-రాజకీయాల్లో ఫ్లాఫైనా, సినిమాల్లో మళ్లీ హిట్టే!
-తెలుగు సినిమాల రికార్డులకు రిపేర్ చేసిన మెగాస్టార్!
-అప్పటికీ, ఇప్పటికీ ఇలాంటి ఫీట్లు ఆయనవే!
-చిరు రీ ఎంట్రీ.. పవన్ కల్యాణ్ కూ హెచ్చరికే!
రాననుకున్నారా.. రాలేను అనుకున్నారా.. అని ప్రశ్నించిన మెగాస్టార్, వచ్చీ రావడంతోనే అదరగొట్టేశాడు! నిజమే.. ఢిల్లీ వెళ్లినా డ్యాన్సులు మరిచిపోలేదు, హస్తిన వెళ్లినా హాస్యం మర్చిపోలేదు, మన మధ్యన లేకపోయినా మాసిజం మరిచిపోలేదు.. తెరపై తనేం మారలేదు అని మెగాస్టార్ నిరూపించుకున్నాడు. అవతల చూస్తే పోటా పోటీ వాతావరణం. సంక్రాంతికి 'ఖైదీ-150' తో పాటు విడుదల అయిన బాలకష్ణ సినిమాపై క్రేజ్ ఏమీ తక్కువగా లేదు. అందునా.. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ, తెలుగు వారు గర్వపడే కథ అంటూ సెంటిమెంటు. భారీ నేపథ్యం, భారీ తనం. మరి చిరు సినిమాలో ఏముంది? ఎప్పుడో రెండేళ్ల కిందట వచ్చిన సినిమా. రీమేక్ కహానీ. సినిమా ఎలా ఉంటుందో.. అనే యాంగ్జైటీ లేదు! సస్పెన్స్ లేదు. చిరు సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వాళ్లంతా అప్పటికే తమిళ వెర్షన్ ను చూసేశారు! దాన్ని చూసిన తర్వాత.. చిరు సినిమాను చూడాలా, వద్దా డిసైడ్ చేసుకోవచ్చు! ఇంకోవైపు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ.. రీమేక్ సినిమా చేయడమా! అనే విసుర్లు పంటికింద రాయిలా తగులుతున్నాయి.
అవును.. చిరు చేసింది రీమేక్ సినిమానే, ఆల్రెడీ అందరికీ తెలిసిన కథనే! కొత్తదనం లేదు, వైవిధ్యం లేదు, ప్రయోగం లేదు, సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు.. అయితేనేం, వీటన్నింటికీ మించి అందులో 'చిరు' ఉన్నాడు! పదేళ్ల తర్వాత తెరపై కనిపిస్తున్నాడు! అభిమానుల వరకూ అదే చాలు. అయితే ఇక్కడ ఇంకో సంశయం! అభిమానులను పక్కన పెడితే.. చిరంజీవిని సగటు ప్రేక్షకుడు ఆదరిస్తాడా? అనేది!
పదేళ్ల పాటు తెరకు దూరమైన వ్యక్తిని తిరిగి ఆదరించడం అంటే, కష్టమే! అందునా.. గత పదేళ్లలో ఎన్నో జరిగాయి. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి.. వెళ్లాడు! ఫలితంగా చిరంజీవి 'అందరి వాడు' కాదు 'కొందరివాడే' అనిపించుకున్నాడు! అది స్పష్టం అయ్యింది కూడా! రాజకీయాల్లోకి రావడంతోనే కొంతమందికి మానసికంగా దూరం అయ్యాడు మెగాస్టార్! అంతేనా.. ఆ రాజకీయాల్లో అనుకున్నంత, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ప్రజాభిమానాన్ని పొందలేకపోయాడు! ఇది రెండో ఫెయిల్యూర్! ఈ ఫెయిల్యూర్ల పరంపర అంతటితో కూడా ఆగిపోలేదు. పార్టీ విలీనంతో మెగాస్టార్ చాలా మందికి చులకన అయ్యాడు! నిస్సందేహంగా 'చులకన' అయ్యాడు. ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని పార్టీని ఏర్పాటు చేసి, అది దక్కకపోయే సరికి.. పార్టీని కేవలం కేంద్రమంత్రి పదవి కోసం తాకట్టు పెట్టాడనే పేరును తెచ్చుకున్నాడు! ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, ఎంపీ అయ్యాడు.. కేంద్రమంత్రిగా మారాడు. ఇవేవీ.. చిరు అభిమానులు కోరుకున్నవి కావు. పార్టీని విలీనం చేయడాన్ని, ఆఖరికి అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. ఇక సగటు మనుషుల మధ్య మెగాస్టార్‌కు ఏం విలువ ఉంటుంది?!
