సహజ నటి జయసుధకు తీరని అన్యాయం జరిగింది. విధి ఆమెను విషాదంలో ముంచింది. భర్త నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇప్పటివరకైతే తెలియదు. తెర వెనక కథలేమైనా ఉన్నట్లయితే కాలం గడు స్తున్నకొద్దీ ముందుకు రావొచ్చు. మీడియాలో వచ్చిన కథ నాలనుబట్టి చూస్తే హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవల్సి నంత ఆర్థిక, కుటుంబ సమస్యలు లేవని తెలుస్తోంది. సొంత సినిమాలు తీసి కొంతమేరకు ఆర్థికంగా నష్టపోయినా కుటుంబం రోడ్డున పడేంత సమస్యలు లేవు. ఆర్థిక సమస్యల కారణంగా జయసుధ-నితిన్ కపూర్ మధ్య ఘర్షణలు జరిగినట్లుగా, ఆ కారణంగా వారు విడిపోయ నట్లుగా కూడా ఎక్కడా దాఖలాలు లేవు. వారిది అన్యోన్య దాంపత్యమని, తాజాగా కొన్ని సినిమా కార్యక్రమాలకూ కలిసి వెళ్లారని మీడియా సమాచారం. ఒకప్పటి టాప్ హీరోయిన్ జయసుధకు ఇప్పటికీ చేతిలో సినిమాలు ఉంటూనే ఉన్నాయి. ఏడాదికి సుమారుగా పది సినిమాలు చేస్తున్నారని, సినిమాకు పాతిక లక్షలు ఇస్తున్నారని ఓ పత్రిక రాసింది. భర్త నితిన్ కపూర్ సౌమ్యుడని కూడా మీడియా సమాచారం. కాకపోతే ఇద్దరు కుమారులు ఏం చేస్తున్నారు? ఎలా సెటిల్ అయ్యారనేది తెలియలేదు.
నితిన్ డిప్రెషన్‌లో ఎందుకు పడిపోయాడో తెలియాల్సి వుంది. అతను సూసైడ్ నోట్ రాయలేదు కాబట్టి ఏం జరిగివుంటుందనేది జయసుధ చెబితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఈ విషాదం నుంచి ఆమె తేరుకోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ ప్రభావం ఆమె సినీ జీవితంపై ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. ఆమె ఆర్థిక వనరు సినిమాయే కాబట్టి విషాదం నుంచి తేరుకున్న తరువాత సినిమాల్లో నటించాల్సిరావచ్చు. లేదా మరోమార్గం ఉందేమో తెలియదు. ఇక చెప్పుకోవల్సిన విషయం ఆమె రాజకీయ జీవితం. ఆమె మాజీ ఎమ్మెల్యే. గత సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెసు తరపున పోటీ చేసి ఓడిపోయిన తరువాత కొంతకాలం క్రితం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినా రాజకీయ రంగం నుంచి పూర్తిగా వైదొలగలేదు. టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అవకాశం ఇచ్చేవారోగాని ఈలోగా ఆమె జీవితాన్ని విషాదం కమ్ముకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జయసుధ రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెసు పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు భర్త నితిన్ కపూర్ సహకారం, అండదండలున్నాయి. రాజకీయాలు వారి కుటుంబంలో వివాదాలకు దారితీయలేదు. ఇక ఆమె విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు నితిన్ కపూర్ ఆమె వెంటే ఉన్నారు.
సో...ఆమె రాజకీయ జీవితానికి ఆయన పూర్తిమద్దతు ఉందని అర్థమవుతోంది. ఈ విషాదం నుంచి తేరుకున్న తరువాత ఆమె రాజకీయ రంగంలో చురుగ్గా, ఆసక్తిగా ఉంటారా? లేదా? చూడాలి. టీనేజ్ నుంచి సినిమాల్లో నటిస్తున్న జయసుధ ఆ రంగంలో టాప్ రేంజ్‌కి వెళ్లారు. అనుకోకుండా సినిమా రంగంలో ప్రవేశించినా క్రమంగా దానిపై ఇష్టం పెంచుకొని అదే జీవితంగా గడిపారు. రాజకీయాల్లోకి కూడా అనుకోకుండా వచ్చినా ఆ రంగంపట్ల ఆమెకు ఆసక్తి లేదు. వైఎస్‌ఆర్ జీవించి ఉన్నట్లయితే ఎలా ఉండేదోగాని ఆయన పోవడంతో ఆమె ప్రాభవం అంతరించింది. ఈ 'డర్టీ పాలిటిక్స్'లో ఇమడలేకపోయారు. సినిమాల్లో బిజీ అయ్యారు. సినిమా రంగంలో ఇమేజ్ ఉన్నవారంతా రాజకీయాల్లో రాణించలేరనడానికి అనేక ఉదాహరణలున్నాయి. సినిమా రంగం నుంచి ఉత్సాహంగా రాజకీయాల్లోకొచ్చి ఉస్సూరుమంటూ మూటా ముల్లె సర్దుకుపోయిన గ్లామర్ క్వీన్‌లు, సూపర్ స్టార్‌లు, మెగాస్టార్‌లు అనేకమంది ఉన్నారు. ప్రజాదరణ విపరీతంగా ఉన్న అమితాబ్ బచ్చన్ లాంటివారే 'ఈ రాజకీయాలు మాకొద్దు బాబోయ్' అని వెళ్లిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి ఏదో అవుదామనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఇంకేదో అయిపోయి, దిక్కుతోచక కాంగ్రెసులో కలిసిపోయారు.
