'ఈనాడు'ను నడిరోడ్డుపై నిలబెట్టిన జగన్

ఈనాడు పత్రికలో ఎలాంటి వార్తలొస్తాయి, ఎవరికి అనుకూలంగా వార్తలు వస్తాయనే విషయం బహిరంగ రహస్యం. అది చంద్రబాబు కరపత్రిక. రేపు ఏం ప్రచురించాలనేది, ఈరోజు రాత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తుంటారు. ఈ క్రమంలో అది ఎలాంటి అబద్ధాల్ని ప్రచురిస్తుందనే విషయాన్ని ఇప్పటికే వైసీపీ బయటపెట్టింది.

ఎన్నో అంశాలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతల్ని సోషల్ మీడియా సాక్షిగా వైసీపీ సోషల్ మీడియా వింగ్, వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఈనాడు అసలు స్వరూపాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పత్రిక చేస్తున్న మరో అసత్య ప్రచారం అసెంబ్లీ సాక్షిగా బయటపడింది.

ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగారు. ఈనాడు చేస్తున్న అరాచకాల్ని అడుగడుగునా బయటపెట్టారు. పింఛన్లపై ఈనాడు ప్రచురించిన బ్యానర్ కథనాన్ని జగన్ సమర్థంగా తిప్పికొట్టారు.

"ఒక అబద్ధాన్ని, అబద్ధమని తెలిసి కూడా దిగజారి పదేపదే అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది ఈనాడు. ఈ పత్రిక ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలుస్తోంది. పింఛన్లపై స్వయంగా అసెంబ్లీలో క్లిప్పింగ్స్ వేసి చూపించాను. అవి చూస్తే నిజమే కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. అది నిజమని తెలిసి కూడా దాన్ని అబద్ధం అని చూపించి హెడ్ లైన్స్ పెడితే ఈ పత్రికకు విశ్వసనీయత ఉంటుందా?"

ఇలా పింఛన్లకు సంబంధించి ఈనాడు కథనాన్ని తప్పుబట్టారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి ఏంటి.. ఎన్నికల ప్రచారంలో తను ఇచ్చిన హామీ ఏంటి అనే విషయాల్ని మరోసారి క్లిప్పింగ్స్ రూపంలో ప్రదర్శించారు. 

ఈనాడు పత్రిక వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియాలు అమ్ముడుపోయాయనని... ఇలాంటి అమ్ముడుపోయిన ఎల్లో మీడియాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు జగన్.

"2021 జులై 8 వైఎస్ఆర్ జయంతి రోజున 2500కు పెన్షన్ ను పెంచబోతున్నాం. ఇక 2022లో వైఎస్ఆర్ జయంతికి 2750కు పెన్షన్ ను పెంచుతాం. 2023 జులై 8న పెన్షన్ 3వేలకు పెరుగుతుంది. ఇచ్చిన మాటలో ఏమాత్రం పొరపాటు ఉండదు. మాటపై నిలబడే వ్యక్తిని నేను. ఎక్కడా మోసం, అబద్ధం ఉండదు."

ఇలా 3 వేల రూపాయల వరకు పింఛన్లను పెంచుకుంటూ పోతామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. చంద్రబాబులా ఎన్నికలకు 6 నెలల ముందు పింఛన్లను పెంచడం, లబ్దిదారుల సంఖ్యను పెంచడం లాంటివి తమ ప్రభుత్వం చేయదని.. ఏం చేసినా సంక్షేమమే లక్ష్యంగా.. పారదర్శకంగా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు జగన్.

Show comments