చిరు ఒక ఫెయిల్యూర్. రాజకీయాల్లో అనుకున్నది సాధించలేకపోయాడు, తన పార్టీని విలీనం చేసిన కాంగ్రెస్‌ను తిరిగి నిలబెట్టుకోలేకపోయాడు.. అడుగడుగునా పొరపాట్లు, అంతిమంగా కేవలం స్వార్థపరుడు, కొందరివాడు.. అనే ముద్రలు. ఇదీ..పదేళ్ల పుణ్యం. సినీ రంగంలో తన నంబర్ వన్ హోదాను పక్కన పెట్టి, ఇక్కడ రారాజుగా చలాయించగల అధికారాన్ని వదులుకుని, వీటన్నింటికీ మించి సగటు తెలుగు సినీ అభిమాని గుండెల్లో చోటును వదులుకుని.. పై పుణ్యాన్ని సాధించుకున్నాడు మెగాస్టార్. ఈ పరిణామాల మధ్య చివరి రెండేళ్లనూ స్తబ్ధుగానే గడిపేశాడు మెగాస్టార్! ఆ సమయంలో పెండింగ్‌లో ఉండిన కొన్ని బాధ్యతలను నెరవేర్చాడు. తండ్రిగా తన పిల్లల జీవితాలను సరిదిద్దుకున్నాడు. అదీ చిరు ప్రస్థానంలో ఆ పదేళ్ల కథ.
అవును.. చిరు ఒక ఫెయిల్యూర్. అదంతా 'శంకర్ దాదా జిందాబాద్' విడుదల తర్వాత, అవును.. చిరంజీవి అంటే చులకన, చూసేవాడికి, రాసేవాడికి, ఇదంతా 'ఖైదీ-150' విడుదలకు ముందు! మెగాస్టార్ మళ్లీ వచ్చాడు! ఏడాది రెండేళ్లు కష్టపడి సినిమాలు తీసి.. వంద కోట్లు సాధించి తెలుగు తెర స్టామినా పెంచేశాం అనుకున్న వాళ్ల మధ్యన.. తెలుగు తెర అసలు స్టామినా ఏమిటో చిరంజీవి నిరూపించాడు. మంచినీళ్ల ప్రాయంగా హిట్టు కొట్టాడు. వంద కోట్లు వసూళ్లు చేశాడు! ఒక సాదాసీదా సినిమాతోనే ఇలా సాధించేశాడంటే..మెగాస్టార్ మళ్లీ పాత మెరుపులు మెరిపించాడంటే? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం అంత సులభం కాదు. ఎందుకంటే అది ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది మరి!
ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం!
