జగన్ ను ఎంత తీసి పారేసినా..?

జగన్ అంటే చంద్రబాబు అండ్ కో వెంట్రుక ముక్క కింద తీసేస్తారు. ప్రతిపక్ష నేత అని కానీ, తమ పార్టీకి దీటుగా నిలబడి, కాస్త లెక్కించదగ్గ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్న పార్టీకి నాయకుడు అని కానీ వారికి గుర్తు వుండదు. పిల్లకాకి అని, తనే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు ఆలోచన. ఆయన అలాగే బిహేవ్ చేస్తారు. ఇక్కడ ప్రోటోకాల్ ను కూడా కావాలనే లెక్క చేయరు. ఆహ్వానాలు అందించాలన్నా అందరికీ తాను ఇస్తారు కానీ ప్రతిపక్ష నేత అంటే ఎవర్నో ఒకర్ని పంపిస్తారు. 

అయితే అందరూ అలా వుండరు. ఓ రాష్ట్రానికి ప్రతిపక్షనేత అంటే పద్దతిగా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. ఇవ్వాలి కూడా. కానీ తెలుగుదేశం పార్టీకి అదే మింగుడు పడడం లేదట. తాము తీసి పారేసినట్లే, అందరూ జగన్ ను అస్సలు పట్టించుకోకూడదని ఆ పార్టీ నేతల ఉద్దేశం. కానీ పద్దతులు తెలిసిన వారు అలా చేయరు కదా? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తరచు జగన్ కలుస్తుంటారు. అపాయింట్ మెంట్ దొరుకుతూ వుంటుంది. అదే తెలుగుదేశం పార్టీకి మంటగా వుంటోందట. 

తమ ముఖ్యమంత్రి వెళ్లినా కలిసి, ప్రతిపక్ష నేత వెళ్లినా కలిస్తే, ఇద్దరికీ ఒకే రకమైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది కదా అని వారి బాధ. అప్పటికీ తెలుగుదేశం అనుకూల మీడియా తన పని తాను చేస్తోంది. బాబు కలిసినా, జగన్ కలిసినా, రాష్ట్రపతి బాబునే పొగిడారు. జగన్ మాట వినలేదు అంటూ కథనాలు వండి వారుస్తోంది. రాష్ట్రపతి లాంటి పెద్దలు ఏ విధంగా మాట్లాడతారో? ఏ విధంగా ప్రవర్తిస్తారో? జనాలకు తెలియంది కాదు. అయినా కూడా ఈ మీడియా తన ప్రయత్నం తాను చేస్తూ, తన తాపత్రయం తాను ప్రదర్శిస్తోంది.

ఇలా ప్రయత్నాలు, తాపత్రయాలు లేకుండా అసలు జగన్ కు రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చేయడం ఎలా అన్న ప్రశ్న తెలుగుదేశం నాయకుల బుర్రను తొలిచేస్తోందట. కానీ పాపం, ప్రతిపక్ష హోదా వున్నంతకాలం జగన్ ను భరించక తప్పదు వారికి.

Show comments