'బాహుబలి - ది బిగినింగ్'తో టాలీవుడ్ బిజినెస్ లెక్కలు మారి ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు. అప్పుడే మరోసారి తెలుగు సినిమా పరిధిని మరింత పెంచడానికి 'బాహుబలి - ది కంక్లూజన్' వచ్చేస్తోంది. పరిధి ఎంతనేది కొలిచే దమ్ము, ఓర్పు ఉండాలే కానీ తెలుగు సినిమా విపణికి ఎల్లలు లేవని చూపెట్టింది బాహుబలి. రిలీజ్‌కి ముందు వంద కోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేసిన చిత్రం అంచనాలని మించిన అంచనాలని కూడా దాటేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, కేరళలో కూడా సంచలనం చేసిన బాహుబలి అటు బాలీవుడ్‌లోను వంద కోట్ల పతాకాన్ని పాతేసి వచ్చింది. 'ఎవరో రాజమౌళి తీసిన బాహుబలి అంట' అనుకున్నప్పుడే పక్క రాష్ట్రాల్లో అలాంటి సంచలనం చేస్తే... 'బాహుబలి కథలో రెండో భాగం ఎప్పుడెప్పుడా' అని ఎదురు చూస్తోన్న ఈ తరుణంలో అది సృష్టించబోయే ప్రభంజనాన్ని లెక్కించడానికి ఊహలు సైతం అలసిపోతాయి.
'బాహుబలి'కి ముందు పెద్ద సినిమాల బిజినెస్ యాభై నుంచి అరవై కోట్ల మధ్య జరిగేది. బాహుబలి తర్వాత ఎనభై నుంచి తొంభై కోట్ల స్థాయికి పెరిగింది. సర్దార్ గబ్బర్‌సింగ్ అయినా, బ్రహ్మూెత్సవం అయినా వంద కోట్లకి తక్కువ వసూలు చేయవనే అంచనాలతోనే బయ్యర్లు ఆ స్థాయిలో వాటి హక్కులు కొనేసారు. తాజాగా చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'కి కూడా బిజినెస్ తొంభై కోట్ల వరకు జరిగినట్టు వార్తలొస్తున్నాయి. అంటే ఇప్పుడు తెలుగు సినిమాకి వంద కోట్లు షేర్ వస్తే జస్ట్ హిట్ అన్నమాట. బయ్యర్లకి ఏదో పదీ, పరకా లాభాలు మినహా వంద కోట్లు వసూలు చేసిన సినిమాతో పెద్దగా మిగిలేదేమీ ఉండదన్నమాట. వంద కోట్లు వసూలు చేస్తే నథింగ్ అనుకుంటున్నారు కాబట్టే తెలుగు సినిమా పరిధి పెంచడానికి పర భాషల మార్కెట్‌నీ టార్గెట్ చేస్తున్నారు. మిగతా అందరి కంటే ఈ విషయంలో మహేష్ ముందున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో కలిసి సినిమా చేస్తుండేసరికి దానికి ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా క్రేజ్ ఏర్పడింది. మురుగదాస్‌కి బాలీవుడ్‌లోను పేరుంది కనుక అక్కడికీ అనువాదమవుతోంది. దీంతో ఈ చిత్రానికి నూట యాభై కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనే అంచనాలున్నాయి.
సంచలనాలకే సంచలనం!
తెలుగు సినిమా మార్కెట్ డైనమిక్స్ మారిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది రాబోతున్న భారీ చిత్రాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. భారీ సినిమాలు, క్రేజీ కాంబినేషన్లు ఎన్ని ఉన్నప్పటికీ ఈ ఏడాదికి 'మోస్ట్ అవైటెడ్ మూవీ' మాత్రం 'బాహుబలి - ది కంక్లూజన్' అనే దాంట్లో అనుమానాలక్కర్లేదు. ఏప్రిల్ 28న రాబోతున్న ఈ చిత్రం సంచలనాలకే సంచలనం అవుతుందనేది తక్కువలో తక్కువగా ఉన్న అంచనా. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకీ లేనంత హైప్‌తో వస్తోన్న ఈ చిత్రం విషయంలో రాజమౌళి ఏమాత్రం టెన్షన్ పడడం లేదు. చాలా కూల్‌గా షూటింగ్ పూర్తి చేసేసి, ప్రస్తుతం బాహుబలికి గ్రాఫిక్స్ హంగులు అద్దిస్తున్నాడు. నాలుగేళ్లని పూర్తిగా ఈ సినిమాకే అంకితం చేసిన ప్రభాస్ ఎట్టకేలకు ఖాళీ అయ్యాడు. అయితే రాజమౌళి నుంచి 'గో ఎహెడ్' అనే భరోసా వచ్చేవరకు గెటప్ మార్చడు, వేరే సినిమా మొదలు పెట్టడనుకోండి.