ఇదైతే స్పష్టం అయిపోయింది. రాజకీయాలు, కులం ఇతర సమీకరణాలను పక్కన పెట్టేసి.. చిరంజీవిని కేవలం సినీ హీరోగా చూస్తే.. ప్రేక్షకుల మదిలో ఆయన చిరంజీవే అని స్పష్టం అయిపోయింది 'ఖైదీ-150'తో. చిరంజీవికి ఇంతమంది జనాలు ఓటేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన సినిమా వస్తే మాత్రం థియేటర్ కు వెళ్లి చూస్తారని మాత్రం క్లారిటీ వచ్చింది. పొలిటికల్‌గా చుక్కెదురు కావడంతోనో.. లేక మరెందుకో కానీ, ఈ స్థాయి ఆదరణ
దక్కుతుందని, ఈ స్థాయి వసూళ్లు వస్తాయని తామే ఊహించలేదని.. స్వయంగా అల్లు అరవింద్ ప్రకటించడాన్ని ఇక్కడ పరిశీలించి చూడాలి. ఊహించనంత స్థాయిలో స్పందన వచ్చింది మెగాస్టార్ మూవీకి! కొన్ని రకాల ప్రతిబంధకాలు ఎదురైనా.. మెగాస్టార్ కు ఎదురు లేకుండా పోయింది! ఇకపై కూడా ఇదే స్పందనే ఉంటుంది. మెగాస్టార్ ను మళ్లీ నంబర్ వన్ హోదాలో పెట్టుకుని చూసుకుంటారు తెలుగు ప్రేక్షకులు. ఇక తెలుగులో నంబర్ వన్ హీరో పొజిషన్ కోసం ఇతర కుర్ర హీరోల పోరాటాలు ఆపేసుకోవచ్చు. ఆయుధాలు పక్కన పెట్టేసుకోవచ్చు.
ఎక్కడ పొరపాటు జరిగింది?!
చిరంజీవి అంటే తెలుగు వాళ్లకు అభిమానమే తప్ప.. కోపాలేమీ లేవు. అయితే రాజకీయాలు మాత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు రాజకీయాల్లోకి రావడంతోనో జరిగిందని చెప్పడానికి లేదు. రాకూడని సమయంలో రాజకీయాల్లోకి వచ్చాడు చిరు. వైఎస్సార్ ప్రభ వెలిగిపోతున్న వేళ మెగాస్టార్ పాలిటిక్స్ లోకి రావడం బహుశా పెద్ద పొరపాటు. మరి అధికారం రాకపోతే రాకపోయింది.. కనీసం, ప్రతిపక్షం అయినా దక్కాల్సింది కదా? అంటే మాత్రం.. దానికి చాలా సమీకరణాలు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.
ప్రత్యేకించి.. అప్పట్లో మెగాస్టార్‌ను నిలబెట్టడానికి సరైన కార్యాచరణ చేయలేదు. ప్రత్యేకించి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయనను నిలబెట్టడానికి అహర్నిశలూ పని చేసిన మీడియా వర్గం చిరంజీవికి లేకపోయింది. ఎన్టీఆర్‌ను మహానుభావుడిగా జనాల ముందు నిలబెట్టడానికి చేసిన కసరత్తును చిరు కోసం ఎవ్వరూ చేయలేదు! ఏ మాత్రం వ్యక్తిత్వం లేని హీరోలను, పది మంది ముందుకు వస్తే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్లను.. వ్యక్తిత్వం విషయంలో మరకలు పడిన వారిని.. కూడా తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తులుగా నిలబెట్టడానికి ఒక వర్గం మీడియా అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. సదరు సినీ హీరోల వ్యక్తిత్వం ఏమిటో, సత్తా ఏమిటో.. వారి మాటలతోనే తేటతెల్లం అవుతున్నా.. వారిని ఆకాశానికి ఎత్తుతూనే ఉంది! వారిని అనితర సాధ్యులుగా చూపుతూనే ఉంది! ఆ తరహా వ్యూహాత్మక తోడ్పాటు, జాకీలేసే మీడియా ఉండి ఉంటే.. మెగాస్టార్ ఈ పాటికి ఎప్పుడో మహానుభావుడు అయిపోయేవారు!
