అమరావతికి టాలీవుడ్‌.. ఏంటీ, నిజమే.!

మొన్నేమో విశాఖపట్నం అన్నారు.. అంతకు ముందు నెల్లూరు పేరుతో రచ్చరచ్చ చేసేశారు.. ఇప్పుడేమో రాజధాని అమరావతి పేరు చెబుతున్నారు.. ఇంతకీ, తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి ఎక్కడికి వెళుతుంది.? తెలంగాణలో తెలుగు సినిమాకి పొగ పెడ్తున్నారా.? చంద్రబాబు పిలుపుకి తెలుగు సినీ పరిశ్రమ పరవశించిపోయి.. హైద్రాబాద్‌కి గుడ్‌ బై చెప్పేయాలనుకుంటోందా.? ఇంతకీ వాస్తవమేంటి.! 

కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే, ఒకప్పుడు తెలుగు సినిమాకి కేరాఫ్‌ అడ్రస్‌ తమిళనాడులోని చెన్నయ్‌. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఇప్పటికీ చాలామంది తెలుగు సినీ ప్రముఖులకు కేరాఫ్‌ అడ్రస్‌ చెన్నయ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి తెలుగు సినీ పరిశ్రమ తరలి రావడానికి 'పురిటినొప్పులు' పడిందన్నది నిర్వివాదాంశం. 

మరిప్పుడు, హైద్రాబాద్‌ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఇంకో చోటకి తరలి వెళ్ళాల్సి వస్తే, ఎంత కాలం పడ్తుందట.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. అయినా, హైద్రాబాద్‌ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఇంకెక్కడికైనా ఎందుకు వెళ్ళాలి.? అన్న ప్రశ్న ముందుగా ఉత్పన్నమవుతుంది. ఆ ఆలోచనగానీ, అవసరంగానీ తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ లేదనే చెప్పాలి. అంతలా హైద్రాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ వేళ్ళూనుకునిపోయింది. తెలంగాణ సర్కార్‌ సైతం, తెలుగు సినీ పరిశ్రమకు మరింతగా అండదండలందిస్తామంటోంది. 

మరి, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.? ఏమోగానీ, కొత్తగా ఏపీ ఫిలిం అండ్‌ టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్న టీడీపీ నేత, సినీ నిర్మాత అంబికా కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే గనుక, వారందర్నీ కలిసి ఒప్పించి, తెలుగు సినీ పరిశ్రమను అమరావతికి రప్పించేస్తానంటున్నారు. 'జన్మభూమి..' అంటూ సెంటిమెంట్‌ కార్డ్‌ ప్లే చేస్తున్నారాయన. చిరంజీవి, సొంతూరు మొగల్తూరుని ఎప్పుడో మర్చిపోయారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ మాటేమిటి.? అక్కినేని కుటుంబం పరిస్థితేంటి.? చెప్పుకుంటూ పోతే, సినీ పరిశ్రమలో 'జన్మభూమి' సెంటిమెంట్లు చాలా చాలా తక్కువ. 

పిలవగానే పరిగెత్తుకొచ్చేయడానికి, అమరావతిలో అయినా ఇంకో చోట అయినా సినీ పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులుండాలి కదా.! గడచిన మూడేళ్ళలో కనీసం చంద్రబాబు సర్కార్‌, ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమకు తగిన సానుకూల వాతావరణమే సృష్టించలేకపోయింది. స్టూడియోల నిర్మాణం, ఇతరత్రా సౌకర్యాల నిమిత్తం చంద్రబాబు సర్కార్‌ సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చి వుంటే, హైద్రాబాద్‌ని ఖాళీ చేసెయ్యకపోయినా టాలీవుడ్‌కి రెండో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక నగరాన్ని సినీ పరిశ్రమ ఎంచుకుని వుండేదేమో.! 

నామినేటెడ్‌ పోస్టులంటేనే రాజకీయ నిరుద్యోగుల కోసం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా పదవి దక్కించుకున్న అంబికా కృష్ణ, సినీ పరిశ్రమను తరలించేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంటే, ఫక్కున నవ్వుకుంటోంది తెలుగు సినీ పరిశ్రమ.

Show comments