుకుంటారా? చంద్రబాబు ఇప్పటివరకు ఏ విషయంలోనూ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. చర్చించలేదు. అభిప్రాయాలు అడగలేదు. రాజధాని నిర్మాణం ఆయన సొంత ఇంటి వ్యవహారంలా చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు కదా. ప్రతిపక్షాల సలహాలు ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోదు. 

కాని వారి ఆలోచనలు కూడా పంచుకుంటే నష్టమేముంది? రాజధాని నిర్మాణం గందరగోళంగా ఉంది. ఆ విషయాన్ని ప్రతిపక్షాలు అడుగుతుంటే అవి పనికిమాలిన పార్టీలుగా కనబడుతున్నాయి. ప్రతిపక్షం పనికిమాలిందా? పనికొచ్చేదా? అనేది ప్రజలు నిర్ణయించాలిగాని పాలకులు కాదు. 

Show comments