చిరంజీవి లోటుపాట్ల గురించి చాలా ధైర్యంగా మాట్లాడేస్తుంటారు మీడియాలో! ఇదే స్థాయిలో మరో హీరో గురించి మాట్లాడమనండి? చిరంజీవి ఒకపార్టీ అధినేతగా ఉండిన రోజుల్లో.. ఆయన ఆ పార్టీని మూసేయడానికి రెడీగా ఉన్నాడని పతాక శీర్షికల్లో వార్తలు రాసింది ఒక మీడియా వర్గం. చిరు పార్టీ ఆఫీసులోనే కూర్చుని ఆయనపై ధ్వజమెత్తేంత వరకూ వచ్చింది పరిస్థితి. అదంతా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బద్నాం చేసింది. వ్యక్తిగత విషయాల గురించి కానీ, రాజకీయ అడుగుల గురించి కానీ.. చిరుపై దాడి చాలా సులభంగా చేసేస్తుంది మీడియా. అయితే తెలుగు తెరపై టాప్ స్టేటస్ లో ఉన్న ఇతర హీరోల వివాదాల గురించి మాత్రం చర్చ ఉండదు. అటెంప్ట్ టు మర్డర్ కేసులు.. ఆస్తుల గొడవలు.. ఇతర వివాదాలు ఎదుర్కొన్న వారిని మాత్రం తెలుగు జాతి గర్వించదగిన బిడ్డలుగా ప్రజంట్ చేసే మీడియా.. పార్టీ పెట్టిన దగ్గర నుంచి చిరంజీవిని దెబ్బతీయడానికి చాలా యత్నాలే చేసింది! ఆ ప్రయత్నాల్లో ఆ వర్గం విజయవంతం అయ్యింది. మూడో ప్రత్యామ్నాయంగా ఎదగకుండా.. తీవ్రంగా కష్టపడింది. ఒకవేళ కాచుకునే మీడియా ఉండి ఉంటే, అడుగడుగునా కాపాడుకొంటే మీడియా మోతుబరులు తన కులంలోనూ చిరు కలిగి ఉండి ఉంటే.. పొలిటికల్ జర్నీ మరో రకంగా ఉండేదేమో!
వాట్ నెక్ట్స్..?!
ఎక్కడ నుంచి కోల్పోయాడో.. అక్కడ నుంచినే మొదలుపెట్టాడు మెగాస్టార్. రాజకీయాల్లో ఫెయిల్యూర్ తర్వాత శేష జీవితం ఏదోలా గడిపేయ కుండా.. కష్టపడ్డాడు. కుర్రాళ్లకు పోటీి ఇస్తున్నాడు. ఇది చిరుకు రెండో జన్మలాంటిదే. ఈ జన్మలో మాత్రం ఆయన గత పొరపాట్లను చేయకపోవచ్చు. ఇకపై సినిమాలకే పరిమితమై.. ఇలా సత్తా చాటుతూ కొనసాగుతాడా? లేక.. సినిమాల ద్వారా బలాన్ని సమీకరించుకుని.. మళ్లీ పొలిటికల్ అటాక్ చేస్తాడా? అనేది చెప్పలేం కానీ, ఏం చేసినా.. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అయితే సాగవచ్చు. ఒకటైతే నిజం.. చిరంజీవి కథ అయిపోలేదు, మళ్లీ మొదలైంది!
పవన్ కల్యాణ్.. బీ కేర్ ఫుల్!
చిరంజీవి సైడైన తర్వాతే పవర్ స్టార్ పేరు మార్మోగింది అనేది పరిశీలనతోనే స్పష్టం అవుతుంది. చిరు రాజకీయాల వైపు వెళ్లి.. తెలుగు తెరపై కొంత వ్యాక్యూమ్ ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీలో చాలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వీటిల్లో చిరు అభిమానులు పూర్తిగా పవన్ కల్యాణ్ వైపు ట్రాన్స్ ఫామ్ కావడం కూడా ఒకటి! చిరు లేడు.. అభిమానం ఉంది.. అదే పవన్ కల్యాణ్‌కు దక్కింది. అంతకు ముందు కూడా పవన్‌పై క్రేజ్ ఉండవచ్చు గాక.. అది పతాక స్థాయికి చేరింది మాత్రం చిరు లేని వేళే!
