చంద్రబాబు పాచిక పారిందండోయ్!

ఇటీవలి కాలంలో చంద్రబాబునాయుడు అంత దూకుడు గల వ్యూహాలతో రెచ్చిపోవడం లేదు. పైగా తెదేపా విజయం సాధించినా, మరో ఘనత ఏదైనా వారికి దక్కినా.. అదంతా ‘మా లోకేష్ బాబు మహిమ’ అంటూ క్రెడిట్ ను చినబాబుకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మరైతే.. లోకంలో అందరూ చంద్రబాబును చాణక్యుడు అనీ, వ్యూహరచనా దురంధరుడు అని కీర్తిస్తూ ఉంటారు ఎందుకు? ఎందుకో రాష్ట్రప్రజలకు సోమవారం నాడు అర్థమైంది. యుద్ధానికి వచ్చినంత అట్టహాసంగా తరలివచ్చిన పవన్ కల్యాణ్- చంద్రబాబుతో భేటీ తర్వాత.. ‘పెంపుడు నాయకుడు’ లాగా చిలక పలుకులు వల్లించడం వెనుక అసలు చంద్రబాబు చాణక్య చతురత ఏపాటిదో అందరికీ తెలిసివచ్చింది. 

చంద్రబాబునాయుడు ఈ భేటీ అనంతరం పవన్ కల్యాణ్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు అన్నీ సిద్ధించినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు అండ్ కోటరీ పండగ చేసుకునేలాగా.. పవన్ కల్యాణ్ అనేక విషయాలు వెల్లడించారు. విడివిడిగా పాయింట్లు పాయింట్లుగా  ఈ అంశాలను గమనిద్దాం....

1) ప్రత్యేకహోదా అనేఅంశం మీద పోరాటాన్ని పవన్ కల్యాణ్ ఎంచక్కా కాడి పక్కన పడేశారు. ఈ అంశంపై పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచిస్తున్నా అని.. ఆయన సెలవిచ్చారు. అంటే ఇక ప్రస్తుతానికి పోరాటానికి ఫుల్ స్టాప్ పడినట్లే నన్నమాట. ఈ అంశాన్ని కావాలనే నిర్వీర్యం చేశారు అనేమాట చెప్పిన పవన్.. ఎవరు నిర్వీర్యం చేశారనే సంగతి మాత్రం చెప్పకపోవడం గమనార్హం. 

2) కాపు యువతరానికి పవన్ కల్యాణ్ ఓ గొప్ప సందేశం ఇచ్చారు. రిజర్వేషన్ల  మీద పోరాటాన్ని రెచ్చగొట్టే విధంగా మార్చవద్దంటూ ఆయన సందేశం ఇచ్చారు. అంటే అన్యాపదేశంగా ముద్రగడ అనుసరిస్తున్న పోరాట పంథా రెచ్చగొట్టే విధంగా ఉన్నదని అది కరెక్టు కాదని రాష్ట్రంలోని కాపులకు ఆయన స్పష్టంగానే చెప్పినట్లు అయింది. 

3) అన్నిటినీ మించి.. గరగపర్రు వివాదం విషయంలో కూడా చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కల్యాణ్ మాటలు చెప్పడం. ప్రభుత్వ వైఫల్యం, నాయకుల దుర్మార్గం ఈ వ్యవహారంలో పుష్కలంగా ఉండగా.. పవన్ కల్యాణ్ ఇండైరక్టుగా తెలుగుదేశానికి క్లీన్ చిట్ ఇచ్చారు. స్థానికంగా ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం మాత్రమే దీనికి కారణం అంటూ.. ఆయన సెలవిచ్చారు. అంటే పాలకపక్షానికి సంబంధం లేదన్నట్లుగానే ఈ మాటలు ఉన్నాయి. 

4) ఉద్ధానం సమస్య గురించి సీఎం సానుకూలంగా స్పందించారు అని కూడా పవన్ కితాబిచ్చారు. 

5) ప్రజల సమస్యలను పరిష్కరించడానికి స్పందించే మనసు ఉంటేచాలని, పాదయాత్రలు అవసరం లేదని ఇండైరక్టుగా జగన్మోహన రెడ్డికి తగిలేలాగా ఓ మాట కూడా విసిరారు. 

6) గోదావరి జిల్లాలను కుదిపేస్తున్న ఆక్వాఫుడ్ పార్కు విషయంలో పవన్ కూడా మాట మార్చడాన్ని ఇక్కడ గమనించాలి. ఆ ఫుడ్ పార్కును నిబంధనల ప్రకారం కట్టిఉంటే సమస్య వచ్చేదే కాదని, నిబంధనల ప్రకారం కట్టారో లేదో ప్రభుత్వం పరిశీలించాలని ఓ మాట అని వదిలేశారు. రేపు పొద్దున్న నిర్మాణాలు అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేస్తుంది. అక్కడితో దాన్ని పక్కన పెట్టేస్తారు. 

పవన్ కల్యాణ్ వంటి జనంలో క్రేజ్ ఉన్న సినీ హీరో ద్వారా ఇలాంటి మాటల కంటె చంద్రబాబు వంటి పాలకులకు ఇంకేంకావాలి? ఎంచక్కా చంద్రబాబును ప్రస్తుతిస్తున్నట్టే.. వైఫల్యాలు అన్నిటికీ పాలకపక్షానికి సంబంధం లేనట్టే ఆయన మాటలు సాగాయి. 

ఏతావతా తేలుతున్నదేంటంటే.. ఒక సినిమా హీరో... ఇంకా బొడ్డు పేగు కూడా తెగని పురిటిబిడ్డ వంటి రాజకీయ పార్టీకి అధ్యక్షుడు తన కార్యాలయానికి వస్తోంటే.. అక్కడికేదో ప్రధాని, రాష్ట్రపతి వస్తున్న స్థాయిలో వీరబీభత్సమైన భద్రత ఏర్పాట్లు, హడావిడి చేసినందుకు చంద్రబాబునాయుడు, పవన్ ను బాగానే ఇంప్రెస్ చేసినట్లుగా కనిపిస్తోంది. మొత్తానిక చాణక్యనీతిలో ఆరితేరిన చంద్రబాబు పాచిక పారిందండోయ్ అని అందరూ వ్యాఖ్యానించుకుంటున్నారు. 

Show comments