ఎప్పటి నందులు.. ఎప్పుడొస్తున్నాయ్‌.!

'నంది' అవార్డు అంటే ఒకప్పుడు అద్భుతః కానీ, ఇప్పుడు నంది అవార్డులంటే ఎవరికీ లెక్కలేదు. 'కొనుక్కుంటే నంది అవార్డులొస్తాయ్‌..' అనే స్థాయికి 'నంది' అవార్డుల గౌరవాన్ని తగ్గించేశారన్నది నిర్వివాదాంశం. టాలీవుడ్‌లో ఇప్పుడెవరూ నంది అవార్డుల గురించి ఆలోచించడంలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డుల్ని కొనసాగిస్తామన్నా, తెలంగాణ ప్రభుత్వం ఆ అవార్డుల పేరుని 'సింహ' అవార్డులుగా మార్చుతామని ప్రకటించినా.. తెలుగు సినీ పరిశ్రమ ఇదివరకట్లా ఈ అవార్డులపై ఆసక్తి చూపించడంలేదు. 

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాత సినిమాలకి కొత్తగా నంది అవార్డుల్ని ప్రకటించింది. అది కూడా, ఐదేళ్ళ క్రితం సినిమాలకి. 2012, 2013 సంవత్సరాలకుగాను నంది అవార్డుల్ని ప్రకటించింది. 2012 సంవత్సరానికి జయసుధ, 2013 సంవత్సరానికి కోడి రామకృష్ణ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు నేడు, నంది అవార్డుల్ని ఏయే సినిమాలు గెల్చుకున్నాయో ప్రకటించాయి. 

'ఈగ' (2012), 'మిర్చి' (2013) సినిమాలకు ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. నాని, సమంత 2012 చిత్రానికి ఉత్తమ నటుడు, నటి అవార్డులకు ఎంపిక కాగా, ప్రభాస్‌, అంజలి 2013 సంవత్సరానికిగాను ఉత్తమ నటి, నటుడు అవార్డులకు ఎంపికయ్యారు. రాజమౌళి 'ఈగ' చిత్రానికి ఎంపిక కావడం గమనార్హం. ఏ ఏడాదికి ఆ ఏడాది అవార్డుల్ని అందిస్తే, వాటికి కాస్తయినా విలువ వుంటుందిగానీ, ఇప్పుడు అవార్డుల్ని ప్రకటించడం వల్ల ఏం ఉపయోగమట.? 

సినీ పరిశ్రమను ఉద్ధరించేస్తున్నాం.. అనే కోణంలోనే ఈ నంది అవార్డుల్ని ప్రకటిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి మన సినిమాల్ని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవించుకుంటారు.? తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్‌ అయినా, తెలుగు సినిమాని గౌరవించాల్సి వుంది. ఇక్కడ, ఆ స్థాయిలో మన సినిమాలకి గౌరవం దక్కడంలేదనడానికి అవార్డుల విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమే నిదర్శనం. తెలుగు సినిమాకి తెలుగు గడ్డ మీదనే అన్యాయం జరుగుతున్నప్పుడు, జాతీయ స్థాయిలో అన్యాయం జరగడంలో వింతేముంది.?

Show comments