నాయకురాలిగా ఎదుగుతున్న అనామకురాలు....!

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. రాజకీయ దురంధరులు పాతాళానికి పడిపోవచ్చు. జనాలకు తెలియని అనామకులు ఉన్నట్లుండి తెర మీదికి వచ్చి నాయకులుగా వెలిగిపోవచ్చు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో చకచకా జరిగిపోతుంటాయి. ప్రస్తుతం తమిళనాడులోనూ ఇలాగే జరుగుతోంది. జయలలిత మరణించాక అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఆమె ప్రియ నేస్తం శశికళా నటరాజన్‌ చేతపట్టింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూస్తోంది. అది జరుగుతుందా? జరగదా? ఎలా జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేం. జయలలలిత వారసురాలిగా శశికళను అన్నాడీఎంకేలోని మెజారిటీ నాయకులు అంగీకరించారు. అదే సమయంలో వ్యతిరేకత కూడా ప్రబలుతోంది. ఇక్కడ చెప్పుకోవల్సిన విషయమేమిటంటే అమ్మకు చిన్నమ్మ సరైన వారసురాలా? కాదా? అనే విషయం పక్కనబెడితే తమిళనాడులో ఆమె పాపులర్‌ పర్సన్‌ అనే విషయం అందరికీ తెలుసు. ఇందుకు కారణం జయలలిత. మూడు దశాబ్దాలకు పైగా ఆమె స్నేహితురాలిగా, సలహాదారుగా, కేర్‌ టేకర్‌గా పోయస్‌ గార్డెన్‌ ఇంట్లోనే ఉంటున్న శశికళ అన్నాడీఎంకేలో ప్రతి ఒక్కరికీ తెలుసు.             

ముఖ్యమంత్రిగా జయలలిత తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనక కీలకంగా ఉన్నది శశికళేనని కొందరు నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో శశికళ బంధువులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు కీలకంగా ఉన్నారు. అంటే పేరుకు జయ తెరచాటున ఉన్నప్పటికీ ఆమెకంటూ సొంత నెట్‌వర్క్‌ ఉందన్నమాట. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకూ పెద్ద వాటానే ఉంది. శశికళకు రాజకీయ సామర్థ్యం, పరిపాలన చేసే సత్తా ఉన్నాయని ఆమెకు మద్దతు ఇస్తున్న నాయకులు చెబుతున్నారు. ఆ విషయమెలా ఉన్నా శశికళ అనామకురాలు కాదు. మరి నాయకురాలిగా ఎదుగుతున్న అనామకురాలు ఎవరు? జయలలిత మేనకోడలు (అన్న జయకుమార్‌ కుమార్తె) దీపా జయకుమార్‌. ఈమె జయలలిత మేనకోడలు కదా. అనామకురాలు ఎలా అవుతుంది? అనుకోవచ్చు.

రాష్ట్ర ప్రజలకు శశికళ గురించి తెలిసినంతగా దీప గురించి తెలియదు. ఆమె నివసిస్తున్న అణ్ణానగర్‌లో కొద్దిమందికి తెలిసివుండొచ్చేమో. దీప ఎవరో తెలిసింది జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడే. అత్తను చూద్దామని ఆస్పత్రికి వచ్చిన ఆమెకు అనుమతి దొరకలేదు. తాను జయలలిత మేనకోడలినని చెప్పుకోవడంతో మీడియా ఆమెను హైలైట్‌ చేసింది. దీంతో దీప పేరు మారుమోగిపోయింది. జయకు తాను రాజకీయ వారసురాలినని, ఆస్తులు కూడా తమ కుటుంబానికే చెందాలని ప్రకటించి దీప కాస్తంత సంచలనం సృష్టించింది. జయ మరణం వెనక అనుమానాలున్నాయని, దీని వెనక నిజాలను వెలికి తీసేందుకు తాను పోరాటం చేస్తానని చెప్పడంతో శశికళ వ్యతిరేకవర్గానికి ఓ నాయకురాలు దొరికినట్లయింది. దీప 'అమ్మ' జయలలిత పోలికల్లో ఉండటం, ఆమె రక్త సంబంధీకురాలు కావడంతో శశికళపై పోరాటం చేయడానికి ఆలంబన దొరికినట్లయింది. దీపకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. 'దీప పెరవై' పేరుతో అభిమాన సంఘం కూడా ఏర్పాటైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి దీప ఇంటికి ప్రతి రోజు తండోపపండాలుగా జనం తరలివస్తున్నట్లు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక రాసింది. 

అన్నాడీఎంకేలో శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు దీపకు మద్దతు ఇస్తున్నారు. దీపను చిన్నమ్మకు గట్టి పోటీదారుగా తయారుచేస్తున్నారు. తన రాజకీయరంగ ప్రవేశాన్ని ఎవ్వరూ ఆపలేరని ప్రకటించిన మేనకోడలు సొంత పార్టీ పెట్టబోతున్నట్లు తాజాగా  ప్రకటించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపింది. తాము కొత్త ప్రయాణం ప్రారంభించామని, పార్టీపై త్వరలోనే ప్రకటన చేస్తామని దీప చెప్పింది. జయ వారసురాలు దీప మాత్రమేనని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఆమె ఇంటి దగ్గరే కాకుండా, నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఫెక్సీలు ఏర్పాటు చేశారు. శశికళకు అన్ని రకాలుగా సమర్థత ఉందని ఆమె మద్దతుదారులు చెప్పుకున్నట్లుగానే దీప సర్వ సమర్థురాలని ఆమెకు మద్దతు ఇస్తున్నవారు చెప్పుకుంటున్నారు.  జయలలితతో దీర్ఘకాలంగా సంబంధాలు లేని, రాజకీయాలతో సంబంధం లేని, జయ మేనకోడలని కూడా ఎవ్వరికీ తెలియని దీప ఇప్పుడు నాయకురాలిగా ఎదగడం ఆశ్చర్యమే. ఆమె శశికళను ఎంతవరకు తట్టుకొని నిలబడుతుందో, రాజకీయాల్లో ఎంతవరకు స్థిరంగా ఉంటుందో చూడాలి. 

Show comments