పరిటాలకు ఝలక్ ఇచ్చిన చంద్రబాబు..!

మొత్తానికి అనంతపురం జడ్పీ చైర్మన్ పదవి విషయంలో పరిటాల పంతం నెరవేరలేదు. పరిటాల రవికి సన్నిహితుడిగా పేరు పొందిన, ప్రస్తుతం పరిటాల సునీత అనుచరగణంలో సభ్యుడిగా ఉన్న అనంతపురం జడ్పీ చైర్మన్ చమన్ ను తప్పించడానికే బాబు డిసైడ్ చేశారు.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జడ్పీ చైర్మన్ పదవి నుంచి చమన్ ను దించాలని, మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలని బాబు స్పష్టం చేశారు. ఈ పంచాయితీని బాబు వరకూ తీసుకెళ్లిన పరిటాల వర్గానికి అనుకున్న ఫలితం దక్కలేదు.

అనంతపురం జడ్పీటీసీ పీఠాన్ని మంచి మెజారిటీతో సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అనూహ్యంగా ఆ పదవి చమన్ కు దక్కింది. కాంగ్రెస్ పాలన మొదలయ్యాకా చమన్ అనంత నుంచి పారిపోయాడు. 2004లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పరారీ అయిన పరిటాల రవి అనుచరుల్లో చమన్ ఒకరు.

ఇక రవి హత్యతో చమన్ మళ్లీ జిల్లా వైపు చూడలేదు. ఐదారేళ్లు అలా గడిచాకా.. గంగులకుంట సూర్యనారాయణ రెడ్డి హత్యానంతరం చమన్ మళ్లీ జిల్లా వైపు వచ్చాడు. 2014లో తెలుగుదేశం పార్టీ విజయానంతరం అనూహ్యంగా చమన్ జడ్పీ పీఠాన్ని అధీష్టించాడు.

చమన్ ఆ పదవికి ఎంపిక కావడం వెనుక పరిటాల సునీత ఉన్నారు. ఆమె అభీష్టం మేరకు ఆ నియామకం జరిగింది. అయితే అన్నేళ్లూ జిల్లాలోనే ఉండి కాంగ్రెస్ ను ఎదుర్కొన్న వాళ్ల పరిస్థితి ఏమిటి?

అంటే.. మూడేళ్ల పాటు జడ్పీ చైర్మన్ పదవి చమన్ కు అని, రెండేళ్ల పాటు వేరే వాళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దానికి అప్పట్లో సమ్మతించినట్టుగానే కనిపించింది సునీత వర్గం.

కానీ తీరా ఆ సమయం ముగిసే సరికి మాత్రం అడ్డం తిరిగే యత్నం చేశారు. ఐదేళ్లూ చమన్ ఉండాలి.. అనే డిమాండ్ ను చేశారు, జడ్పీపీఠాన్ని వదులుకునేది లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. చమన్ కు అనుకూలంగా సునీత లాబీయింగ్ చేశారు.

అయితే బాబు మాత్రం అందుకు సమ్మతించలేదు. చమన్ రాజీనామా చేయాల్సిందే, ఆ పీఠాన్ని ముందుగా అనుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసి పరిటాల వర్గాన్నికి ఝలక్ ఇచ్చాడు చంద్రన్న.

Show comments