మరి ఇప్పుడు మెగాస్టార్ మళ్లొచ్చాడు.. అదే స్థాయిలో వచ్చాడు. ఈ ప్రభావం పవన్ కల్యాణ్‌పై కచ్చితంగా ఉంటుంది! రాజకీయాల వైపు వెళ్లి చిరంజీవి కొందరి వాడు అయ్యాడు. పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు! పవన్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు చెప్పిన మాటల్లో వేడి ఆయన చేతల్లో కనిపించడం లేదు. ఆఖరికి చంద్రబాబు జేబులోని మనిషి .. అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు పవన్ కల్యాణ్. ఈ విమర్శకు ఆయన భయపడటం లేదు కూడా!
అధికారంలో ఉండి.. అనేక పొరపాట్లు చేస్తున్న వారిని కాపాడుకొంటూ కూర్చోవడం అంటే.. అది కొరివితో తల గోక్కోవడమే. అది తెలిసీ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో తల గోక్కొంటున్నాడు. దీని వల్ల ఆయనకు దక్కే ప్రయోజనాలు ఏమిటో ఆయనకే ఎరుక! ఆ సంగతలా ఉంటే.. సినీ మూలాలను వదులుకుని రాజకీయాల్లో చించేద్దామని వెళితే.. రెంటికీ చెడ్డ రేవడీలానే మారుతుంది పరిస్థితి. ఒక చిరంజీవి, ఒక విజయ్ కాంత్.. వంటి వాళ్ల జీవితాలు ఇస్తున్న సందేశం ఇదే! అయితే పవన్ కల్యాణ్ తన ఫిల్మ్ బేస్‌ను చూసి ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తున్నాడు.
మరి సినీ అభిమానంతోనే రాజకీయాలు చేయాలి. ఆ సినీ అభిమానం నిలబడాలంటే సినిమాలతో దూరం పెరగకూడదు! తమకు ప్రత్యామ్నాయం మరొకరు రాకూడదు! ఈ రకంగా చూస్తే పవన్ ఒక రకంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. హార్డ్ కోర్ మెగాఫ్యాన్స్ ఉత్సాహం చిరంజీవి వైపు టర్న్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. తమకు ఉత్సాహాన్ని మాత్రమే ఇచ్చే హీరో కావాలి అభిమానులకు! వీరికి పవన్ ఇచ్చేదాంతో పోలిస్తే.. చిరు ఇచ్చేది చాలా చాలా ఎక్కువ! కాబట్టి సహజంగానే పవన్‌పై సగటు మెగాభిమానిలో ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. అయితే పవన్‌కు వీరాభిమానులు ఉన్నారు. వీళ్లు ఏకంగా 'మెగాస్టార్ డౌన్.. డౌన్' అనే దగ్గర వరకూ వెళ్లిపోయారిప్పటికే! ఇలాంటి వారు పవన్‌కే జై కొట్టవచ్చుగాక.. కానీ వీరి వీరాభిమానం మిగతా వారిని దూరం చేస్తుంది.
పొలిటికల్‌గా కూడా తను కాంగ్రెస్‌కే కట్టుబడి ఉంటానని చిరు ప్రకటించడం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. రాష్ట్ర స్థాయిలో కాకపోయినా జాతీయ స్థాయిలో అయినా కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు చిరంజీవి. అంటే.. ఇక మళ్లీ పార్టీలు మారి నవ్వుల పాలు కాకూడదని చిరు ఫిక్సయినట్టుగా ఉన్నాడు. అభిమానులు పూర్తిగా పవన్ కల్యాణ్ వెంట నడవకుండా చేస్తుంది చిరంజీవి స్టాండ్! ఒకవేళ చిరు మళ్లీ సినిమాలు చేయకుండా, కాంగ్రెస్‌లో అనామక ఎంపీగా మిగిలిపోయుంటే.. మెగాభిమానులు చిరును పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ.. చిరు యాక్టివ్‌గా ఉంటూనే, తను కాంగ్రెస్.. అనే సంకేతాలు ఇస్తే మాత్రం పవన్ కల్యాణ్‌కు అతి పెద్ద ప్రాపర్టీ అయిన 'మెగా అభిమానులు' పూర్తిగా కలిసి రానట్టే! ఇప్పటికే మిగతా మెగా హీరోలందరితోనూ పవన్ కు దూరం పెరిగింది. అదంతా పవన్ తనను తాను ప్రత్యేకం అని నిరూపించుకోవడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలీదు కానీ, ఆయనను ఒంటరిని చేయడానికి మాత్రం చాలానే ఉపయుక్తం అవుతుంది. ఓవరాల్‌గా మెగాస్టార్ రీ ఎంట్రీ పవన్ కల్యాణ్ ప్రాధాన్యతను తగ్గించేదే!