సినిమా రంగంలో హీరోయిన్‌గా తనశకం ముగిశాక 2004లో హైదరాబాదుకు చేరుకున్న ఆమెకు అనుకోకుండా 'రాజకీయ' యోగం పట్టింది. 2009 ఎన్నికల సమయంలో కొమ్ములు తిరిగిన కాంగ్రెసు నాయకులు టిక్కెట్ల కోసం నానా తిప్పలు పడుతున్న పరిస్థితిలో వైఎస్ రూపంలో అదృష్టం జయసుధ ఆంటి తలుపు తట్టింది. కాంగ్రెసు పార్టీలో చేరిపోవడం, సికింద్రాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యేగా గెలవడం కలమాదిరిగా జరిగిపోయింది. ఇది ఆమె ఊహించని పరిణామం. వైఎస్ తన రాజకీయ ప్రయోజనాల(కాంగ్రెస్ పార్టీ) కోసం జయసుధకు టిక్కెట్టు ఇచ్చి ప్రోత్సహించారు. ఇందుకు కారణాలు ఆమె సినిమా గ్లామర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ల ఓట్లు అధికంగా ఉండటం. జయసుధ క్రైస్తవమతం తీసుకున్నారు కదా. వైఎస్‌ఆర్ బతికుంటే ఆమెకు అండగా ఉండేవారు.
సహజనటి స్వభావం ఎవరితో కలవకపోవడం, అంటీ ముట్టనట్టుగా ఉండటం. రోజా మాదిరిగా జయసుధ యాక్టివ్ కాదు. మాట్లాడలేదు. ఆమెకు అసలు రాజకీయాల పట్ల ఆసక్తిలేదు. అవగాహన అంతకన్నా లేదు. కొందరు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినా తరువాత రాటుదేలుతారు. కాని చొరవ, దూసుకుపోయే మనస్త్తత్వం లేని సహజనటి కాంగ్రెసులో చురుగ్గా వ్యవహరించలేదు. దీంతో నాయకులూ ఈమెను పట్టించుకోలేదు. భార్యలు రాజకీయాల్లోకి వస్తే తమపంట పండినట్లేనని కొందరు భర్తలు భావిస్తారు. మరి నితిన్ కపూర్ అలా అనుకోలేదేమో...! తనను వైఎస్ రాజకీయాల్లోకి తెచ్చారు కాబట్టి ఆయన పోయిన తరువాత జయసుధ వైఎస్ కుమారుడైన జగన్ పంచన చేరారు. ఆయన చేసిన దీక్షలకు హాజరై మద్దతుగా మాట్లాడారు. కాని...జగన్ తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. అయితే ఆ మాట కోపంతో చెప్ప లేదు. తనకు రాజకీయ అనుభవం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చన్నారు.
''కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలం ఇంత గందరగోళాన్ని భరించలేం. పైగా నాకు రాజకీయాలు తెలియవు. హీరో యిన్‌గా ఉండి యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చాను'' అని చెప్పారు. ఆ తరువాత కాంగ్రెసులోనే కొనసాగి గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇంక ఆ తరువాత రాజకీయంగా మౌనాన్ని ఆశ్రయించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. చివరగా టీడీపీని ఎంచుకున్నారు. ఈమధ్య ఆంధ్రాలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరుకావడం మినహా పార్టీ కార్యక్రమాల్లో కనబ డిన దాఖలాలు లేవు. ఆమె తెలంగాణ టీడీపీలో చేరారా? ఆంధ్రా టీడీపీలో చేరారా? స్పష్టతలేదు. ఆమె రాజకీ యాల్లో కొనసాగుతారా? లేదా? అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
-మేనా