జనానికి అస్సలు పట్టని హోదా

హోదా వ్యవహారం ఇక ముగిసిపోయినట్లే. తెలుగు మీడియా, తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కలిసి హోదా వ్యవహారాన్ని దిగ్విజయంగా పక్కకు తప్పించాయి. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏదీ లేదని కాంగ్రెస్ నాయకులు డిసైడ్ అయిపోయారు. గట్టిగా మాట్లాడితే చట్టంలో పెట్టకపోవడం మీదే తప్పు అని మళ్లీ తమనే కార్నర్ చేస్తారని వారు భయపడ్డారు. ఇక మిగిలింది వైకాపా మాత్రమే. దాని వాయిస్ కూడా ఇక అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం మరేమీ కాదు. జనం నుంచి హోదా మీద ఏమాత్రం స్పందన లేకపోవడమే. 

నిజం నిష్టూరంగానే వుంటుంది. ఆంధ్ర జనానికి ఈ హోదాలు, ప్యాకేజీలు పట్టించుకునేంత తీరుబాటు లేదు. ఈ తలకాయనొప్పలు రాజకీయాల్లో వున్నవారివి. మనకెందుకు. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన బాదలు మనవి అనే స్టేజ్ లో వున్నారు వారంతా. ఇక రాజకీయ పార్టీల్లో వున్నవారి తీరు కూడా అలాగే వుంది. హోదాపైనో, ప్యాకేజీపైనో ఆందోళన చేయాలన్నా, మరేమన్నా హడావుడి చేయాలన్నా ఇప్పుడు డబ్బులు జేబులోంచి బయటకు తీయాల్సిందే. 

దగ్గర్లో ఎన్నికలు లేకుండా ఎందుకు వచ్చిన దండగ. అందుకే సులవు అయిన ప్రెస్ మీట్ లు, స్టేట్ మెంట్ లకే ఎక్కువ మంది పరిమితం అయిపొతున్నారు. అయితే సాక్షి మినహా మరేదీ ప్యాకేజ్ వ్యతిరేక వార్తలు ప్రచురించడం లేదు. అందువల్ల అవీ దండగే.

హోదా రాకపోతే గోదాలోకి దిగుదాం అని ఎన్జీవో నాయకుడు అశోక్ బాబు ముందు అనుకున్నారు. కానీ తరువాత బాబు మనసు ఎరిగి సైలెంట్ అయ్యారు. జనానికి పట్టక, రాజకీయ నాయకులకు పట్టక, ఉద్యోగులకు పట్టక, మరి ప్యాకేజీ వద్దు, మీడియాకు పట్టక, హోదాయే ముద్దు అనే పోరు ఎలా ఎదుగుతుంది. అందుకే దాదాపు మొగ్గలోనే ముగిసిపోయినట్లే.

జనాల బ్రెయిన్ వాష్

అయితే మీడియా ద్వారా ఎంతలా హోదా వ్యతిరేక ప్రచారాన్ని అణగదొక్కేసినా, ప్రజలు వారంతట వారు స్పందించకపోయినా, ఇంకా వారి మనసుల్లో చంద్రబాబు హోదా సాధించలేకపోయారేమో అన్న భావం వుందేమో అన్న అనుమానం తెలుగదేశం జనాల్లో వుంది. అందుకే జనాలకు పట్టని హోదా, ప్యాకేజీపై వారికి సవివర మైన వివరణను చాలా తెలివిగా పంప్ చేసే పని చేపట్టారు. 

అసలు హోదా అంటే ఏమిటి? ప్యాకేజీ ఏమిటి? రెండింటికి ఏమీ తేడా లేదన్న సవివరణాత్మక వ్యాసాలను వాట్సప్ ద్వారా విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఓ విధంగా జనాలకు తెలుగుదేశం వివరణ ఇవ్వడం లాంటిదే. అయితే వీటిని కూడా పట్టించుకునేంత తీరుబాటు మన జనాలకు లేదు. ఎక్కడ చూసినా ప్యాకేజీ, హోదా వంటి పదాలు చూసి జనం స్పందిస్తున్న దాఖలాలులేవు. అందుకే ఇక రేపటి నుంచి ఇక ప్యాకేజీ హడావుడి ఏమీ వుండదు.

జనసేన సైలెంట్

హోదా మీద ఎంపీలు పోరాడాలి. అవంతి శ్రీనివాస్ రాజీ నామా చేస్తే దగ్గర వుండి గెలిపిస్తా, పార్టీలు అన్నీ విఫలమైతే జనసేన పోరు బాట దిగుతుంది అని ప్రకటించారు కాకినాడలో పవన్. కానీ ఇప్పుడు జనసేన కూడా సైలెంట్ నే. నిజానికి హోదా మీద అన్ని పార్టీలు అయితే సైలెంట్ అయ్యాయి..లేదంటే విఫలమయ్యాయి. మరి ఇప్పుడు జనసేన గోదాలోకి దిగాలి కదా? కానీ దాని అధిపతి పవన్ తన తరువాతి సినిమాల్లో మునిగిపోయారు. 

పైగా జనసేన సిద్దాంతాలపై పుస్తకం తయారుచేస్తున్నామని ప్రకటించారు. జనం ఆకలితో వుంటే వంటకాల పుస్తకం ఆకలి తీర్చదు. వంటకాలు వండి వడ్డించాలి. కానీ పవన్ కు ఆ సంగతి పట్టడం లేదు. ఆయనకు హోదా మీద పోరు చేసే ఉద్దేశం అస్సలు లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది.

కానీ ఎప్పటికైనా..

ఇప్పటికి హోదా పోరుకు శుభం కార్డు పడిపోయినా, జనానికి పట్టకపోయినా, 2019 నాటికి ఏదో ఒక డెవలప్ మెంట్ రాష్ట్రంలో కనిపించకపోతే, కచ్చితంగా మరోసారి ఆలోచన మాత్రం మొలకెత్తడం ఖాయం. దానికి ఖర్చు లేదు. ఎవరి ప్రోద్బలం అక్కరలేదు. ఏ మీడియా సపోర్టు అక్కరలేదు. కచ్చితంగా ఆ వేళకి మరోసారి కేంద్రం ఏం ఇచ్చింది? ఏం చేసింది..చంద్రబాబు ఏం సాధించారు. పవన్ ఏం చెప్పారు అన్న లెక్కలన్నీ మరోసారి తెరపైకి వస్తాయి. అంతవరకు మాత్రం అంతా సైలెంట్.

Show comments