ఏదైనా ఒక సినిమా ఘన విజయం సాధిస్తే ఆ రికార్డులని బ్రేక్ చేసే సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసే ఆలోచన కూడా వ్యర్ధమన్నట్టు... దానిని అలా వదిలేసి రెండో స్థానం కోసమే అంతా పోటీ పడుతున్నారు. కనుక బాహుబలి సెట్ చేసిన రికార్డులని రీసెట్ చేసే బాధ్యత ఇప్పుడు రెండో బాహుబలిదే.
వెటరన్స్ వార్!
బాహుబలిని అటుంచితే ఈ ఏడాదికి బాక్సాఫీస్ బొనాంజాకి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ కంటే క్లాసిక్ బిగినింగ్ ఏముంటుంది? చిరంజీవి రీఎంట్రీకి 'ఖైదీ నంబర్ 150' అనే సేఫ్ కమర్షియల్, సోషల్ సినిమాని ఎంచుకుంటే, బాలకృష్ణ చారిత్రక చిత్రమైన 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో వస్తున్నాడు. ఒకటి చిరంజీవి 150వ చిత్రం కావడం, మరొకటి బాలకృష్ణ వందవ చిత్రం అవడంతో సహజంగానే వీటిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన సినిమా అవడంతో 'ఖైదీ నంబర్ 150'పై అంచనాలు ఏర్పడ్డాయి. చారిత్రక కథ, ఇలాంటి కథలకి అతికినట్టు సరిపోయే బాలకృష్ణ చేయడంతో 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై కూడా నమ్మకం బాగా వుంది. ఈ రెండు చిత్రాల ఎపిక్ క్లాష్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది తెలియదు కానీ, దాదాపు నూట యాభై కోట్ల బిజినెస్ ఈ సినిమాలపై ఆధారపడింది. రెండూ ఘన విజయాలు అందుకుంటే, ఈ ఏడాదికి అంతకంటే శుభారంభం ఉండదు.
సమ్మర్ వెరీ స్పెషల్!
బాహుబలి కాకుండా ఈ వేసవిలో మరిన్ని భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ముందుగా పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు'తో సమ్మర్ కాస్త ఎర్లీగా ఉగాదితోనే మొదలు కానుంది. రీమేక్ చిత్రమే అయినప్పటికీ పవన్ ఉంటే ఏ సినిమాపై అయినా అంచనాలు మామూలే కనుక 'కాటమరాయుడు' వేసవికి సూపర్బ్ స్టార్ట్ ఇస్తాడనే ఆశిద్దాం.
మహేష్, మురుగదాస్‌ల చిత్రానికి ఇంకా డేట్ ఫిక్స్ అవలేదు. బాహుబలి రిలీజ్ డేట్ అనుగుణంగా ఈ చిత్రం మే లేదా జూన్‌లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలొస్తోన్న ఈ చిత్రం తెలుగు సినిమా మార్కెట్ ఎక్స్‌పాన్షన్ పరంగా చాలా కీలకం కానుంది. అన్నీ బాహుబలిలాంటి భారీ బడ్జెట్, యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు రాలేవు కనుక మన హీరోలకి తమిళనాడులో మార్కెట్ పెరగడానికి అక్కడి దర్శకులతో జత కట్టడం మంచి స్ట్రాటజీ. ఈ చిత్రం వర్కవుట్ అయినట్టయితే తమిళ హీరోలు మన అగ్ర దర్శకులతో, మన హీరోలు అక్కడి అగ్ర దర్శకులతో సినిమాలు చేసే ట్రెండ్ ఊపందుకుంటుంది.
ప్రతి వేసవిలోను తన సినిమా ఒకటి రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటోన్న అల్లు అర్జున్ ఈసారి 'దువ్వాడ జగన్నాధమ్'గా రాబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఎంటర్‌టైనర్ బన్నీ ఇమేజ్‌కి అనుగుణంగా అన్ని తరగతుల ప్రేక్షకులనీ ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతోంది. దీని రిలీజ్ డేట్ కూడా 'బాహుబలి'తో ముడిపడి ఉన్నట్టు సమాచారం.
