ఉన్నది ఉన్నట్లుగా - మీడియా అతి చేస్తోందా?

పూరి హర్ట్ అయ్యాడు. రోజూ నాతో ముచ్చటిస్తూ, టీ తాగే జర్నలిస్ట్ లు ఇలా చేసారేమిటా? అని కిందా మీదా అయ్యాడు.

కానీ పూరికి తెలియంది. చంద్రబాబుకు తెలిసింది వేరే విషయం వుంది. జర్నలిస్ట్ లు అంటే మీడియా అనుకుంటున్నాడు పూరిజగన్నాధ్. అది పురానా జమానా సంగతి. ఇప్పుడు జర్నలిస్ట్ లు వేరు. మీడియా వేరు. జర్నలిస్ట్ లు అంటే జస్ట్ ఉద్యోగులు. మీడియా అంటే మేనేజ్ మెంట్. అంటే ఆ మీడియా అనబడే మేనేజ్ మెంట్ ను బట్టే వార్తలు వుంటాయి కానీ జర్నలిస్టులను బట్టి కాదు.

రెగ్యులర్ సాదా సీదా వార్తలు జర్నలిస్టుల ఇష్టం కావచ్చు. కానీ కీలమైన సంగతులు అన్నీ మేనేజ్ మెంట్ సిద్దాంతాలు, మేనేజ్ మెంట్ సంబంధాలు, మేనేజ్ మెంట్ కులాల ఈక్వేషన్లు, మేనేజ్ మెంట్ రాజకీయాలు, మేనేజ్ మెంట్ అవసరాలు ఇలా అన్నింటి మీదా ఆధారపడి వుంటాయి.

అందుకే బాబు అలా

అందుకే చంద్రబాబు జర్నలిస్ట్ లను నమ్ముకోరు. మేనేజ్ మెంట్ లను మేనేజ్ చేసుకుంటారు. బాబు అనుకూల పత్రికల్లో జర్నలిస్ట్ లకు ఇష్టమై ఆయనకు అనుకూల వార్తలు వండి వారుస్తున్నారు అనుకుంటున్నారా? అబ్బే. జీతం ఇస్తున్న మేనేజ్ మెంట్ ఎలా అంటే అలా అన్నమాట. సాక్షి పత్రిక స్టార్ట్ చేసిన తరువాత అందులో చేరిన చాలా మంది బాబు అనుకూల పత్రికల్లోంచి వచ్చి చేరిన వారే. మరి వారంతా ఉన్నట్లుండి బాబు వ్యతిరేక వార్తలు ఎలా వండి వార్చారు? మేనేజ్ మెంట్ ను బట్టి.

తోకకు విశ్వాసం ఎక్కువ

నాకు తెలిసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇలా అనేవారు. ' కుక్క కన్నా తోకకు విశ్వాసం ఎక్కువ. అందుకే అదే ఎక్కువ ఊగుతుంటుంది' అని. మేనేజ్ మెంట్ గుడ్ లుక్స్ లో వుండాలనుకునే జర్నలిస్ట్ లు కొందరు వుంటారు. వాళ్లెలా ఆలోచిస్తారంటే, యజమాని మనసెరిగి వార్తలు రాస్తే మన పరిస్థితి బాగుంటుంది అని అనుకుంటారు. అందుకే పత్రిక పాలసీ ప్రకారం మరింతగా రెచ్చి పోతుంటారు. పూరిజగన్నాధ్ కి ఎంత మంది జర్నలిస్ట్ లు మిత్రులుగా వున్నా ఊపయోగం లేదు. అదే మేనేజ్ మెంట్ లు మిత్రులుగా వుంటే, అన్నీ కవరైపోతాయి.

చానెళ్ల సందడి

నిన్నటికి నిన్న పూరిజగన్నాధ్ తన విచారణ ముగించుకుని ఏక్షణమైనా అయిదో అంతస్తు నుంచి కిందకు వస్తారు. కానీ అది ఏ క్షణం అన్నది తెలియదు. అందుకే కెమేరాలు అటే జూమ్ చేసి వదిలేసారు. అలా అని చానెళ్లు వేరే ప్రొగ్రామ్ తీసుకోలేవు. అదే అలా లైవ్ లో వుంచేయాలి. అలా వుంచేస్తే ఎలా? అదేమైనా చావు కార్యక్రమమా? ఓ విషాద సంగీతం నేపథ్యంలో ప్లే చేసి వదిలేయడానికి. ఏదో ఒకటి వల్లిస్తూ వుండాలి.

ఎంతకని చెబుతారు? పాడిందే పాడరా? అన్నట్లుగా, ఒకటే రొద. పొద్దున్న 9తరువాత బయల్దేరారు. 10కి వచ్చారు. ఆయన వెంట ఫలానా వాళ్లు వచ్చారు. ఇలా చెప్పిందే, చెప్పిందే, రైల్వే ఫ్లాట్ ఫారమ్ మీద అనౌన్స్ మెంట్ లా చెప్పీ చెప్పీ బుర్రలు బొప్పికట్టించారు. దాంతో జనాలు చానెళ్లు తిప్పేయక ఏం చేస్తారు?

