పవన్‌ ఔట్‌.. చంద్రబాబు ఏమంటారో.!

'పవన్‌కళ్యాణ్‌ మా మిత్రుడే.. మేమంతా ఎన్డీయే కూటమిలో భాగస్వాములం.. పవన్‌కళ్యాణ్‌ సూచనల్ని స్వీకరిస్తాం.. మిత్రపక్షాన్ని మేమెప్పుడూ గౌరవిస్తాం..' అంటూ ఇప్పటిదాకా అటు బీజేపీ, ఇటు టీడీపీ చెబుతూ వస్తున్న విషయం విదితమే. నోటితో పిలిచి, నొసటితో వెక్కిరించిన చందాన ఓ పక్క పవన్‌కళ్యాణ్‌ని గౌరవిస్తామంటూనే, ఇంకోపక్క పవన్‌కళ్యాణ్‌పై టీడీపీ, బీజేపీ నేతలు పలు సందర్భాల్లో విమర్శించడం చూశాం. అయితే, ఇప్పుడు పవన్‌ క్లారిటీ ఇచ్చేశారు. తాను ప్రస్తుతం ఎన్డీయేలో లేనని తేల్చేశారు. 

మరిప్పుడు, బీజేపీ - టీడీపీ వ్యూహాలు జనసేన విషయంలో ఎలా వుంటాయి.? మరీ ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌ విషయంలో ఇకపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు.? ఈ ప్రశ్నలిప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. 

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపైనా, నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపైనా పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించడం, ప్రభుత్వం స్పందించడం.. 'పవన్‌కళ్యాణ్‌ని గౌరవిస్తున్నాం..' అని ప్రచారం చేసుకోవడం తెల్సిన విషయాలే. 'పవన్‌ ఇచ్చిన సూచనల్ని పరిశీలిస్తాం..' అనే మాట గత కొంతకాలంగా చాలా విరివిగా వింటున్నాం టీడీపీ నేతలనుంచి. మంత్రులు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. 

కానీ, ఇకపై సీన్‌ అలా వుండకపోవచ్చు. ఎందుకంటే, పవన్‌ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. పవన్‌, ఈ మాట అంటారని తాము ఊహించలేదంటూ టీడీపీలో కొందరు నేతలు కాస్తంత అసహనానికి గురవడం సహజమే. బీజేపీ నేతలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. మంత్రి కామినేని శ్రీనివాస్‌కి పవన్‌ అంటే అదో ఇది. ఆయనిప్పుడు పవన్‌ వ్యాఖ్యలతో షాక్‌కి గురయ్యే వుంటారు.! 

ఇదిలా వుంటే, పవన్‌కళ్యాణ్‌ మాటల్ని కాంగ్రెస్‌ నేతలు నమ్మడంలేదు. ఎన్డీయేలోంచి బయటకు వచ్చానంటూ పవన్‌కళ్యాణ్‌ చెబుతున్న మాటల్ని విశ్వసించలేమని కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ అంటున్నారు. అసలంటూ పార్టీ విధి విధానాల్లేకుండా మూడేళ్ళపాటు మనుగడ సాధించడమేంటని ప్రశ్నిస్తున్నారాయన. పవన్‌కళ్యాణ్‌ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే ఆయన ఏదో అలా అలా స్పందించేశారు. 

మొత్తమ్మీద, మూడేళ్ళు పూరి చేసుకున్న జనసేన విషయంలో పవన్‌కళ్యాణ్‌ కన్‌ఫ్యూజన్‌ పెంచారుగానీ, క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆయన కన్‌ఫ్యూజన్‌కి గురవడం, జనసేన పార్టీని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేయడం సంగతేమోగానీ, చంద్రబాబుకిప్పుడు పెద్ద సంకటమే తెచ్చారు పవన్ కళ్యాణ్.! ఎందుకంటే, పవన్‌ని తనకు అనుకూలంగా ఆడించుకున్నది చంద్రబాబే కదా మరి.!

Show comments