దాసరి సొమ్ము చేయి దాటిందా?

పెద్ద పెద్ద వాళ్ల లావాదేవీలకు కాగితాలు, పత్రాలు వుండవు. అందులోనూ సినిమారంగంలో మరీనూ. రాత్రికి రాత్రి కోటి కావాలంటే పంపడం, రూపాయినో, అర్థనో వడ్డీ తీసుకోవడం, ఇలాగే వుంటుంది వ్యవహారం. అంతా వసూలు చేసుకునే స్టామినా మీదా, నమ్మకాల మీద సాగుతుంది. దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కూడా ఇలాగే కొన్ని అడ్వాన్స్ లు పెట్టుబడులు ఇచినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ దగ్గర దాసరి అడ్వాన్స్ లు వున్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే డైరక్టర్ త్రివిక్రమ్ దగ్గర కూడా. అయితే ఇలాంటి అడ్వాన్స్ లు అన్నింటికీ సాధారణంగా అగ్రిమెంట్లు వుంటాయి. పైగా తీసుకున్న హీరోలు, డైరక్టర్లు పెద్దవాళ్లు కాబట్టి వెనక్కు వచ్చేస్తాయి కాస్త అటు ఇటుగా.

కానీ ఇలా కాకుండా పలువురు నిర్మాతల దగ్గర, కొందరు ఫైనాన్షియర్ల దగ్గర దాసరి డబ్బులు చలామణీ కొసం ఇచ్చినవి, కాగితం పత్రం లేకుండానే వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి వెనక్కు రావడం అన్నది వాళ్ల వాళ్ల వ్యవహారాలను బట్టి వుంటుంది.

ఇండస్ట్రీలో టాప్ ఫైనాన్షియర్ అని చెప్పుకునే వ్యక్తిగా దాసరి రూపాయికే కొన్ని కోట్లు ఇచ్చారని వదంతి వినిపిస్తోంది. అలాగే ఓ నిర్మాణ సంస్థకు కూడా ఇలా రూపాయికే దాసరి మద్దతు మొత్తం అందించారని అంటున్నారు. ఇలాంటివి వెనక్కు వస్తాయా? అసలు ఇచ్చినట్లు, ఇంట్లో పిల్లలకు తెలుసా? వీటన్నింటి మీదా ఆధారపడి వుంటుంది వెనక్కు రావడం అనే వ్యవహారం.

ఎన్టీఆర్ మరణించిన తరువాత లక్ష్మీ పార్వతి ఆయన డబ్బులు ఇలాగే కొందరికి ఇచ్చిందని, ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ ఎగ్గొట్టేసారని, ఇప్పటికీ లక్ష్మీ పార్వతి చెబుతుంటారు. సినిమా రంగంలో ఇలాగే వుంటుందేమో ?

Show comments