చెర్రీ, మహేష్‌.. ఫ్రెండ్సంట.!

రామ్‌చరణ్‌, మహేష్‌బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడండోయ్‌. 'లోడ్స్‌ ఆఫ్‌ సక్సెస్‌ అండ్‌ హ్యాపీనెస్‌..' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో రామ్‌చరణ్‌ పెట్టిన పోస్ట్‌కి, మహేష్‌ అభిమానుల నుంచి బీభత్సమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. 

బాలీవుడ్‌లో తీసుకుంటే, అక్కడ హీరోల మధ్య బేషజాలు తక్కువ. అందుకే ఎడా పెడా అక్కడ మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చేస్తాయి. టాలీవుడ్‌లో అలా కాదు. ఓ హీరో సినిమాలో ఇంకో హీరో నటిస్తే అభిమానులు 'మా అభిమాన హీరో పాత్ర తక్కువ, ఎక్కువ..' అంటూ కొట్లాడుకుంటుంటారు. అందుకే, చాలా అరుదుగా మాత్రమే టాలీవుడ్‌లో మల్టీ స్టారర్స్‌ వస్తుంటాయి. ఈ హీరోల అభిమానుల దురభిమానం పుణ్యమా అని, హీరోలు కూడా ఓపెన్‌గా కలుసుకోలేని పరిస్థితి. 

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌ మంచి స్నేహితులు. అప్పట్లో మహేష్‌ సినిమా పైరసీకి గురైతే, పవన్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయి, మహేష్‌కి అండగా నిలిచాడు. మహేష్‌ కూడా ఓ సందర్భంలో మెగాస్టార్‌ చిరంజీవిని కీర్తిస్తూ, 'వన్‌ టు టెన్‌ చిరంజీవే.. ఆ తర్వాతే మేమంతా..' అని చెప్పుకొచ్చాడు. 

తెలుగు సినిమా మార్కెట్‌ బాగా పెరిగిపోయిందిప్పుడు. పెరిగిన మార్కెట్‌ని క్యాష్‌ చేసుకోవాలంటే హీరోల మధ్య సఖ్యత పెరగాలి. తద్వారా, సినిమాకి రెవెన్యూస్‌ పెరుగుతాయి.. అదే సమయంలో మల్టీ స్టారర్స్‌ వచ్చేందుకూ మార్గం సుగమమవుతోంది. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో 'మహేష్‌ అంటే నాకిష్టం..' అని చెప్పిన రామ్‌చరణ్‌ (ఇది కూడా సోషల్‌ మీడియాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇంటర్వ్యూనే), ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ మహేష్‌కి బర్త్‌ డే విషెస్‌ చెప్పడాన్ని అభినందించాల్సిదే ఎవరైనా.

Show comments