సెకండ్ హాఫ్‌లో కీ ప్లేయర్స్!
సమ్మర్‌లో పెద్ద సినిమాల హడావిడి ముగిసిన తర్వాత ఇక ఈ ఏడాదిలో ద్వితీయార్ధాన్ని హోల్డ్ చేసి బాక్సాఫీస్‌ని బిజీగా ఉంచే బాధ్యత ఈ మూడు సినిమాలపై వుంది. రజనీకాంత్, శంకర్‌ల '2.0', ఎన్టీఆర్, బాబీ చిత్రంతో పాటు చరణ్, సుకుమార్‌ల చిత్రాలు సెకండ్ హాఫ్‌లో రిలీజ్ అవుతాయి. రజనీకాంత్, శంకర్‌ల 'రోబో' సీక్వెల్ కూడా 'బాహుబలి' మాదిరిగా సెన్సేషన్ అవుతుందనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పెరిగిన మార్కెట్‌కి అనుగుణంగా ఇప్పుడు మళ్లీ 'రోబో' మాదిరిగా శంకర్, రజనీ ఎంటర్‌టైన్ చేసినట్టయితే 2.0తో అనితరసాధ్యమైన ఫీట్లు సాధ్యమే. మంచి ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఏరి కోరి చేస్తోన్న బాబీ చిత్రంలో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడు. అలాగే ధృవతో ట్రాక్ మార్చిన చరణ్ ఈసారి సుకుమార్‌తో వైవిధ్యమైన వినోదంతో రాబోతున్నాడు.
నోటబుల్ ఫిలిమ్స్!
ఇవి కాకుండా ఈ ఏడాదిలో రాబోతున్న చిత్రాల్లో చెప్పుకోతగ్గవి చాలానే ఉన్నాయి. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో వస్తోన్న భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' ఫిబ్రవరిలో విడుదల కానుంది. వెంకటేష్ చేస్తోన్న 'సాలా ఖడూస్' రీమేక్ అయిన 'గురు' ఏప్రిల్‌లో విడుదలకి సిద్ధమవుతోంది. నాగ్ నటిస్తున్న హారర్ కామెడీ 'రాజుగారి గది 2' కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుంది. సాయిధరమ్ తేజ్, గోపీచంద్ మలినేనిల 'విన్నర్' ఫిబ్రవరిలో, వరుణ్‌తేజ్, శ్రీను వైట్ల 'మిస్టర్' ఏప్రిల్‌లో అలరించనున్నాయి.
నాగచైతన్య, 'సోగ్గాడే' ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ చిత్రం, అఖిల్, విక్రమ్‌కుమార్‌ల చిత్రం కూడా ఈ ఏడాది ద్వితీయార్ధానికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలోనే 'శతమానం భవతి'తో అదృష్టం పరీక్షించుకుంటూ వుంటే, నాని ఏమో 'నేను లోకల్' అంటూ ఫిబ్రవరిలో పలకరించబోతున్నాడు. నితిన్‌కి హను రాఘవపూడి సినిమాతో పాటు పవన్-త్రివిక్రమ్ నిర్మిస్తున్న చిత్రం కూడా పైప్‌లైన్‌లో వుంది. నిఖిల్ మళ్లీ 'స్వామిరారా' దర్శకుడు సుధీర్‌వర్మతో చేస్తోన్న 'కేశవ' ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకుంది. అనువాద చిత్రాల్లో సూర్య 'సింగం 3' జనవరిలోనే రిలీజ్ అవుతుండగా, కమల్ 'శభాష్ నాయుడు' త్వరలోనే విడుదల కానుంది. ఇంకా పలు స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల చిట్టా చాలానే వుంది. గత ఏడాది సక్సెస్ రేట్ బాగుండడంతో ఈ సంవత్సరం అది ఇంకా బెటర్ అవుతుందనే ఆశలు మార్కెట్ వర్గాల్లో వున్నాయి. మరి మార్కెట్ స్వరూపాన్ని మార్చేసే పెద్ద సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో, గేమ్ ఛేంజర్స్ అనిపించే చిన్న చిత్రాలు ఎన్ని వస్తాయో వేచి చూస్తూ... లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్.
గణేష్ రావూరి