నది నిండా నీళ్లున్నా మనకెంత ప్రాప్తమన్నా అన్నది వేదాంతం. పాపం, కుటుంబం చేతిలో అపరిమిత అధికారం వుంది. కాదనే వారు, వద్దనేవారు లేరు..ఎలా వున్నా అండగా నిలిచే మీడియా వుంది. అయినా కూడా లోకేష్ మంత్రి కాలేకపోతున్నారు. అదిగో మంత్రి పదవి అని ఊరిస్తూనే వుంది. మున్సిపల్ ఎన్నికల తరువాతే విస్తరణ అంటూ కొత్త ఫీలర్లు రావడం వెనుకు లోకేష్ కూడా ఓ కారణం అని తెలుస్తోంది. ఆ వైనం ఏమిటంటే..
లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వాలంటే ఆరు నెలలలోపు ఎమ్మెల్యే గానో, ఎమ్మెల్సీగానో ఎన్నుకోవాల్సి ఉంటుంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు లోకేష్ కు మంత్రి పదవి ఇస్తే ఆ లోపే ఆరు నెలలు దాటిపోతోంది. ఎమ్మెల్యేగా చేయాలంటే ఎవరినైనా ఖాళీ చేయించాలి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల లోకేష్ కు మంత్రి పదవి కోసం తాము ఖాళీ చేస్తామని ముందుకు వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికకు దిగాలి.
ఏ మాత్రం తేడావచ్చినా, పరిస్థితి దారుణంగా వుంటుంది. ఒక వేళ ధైర్యం చేసినా, ఇఫ్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక టీడీపీకి కత్తి మీద సాములాంటిది. హోదా మంటలు రగులుతున్నాయి. కాపు రిజర్వేషన్ గొడవ రాజుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి బాంబు వేస్తాడో తెలియని పరిస్థితి. బీజేపీకి ఏపీలో పట్టు సడలింది, దానిపై వ్యతిరేకత పెరిగింది.
ఒక వేళ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ఇబ్బందే. సహజంగా వచ్చే ప్రజా వ్యతిరేకత కూడా కొంత పనిచేస్తుంది. పైగా నవంబరులో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలున్నాయి. వీటి ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో తేటతెల్లం చేయనున్నాయి. అవయ్యాక డిసెంబరులో లోకేష్ కోసం ఉప ఎన్నికకు పోతే ఆ ఫలితాల ప్రభావం ఉంటుంది. ఇలా అనేక రకాల అడ్డంకులు లోకేష్ మంత్రి పదవికి వచ్చి పడ్డాయి. దీంతో లోకేష్ కల ఇప్పట్లో నెరవేరకుండా పోతోంది.