తెలుగు సినిమా పడికట్టు పద్ధతుల్ని వెక్కిరిస్తూ, నవ్వించే ఉద్దేశంతో సినిమా తీసినప్పుడు ఆ సినిమా నవ్వులపాలయ్యేలా ఉండకూడదు. మన సినిమాలపై, మన ప్రేక్షకుల అభిరుచిపై సెటైర్‌లా తీసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేలలేదు సరికదా, ప్రేక్షకులు పారిపోయేట్టు చేసింది. ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏమిటంటే... ఒక ధనవంతుడు (మురళి శర్మ) తప్పకుండా లాస్ వచ్చే బిజినెస్ చేయాలనే ఐడియాతో 'తమలపాకు' అనే ఒక ఫ్లాప్ సినిమా తలపెడతాడు. కానీ అతను తీసిన సినిమా హిట్ అవుతుంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రూపకర్తలేమో పాపం హిట్ సినిమా తీద్దామనే దీనిని తెరకెక్కించారు. కాకపోతే ఇక్కడ ఫలితం రివర్స్ అయింది.
బహుశా మురళిశర్మ 'తమలపాకు'కి బదులు ఈ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కథతోనే సినిమా తీసినట్టయితే తాను కోరుకున్న లాస్ తప్పక వచ్చేది. సాదాసీదా ప్రేమకథలా మొదలైన ఈ సినిమా ఎటు పోతుందో అర్థం కాదు. ఒక ధనవంతుడి కూతుర్ని ఒక పేద కుర్రాడు ప్రేమిస్తాడు. ఆ తండ్రి వాళ్ల ప్రేమని అర్థం చేసుకోడు. మీకు సంతోషంకి, ఆనందానికి తేడా తెలిస్తే (?!) మమ్మల్ని విడదీయరు అంటాడా కుర్రాడు. ఆ రెండిటికీ మధ్య తేడా చెప్తూ ఏదో వివరణ కూడా ఇస్తాడు కానీ అది మనకి అర్థం కాదు. ఆనందమేంటో తెలియాలంటే దేంట్లో అయినా నష్టపోవాలంటాడు. గ్యారెంటీగా నష్టపోవడానికి ఉన్న మార్గమేంటి అని ఆలోచించి, సినిమా తియ్యడమే రైట్ ఐడియా అనుకుంటాడు.
అక్కడ్నుంచి సినిమా షూటింగ్, ఆ ప్రాసెస్‌లో జరిగే కామెడీ వగైరాతో కథ ముందుకి నడుస్తుందని అనుకుంటాం. కానీ ఆ షూటింగ్ ప్రాసెస్ ఒక ఐదు నిమిషాల్లో ముగించేసి, వాళ్లు తీసిన సినిమాని తెరపై చూసుకుంటూ ఉంటారు. దానినే మనకీ చూపిస్తారు. వాళ్లు తీసిన 'తమలపాకు' సినిమానే 'మీలో ఎవరు కోటీశ్వరుడి'కి సెకండాఫ్ అన్నమాట. ఈ తమలపాకులో హీరో పృధ్వీనే ఈ చిత్రం ద్వితీయార్థానికి కూడా హీరో. ఇంటర్వెల్‌కి ముందు మాయమైన హీరో నవీన్ చంద్ర మళ్లీ క్లయిమాక్స్‌లో కానీ కనిపించడు. పృధ్వీ ఉన్నాడు కనుక 'తమలపాకు'ని 'ఆనందం'గా నమిలేయవచ్చునని ఆశ పడితే మీ తప్పు కాదు. కానీ మన 'సంతోషం' దూరం చేసేందుకే తమలపాకుకి తెర లేచిందని తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు.
బాన పొట్టతో పరుగెత్తుకుంటూ వచ్చిన యాభై ఏళ్ల పృధ్వీ టెన్త్ పాస్ అయ్యానని చెప్తాడు. అది చూసి అరవైలు, డెబ్బయ్‌ల కాలంలో వచ్చిన సినిమాలపై సెటైర్ అనుకోవాలి. ఇంటర్‌లో జాయిన్ అయిన అతడిని సలోని ప్రేమిస్తుంది. వీళ్ల ప్రేమకథని నడిపిస్తూ, మధ్యమధ్యలో హిట్ సాంగ్స్ వినిపిస్తూ, హిట్ సినిమాల్లోని డైలాగులని పేరడీ చేస్తూ తెరపై ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్లు తీయాలనుకుంటున్నది ఫ్లాప్ సినిమా కనుక లాజిక్‌కి తగ్గట్టుగా ఇలాంటి చెత్త తీసారని సరిపెట్టుకోవచ్చు. కాకపోతే దానిని ఒక పది నిమిషాలో, పావుగంటో చూపించి వదిలేయాలి కానీ దానినే ద్వితీయార్థమంతా చూపిస్తే, తమలపాకు ఫ్లాప్ అవ్వాలని తీసారా, లేక 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ని ఫ్లాప్ చేద్దామని తీసారా అనే అనుమానాలొస్తాయి.
వాళ్లు తీసిన స్పూఫ్ సినిమాని పొగుడుతూ, దాని నుంచే అసలు ప్రేమకథని కూడా సుఖాంతం చేస్తే, తమలపాకు స్పూఫా లేక 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మొత్తంగానే స్పూఫా అన్నది అంతు చిక్కదు. పృధ్వీకి మంచి కామెడీ టైమింగ్ ఉంది. కానీ అతడి టాలెంట్‌ని వృధా చేస్తూ పేరడీ సీన్లకి పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చేసేసిన బాలకృష్ణ ఇమిటేషన్ సీన్లనే మళ్లీ మళ్లీ చేయడం వల్ల విసుగొస్తుంది తప్ప నవ్వించట్లేదు. నిజానికి స్పూఫ్ చేసి నవ్వించడం చాలా ఈజీ. కరక్ట్‌గా వాడుకుంటే స్పూఫ్ సీన్లతోనే సినిమాలని ఆడించేయవచ్చు. ఈ చిత్రానికి దానినే నేపథ్యంగా పెట్టుకున్నా కానీ స్పూఫ్ సీన్లని పండించలేకపోయారు. హాయిగా నవ్వించే ఒక్క సీన్ కూడా లేదిందులో. స్పూఫ్ సీన్లు తీయడంలో దిట్ట అయిన ఇవివి శిష్యుడు, కొన్ని చెప్పుకోతగ్గ కామెడీలు తీసిన ఇ. సత్తిబాబు ఇలాంటి నాసిరకం స్పూఫ్‌ని తీర్చిదిద్దడం నిజంగా విడ్డూరం.
తెరపై నటీనటులు, తెరవెనుక సాంకేతిక నిపుణులు అందరూ దీనిని పేరడీగానే తీసుకున్నారా అన్నట్టు ఎవరి పనితనంలోను సీరియస్‌నెస్ కనిపించదు. బేసిక్ స్టోరీ కూడా రాసుకోకుండా ఇంత ఆకతాయితనంగా తీసిన సినిమా ఈమధ్య కాలంలో నేనయితే చూడలేదు. పృధ్వీది లీడ్ రోల్ కాబట్టి కామెడీ ఉంటుందనే ఆశతో థియేటర్లో అడుగుపెట్టినట్టయితే నవ్వుకోవడం, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనేది తెలుసుకోవడం సంగతి అటుంచి, ఈ సినిమాకి రానివాడు అదృష్టవంతుడు అని నిట్టూర్పులు విడవక తప్పదు.
-గణేష్ రావూరి