రాజమౌళి.. ఈ ‘చెత్తపలుకులు’ ఏమిటి?

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గత వారాంతంలో ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో నటీమణి శ్రీదేవి పై చేసిన వ్యాఖ్యానాలు వివాదానికి దారి తీస్తున్నాయి. ఈ విషయంలో కొంత మంది నెటిజన్లు, శ్రీదేవి అభిమానులు రాజమౌళి పై విరుచుకుపడుతున్నారు. రాజమౌళి శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యానాలు చేశాడని వారు అంటున్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.

బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని తీసుకోవాలని అనుకోవడం, చివరకు అది సాధ్యపడకపోవడం అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజమౌళి నవ్వుతూనే ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి భారీ స్థాయి పారితోషకం అడిగారని, విమానం టికెట్లు, హోటల్ సూట్ రూమ్ లు అడిగారని.. అవన్నీ ఇద్దాం అనుకున్నాం కానీ, హిందీలోకి డబ్ అయితే ఆ వెర్షన్ లాభాల్లో వాటా అడిగారని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఆమె మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని చెప్పి.. తాము ఆమెను కాదనుకుని శివగామిగా రమ్యను ఎంచుకున్నట్టుగా రాజమౌళి చెప్పుకొచ్చారు. మరి ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. బాహుబలి సినిమాతో నిర్మాతకు ఎంత మిగులుతుందో చెప్పడానికి వెనుకాడిన రాజమౌళి, శ్రీదేవి గొంతెమ్మ కోర్కెలను కోరిందని చెప్పాడు. ఆమె ఇష్టం ఆమెది. ఆమె డిమాండ్స్ ఆమెవి. ఆమె అందుకు వర్తీ అనుకుంటే, తీసుకుంటారు లేకపోతే లేదు కదా.

రాజమౌళి శ్రీదేవి అంత వర్తీ కాదు అనుకున్నాడు.. ఆమెను పక్కన పెట్టాడు. ఇంత వరకూ చెప్పి ఆపేసి ఉంటే బావుండేది. అసలు శ్రీదేవి ఏమేం అడిగిందో చెప్పడం కూడా సంస్కారం కాదు. అయితే రాజమౌళి మాత్రం.. ఆమె హోటల్ సూట్ రూమ్ లు అడిగిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. చెబితే చెప్పాడనుకుందాం. 

కానీ.. ‘శ్రీదేవినే పెడితే పోయేదిగా..’ అంటూ ఇంటర్వ్యూ చేసే మనిషి వెకిలి నవ్వు నవ్వడం, దానికి రాజమౌళి కూడా ‘అవును పెడితేపోయేది’.. అనడమే ఏ మాత్రం బాగోలేదు. బాహుబలి సినిమాకు శ్రీదేవిని గనుక తీసుకుని ఉంటే.. పోయేది అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరి ఈ మాట ఈ నోటా ఆ నోటా పడి.. బాలీవుడ్ మీడియా కూడా కవర్ చేస్తోంది. బాహుబలి డైరెక్టర్ శ్రీదేవిని ఈ మాటలన్నాడు.. అంటూ మీడియా ఏకరువు పెడుతోంది. ఇది కచ్చితమైన అసందర్భ, అనుచితమైన ప్రసంగమే...అనేది నెటిజన్ల మాట. ఆమేదో ఎక్కువ పారితోషకం అడిగిందని, అది ఇవ్వడానికి మనసొప్పక.. ఆమెను కాదనుకున్నామని చెప్పడమే ఇంగితం లేని వ్యవహరమని, ఆమె నటించి ఉంటే.. సినిమా ఫెయిలయ్యేది అనడం మరింత చెత్త అని అంటున్నారు.

బాహుబలి సినిమాలో నటించి ఉంటే శ్రీదేవికి మంచి పేరొచ్చేదో లేదో కానీ, రాజమౌళి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. బాహుబలిలో నటించకపోయినంత మాత్రాన శ్రీదేవికి వచ్చిన నష్టం మాత్రం శూన్యం. క్రేజ్ విషయంలో ఆలిండియా లెవల్లో ఆమె ఎంతో ఎత్తును చూసి వచ్చింది. ఎవరి వరకో వద్దు... ఆమె గ్లామర్ ను సొమ్ము చేసుకుని, ఆమెను చూపుతూ.. రాజమౌళి గురువైన రాఘవేంద్రరావు కూడా తన సినిమాలను హిట్ చేసుకున్నాడు. మరి అలాంటామె గురించి.. ఇలాంటి చెత్త పలుకులు ఏమిటో... అంటూ రాజమౌళి పై నెటిజన్లు మండి పడుతున్నారిప్పుడు.

ఏదో హిట్టు కొట్టామని తమ సినిమాలో నటించమన్న వారి గురించి అనుచితంగా మాట్లాడటం రాజమౌళికి తగదని.. శ్రీదేవి స్థాయేమిటో కొన్ని తెలుగు సినిమాలనే చూసి అర్థం చేసుకోవాలని.. వారు సూచిస్తున్నారు.

Show comments