మిడి మిడి జ్ఞానం

టెస్టింగ్ కిట్ తో డాక్టర్ వెళ్లారు. ఓ ఏంకరిణి అంటారు ఇలా..' సాధారణంగా అరెస్ట్ చేసే ముందు వైద్య పరీక్షలు చేస్తారు, అందువల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి' అని. తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానం అంటే ఇదే. నిజంగా పూరిని అరెస్ట్ చేసారు అనుకుందాం. ముందు సాయంత్రం కోర్టు పని వేళలు దాటిపోతే తిన్నగా మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారు. ఆ తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ పరీక్షలు చేస్తారు. అంతే కానీ ముందు డాక్టర్ ను తీసుకువచ్చి పరీక్షలు చేయరు. 

సాక్షి కూడా

వైఎస్ జగన్ ను విచారించినపుడు నిత్యం ఆయన వ్యతిరేక పత్రికల్లో కీ హోల్ జర్నలిజం వార్తలు కనిపించేవి. జగన్ కోపంతో కుర్చీ తన్నేసారు. ఇలా అలా అంటూ. చూసినట్లు, ఎవరో చెప్పినట్లు. దానికి సాక్షి పత్రిక కౌంటర్లు రాసేది. అలాంటి సాక్షి పత్రిక కూడా ఈ రోజు జగన్ విచారణపై లోపల ఏం జరిగిందో అన్నది అక్కడే వుండి చూసినట్లు వార్తలు వండి వార్చింది. 

ఓ పత్రిక అయితే మూడు గదుల్లో తిప్పారు. మూడు వందల నుంచి నాలుగు వందల ప్రశ్నలు వేసారు పతాక శీర్షికలో వేసారు.. కానీ వార్తలోకి వెళ్తే మూడు గదుల ఊసే లేదు. పది గంటల విచారణ అంటే 600నిమషాలు. అందులో లంచ్ రెస్ట్, ఇతరత్రా వ్యవహారాలు తీసేస్తే 500 నిమషాలు అనుకుందాం. అయిదు వందల నిమషాల్లో నాలుగు వందల ప్రశ్నలు వేయడం సాధ్యమేనా? నమ్మదగ్గదేనా? మరి నాలుగు వందల ప్రశ్నలు వేస్తే, కేవలం పది రొటీన్ ప్రశ్నలే బయటకు వచ్చాయా? అవి అందరికీ తెలిసినవీ అనుకున్నవే. 

ఇదంతా దేని కోసం?

తమ చానెల్ కాస్త ఎక్కువ అందించింది. తమ పత్రిక కాస్త ఎక్కువ వివారాలు ఇచ్చింది అనిపించుకోవడం కోసం తప్ప ఇదంతా మరెందు కోసమూ కాదు. పైగా ఇక్కడ మళ్లీ జర్నలిస్టులకు సమస్యే. తమ మేనేజ్ మెంట్, తమ ఎడిటోరియల్ బోర్డు ఎక్కడ తాను సరిగ్గా పనిచేయలేదు అనుకుంటుందో? ఎక్స్ క్లూజివ్ వివరాలు తేలేదు అనుకుంటుందో అని? ఎవరికి వాళ్లు ఏవో కథలు అల్లేయడం.

జర్నలిజం లోంచి తప్పుకుని, సినిమా రంగంలో వేరే పని చేసుకుంటున్న ఓ పెద్దాయిన ఇలా అన్నారు..''ఈ తరహా మేనేజ్ మెంట్లు, ఈ తరహా జర్నలిజం వున్న కాలంలో నేను జర్నలిస్ట్ గా లేనందుకు, ఆనందంగా ఫీలవుతున్నా' అని.

వెనక్కు తీసుకోలేరు

ఏ మీడియా అయినా ఒక్క సెకెండ్ ఆలోచిస్తే పరిస్థితి ఇలా వుండదు. దొరికాడు బాదేయండి అన్నట్లు కాకుండా, ఒకవేళ ఇది నిజం కాకపోతే, వాడు నిర్దోషి అని తేలితే, మనం క్షమాపణ చెప్పే అవకాశం మీడియా పరంగా వుంటుందా? చేసిన అతికి పశ్చాత్తాప పడుతూ చేయగలిగేది ఏమయినా వుంటుందా? అన్నది కాస్తయినా ఆలోచించాలి.

సంచలన వార్త అందించడం వేరు. వార్తను సంచలనం చేయడం వేరు. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే, మీడియా అతి అన్నది వుండదు. కానీ జర్నలిస్టులు వేరు, మీడియా వేరు అయిన కాలంలో ఇలాంటి సుద్దులు పనికిరావేమో?

-ఆర్వీ

Show comments