గతం ఘనం.. మళ్లీ బాస్ ఈజ్ బ్యాక్!
ఒక ప్రాంతీయ భాష సినిమా నటుడు అంత పారితోషకం పొందుతాడని ఎవ్వరూ ఊహించలేదు. అప్పటి వరకూ అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటాడనేదే.. భారతదేశం విన్నది. అయితే కనీవినీ ఎరగని రీతిలో 1992లో విడుదల అయిన 'ఆపద్భాంధవుడు' సినిమాకు గానూ మెగాస్టార్ ఏకంగా 1.25 కోట్ల రూపాయల పారితోషకాన్ని పొంది సరికొత్త రికార్డు స్థాపించాడు! దేశంలోనే అత్యధిక పారితోషకం పొందిన నటుడు. సూపర్ స్టార్ రజనీలు, కమల్‌లు, అమితాబ్‌లు కూడా చిరుకు పోటీ ఇవ్వలేకపోయారు!
అదే ఏడాదిలో అంతకన్నామునుపే 'ఘరానామొగుడు' సినిమా పది కోట్ల రూపాయల మార్కు వసూళ్ల ను సాధించింది. 1992కి పది కోట్లు అంటే.. నేటి ద్రవ్యమానం ప్రకారం.. రూపాయి విలువ ప్రకారం చూసుకొంటే..వంద కోట్ల రూపాయల వసూళ్లు ఏ మూలకు?
వరస పరాజయాల అనంతరం మలయాళీ హిట్ సినిమా 'హిట్లర్'కు రీమేక్‌గా అదే పేరుతో చిరంజీవి సినిమా చేస్తూ అది సంచలన విజయం సాధించింది. ఆ వెంటనే వచ్చిన 'చూడాలని ఉంది' ఏకంగా పదహారు కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
'అన్నయ్య' సినిమా తొలివారంలో ఆరు కోట్ల రూపాయల వసూళ్లను సాధించి చిరంజీవి ఎందుకు 'అన్నయ్య'నో నిరూపించింది. హండ్రేడ్ డేస్ విషయంలో సరికొత్త రికార్డులు స్థాపించిన 'ఇంద్ర' ముప్ఫై కోట్ల రూపాయల వసూళ్లను కూడా సాధించింది చిరు స్టామినాను, తెలుగు సినిమా సత్తాను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.
'ఠాగూర్' పాత రికార్డులను సవరించింది. ఆ తర్వాత కూడా మెగాస్టార్ సినిమాలు బంపర్ ఓపెనింగ్స్‌కు నోచుకున్నాయి. హిట్టూఫ్లాఫుల నిమిత్తం లేకుండా.. ఆయనను నంబర్ వన్ హోదాలోనే నిలిపాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రీ ఎంట్రీతోనూ మెగాస్టార్ సత్తా చాటాడు. మధ్యలో మిస్ అయిన లోటును తీరుస్తున్నాడు. 'ఖైదీ-150' ఇప్పటికే వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటిందని ప్రకటించేశారు. 150 కోట్ల రేసులో ఉందంటున్నారు. బహుశా రెండొందల కోట్ల మార్కును రీచ్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా. ఓవర్సీస్‌లో కూడా మెగాస్టార్ దూసుకుపోతున్నాడు. ఈ విధంగా 'బాస్ ఈజ్ బ్యాక్'.
-వెంకట్ ఆరికట్ల