మళ్లీ తెర పైకి 'భరతుడు'...ఎన్నాళ్లుంటాడో...!

వీరభక్తికి, మూఢభక్తికి, ప్రేమతో కూడిన భక్తికి నిదర్శనాలుగా మన పురాణాల్లో కొన్ని పాత్రలున్నాయి. రామభక్తుడనగానే ఆంజనేయుడు గుర్తుకొస్తాడు. ఆయనదో రకమైన భక్తి. రాముడి తమ్ముళ్లలో భరతుడు ఒకడు. ఆయనదో భక్తి. రాముడు అరణ్యవాసం వెళితే ఆయన పాదుకలను (సాధారణ భాషలో చెప్పులు లేదా పాదరక్షలు) సింహాసనం మీద ఉంచి అన్నయ్య తిరిగొచ్చేంతవరకు ఆయన పేరుతో రాజ్యపాలన చేశాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. ఇలాంటి భక్తులు రాజకీయాల్లో అనేకమంది కనబడతారు. కాని వీరిలో ఇలా పరోక్షంగా రాజ్యపాలన చేసే అవకాశం ఒకళ్లకో ఇద్దరికో వస్తుంది. అది కూడా తమిళనాడులో మాత్రమే.

ఆ రాష్ట్రంలో 'అభినవ భరతుడు' ఒకప్పుడు రెండుసార్లు కొద్దికాలం (జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు)  తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒ.పన్నీర్‌శెల్వం. రెండుసార్లు ఆయన నేరుగా ముఖ్యమంత్రిగానే పనిచేయగా తాజాగా 'పరోక్ష ముఖ్యమంత్రి'గా మళ్లీ తెర మీదికి వచ్చారు. కారణం? ముఖ్యమంత్రి జయలలిత గత నెల 22వ తేదీ నుంచి ఆస్పత్రిలో ఉండటమే.  'అసలు విషయం' ఏమిటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. రెండు వారాలకు పైబడి ఈ ప్రహసనం నడుస్తున్న సంగతి తెలిసిందే. 

పేరుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా అచేతనంగా ఉంది. 'రోజువారీ పాలనా వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయి' అని మంత్రులు, అధికారులు, పార్టీ నాయకులు మభ్యపెడుతున్నా ముఖ్యమంత్రి లేని లోటు, సర్కారు సక్రమంగా పనిచేయని వైనం స్పష్టంగా కనబడుతోంది. దీంతో ఎవరో ఒకరు పాలనా వ్యవహారాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జయలలితకు అత్యంత సన్నిహితురాలు, సలహాదారు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి షీలా బాలకృష్ణన్‌ సర్వాధికారాలు చెలాయిస్తున్నట్లు మీడియాలో కథనాలొచ్చాయి. కాని ఇది రాజ్యాంగ విరుద్ధం. ముఖ్యమంత్రి ఊళ్లో లేనప్పుడుగాని, అనారోగ్యం పాలైనప్పుడుగాని ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయన లేదా సీనీయర్‌ మంత్రి బాధ్యతలు తీసుకోవాలి. కాని ఎవ్వరూ బాధ్యతలు తీసుకోకుండానే రెండు వారాలకు పైగా గడిపేశారు.

ఉప ముఖ్యమంత్రినో, తాత్కాలిక ముఖ్యమంత్రినో నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కాని పన్నీర్‌శెల్వం సహా ఏ మంత్రి కూడా 'తాత్కాలిక ముఖ్యమంత్రి' అనే ముద్ర వేయించుకొని బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కారణం? జయలలిత భయం. ఆమెకు ఆరోగ్యం కుదుటపడి తిరిగొచ్చాక నీకెవరు బాధ్యతలు అప్పగించారు? నువ్వేం నిర్ణయాలు తీసుకున్నావు? నువ్వు అంతటి మొనగాడివా? వగైరా ప్రశ్నలేస్తే జవాబు చెప్పడం కష్టం. అందుకని తాత్కాలిక ముఖ్యమంత్రిని పెట్టాల్సిన అవసరమే లేదని మంత్రులు స్పష్టంగా చెప్పేశారు.

ప్రభుత్వం అచేతనంగా ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ ఎంపీ డాక్టర్‌ సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ చేశారు కూడా. కాని రాజ్యాంగ సంక్షోభం ఏర్పడటంవల్ల ప్రభుత్వం పనిచేయడంలేదని చెప్పే పరిస్థితి లేదు. చివరకు 'తాత్కాలిక ముఖ్యమంత్రి' అనే ట్యాగ్‌ లేకుండా జయలలిత అధీనంలో ఉన్న శాఖలను ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీరుశెల్వంకు బదలాయించారు. అదొక్కటే కాకుండా మంత్రివర్గ సమావేశాలకు ఆయనే అధ్యక్షత వహిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేస్తారనే అర్థం. కాని ఆ పేరుండదు.

గతంలో రెండుసార్లు ఈయనకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటమే కాకుండా శ్రీరాముడికి భరతుడు ఎంత విధేయుడో జయకు శెల్వం అంతకంటే ఎక్కువ విధేయుడు, వీరభక్తుడు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీఆర్‌ ఇలాగే సుదీర్ఘకాలం విదేశీ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పుడు ఆయన శాఖలను మంత్రులు నెడుంజెళియన్‌, పెనృతి రామంచంద్రన్‌కు అప్పటి గవర్నర్‌ ఎస్‌ఎల్‌ ఖురానా కేటాయించారు. 

పన్నీరుశెల్వం మొదటిసారి 2001 సెప్టెంబరులో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా జయలలిత పదవి నుంచి దిగిపోయారు.  తనకు అత్యంత విధేయుడైన పన్నీరు శెల్వంను ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆయన జయ మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆంక్షలు తొలగించడంతో 2002 మార్చిలో జయ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. గత ఏడాది  అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా ప్రకటించి జైలు శిక్ష విధించడంతో 2014 సెప్టెంబరు 27న పన్నీరు శెల్వం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

ముఖ్యమంత్రి పదవి అత్యున్నతమైంది. ఆ పదవి చేశాక మంత్రిగా చేయరు. ఇది సాధారణంగా మనకు తెలిసిన విషయం. కాని పన్నీరుశెల్వం అవేమీ పట్టించుకోరు. ఆయన తనను తాను ఏనాడూ ముఖ్యమంత్రిగా భావించుకోలేదు కాబట్టి, మంత్రిగా పనిచేయడం చిన్నతనంగా భావింలేదు. ఒకవేళ ఆయన మంత్రిగా పనిచేయడానికి నిరాకరిస్తే దాన్ని జయలలిత అవిధేయతగా పరిగణిస్తారు. ఒక తోలుబొమ్మకు ఇంత అహంభావమా? అని మండిపడతారు. మరి ఇప్పుడు ఎంతకాలం జయలలిత శాఖలను చూస్తారో....!

Show comments