పవన్ కింగ్ నా? కింగ్ మేకర్ నా?

ఎదుటివాడు ఒక ఎత్తు వేసేలోగా పది ఎత్తులువేసి, ప్రత్యర్థిని పడ గొట్టగలిగిన వాడే మొనగాడు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా ప్రావీణ్యం వుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బాబు స్ట్రాటజీ ఏమిటన్నది అంతు పట్టడం లేదు. పవన్, చంద్రబాబుల తీరు ఎలా వుందీ అంటే..ఈయన ఒకందుకు పోస్తే, ఆయన ఒకందుకు తాగుతున్నాడు. ఈయన ఒకందుకు తాగుతుంటే, ఆయన ఒకందుకు పోస్తున్నాడు అన్న సామెత మాదిరిగా.

కాపుల అండ పవన్ కు ఇంతో అంతో వుంది, అభిమాన యువత బలం వుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అవసరం 2014 ఎన్నికల్లో ఎంత వుందో, 2019 ఎన్నికల్లో అంతకు అంత వుంది. ఎలా అయినా పవన్ ను తన పక్కనుంచి తప్పిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అది క్లియర్ గా కనిపిస్తోంది. పవన్ తన స్టయిల్ లో తాను ఎంత రెచ్చిపోతున్నా, తెలుగుదేశం జనాలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు అంటే దానికి కారణం ఇదే తప్ప వేరు కాదు. విశాఖ హడావుడికి మూలం పవన్ అయితే, జగన్ ను టార్గెట్ చేయడం అంటే పవన్ కు బాబు అండ్ కో ఎంత భయపడుతున్నారో? పవన్ పట్ల ఎంత ఒదిగి వుంటున్నారో ఇట్టే అర్థం అవుతుంది.

పవన్ అసలు టార్గెట్ ఏమిటి? కేవలం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వుండడమేనా? లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఎన్నికల్లో పోటీ చేయని దానికి అయితే ఇంత హంగామా అక్కరలేదు. అమెరికా వెళ్లి మరీ పోలిటిల్ స్ట్రాటజిస్ట్ లను కలవాల్సిన పని లేదు. మళ్లీ ఎన్నికల ముందు కలుద్దాం అని ఓ మాట చెప్పి రానక్కరలేదు. మరి ఎన్నికల్లో పోటీకి దిగితే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చంద్రబాబుకు దూరం జరుగుతారా? లేక లోపాయికారీ ఒప్పందం ఏదైనా కుదర్చుకుని, ఏదో సాకు చూపించి, జనాలు బుర్రగోక్కునే విధంగా ఏవో నాలుగు మాటలు చెప్పి, చంద్రబాబుతో కలిసే ప్రయాణిస్తారా? అలా అయితే కింగ్ మేకర్ గా వుండడం మినహా పవన్ కు ఒదిగేది లేదు. ఇప్పటి వరకు పవన్ ఒప్పుకున్న సినిమాలు 2019 నాటికి పూర్తయిపోతాయి. మరి అప్పుడైనా ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారతారా? 

కేవలం ఓ మంత్రి పదవో, ఎంపీ పోస్టునో అయితే పవన్ ఇంత హడావుడి చేయనక్కరలేదు. మరి ఈ విషయం అర్థం అవుతున్నా కూడా చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా వున్నారు. వుండక, ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు? అని క్వశ్చన్ చేయచ్చు ఎవరైనా? బాబుకు పవన్ కు లింక్ లేదని తేలిపోయిన మరుక్షణం తెలుగుదేశం అను'కుల' మీడియా ఒళ్లు విరుచుకుంటుంది.

తెలుగుదేశం జనాల నుంచి అడ్డగోలు విమర్శలు స్టార్ట్ అవుతాయి.  అలా జరగడం లేదు అంటే ఇప్పటికిప్పుడు పవన్ - బాబు బంధానికి వచ్చిన ముప్పేం లేదని భావిస్తున్నారన్నమాట. అయితే ఎప్పటికైనా పవన్ తో బాబుకు ఆయన వర్గానికి ముప్పే అన్నది పక్కా. ఆ సంగతి వారికి కూడా తెలియంది కాదు. అయితే పవన్ వెనుక వున్న అభిమానుల కన్నా, ఆయన వెనుక వున్న కులబలం చూసి బాబు అండ్ కో జంకుతున్నారన్నది పచ్చి నిజం. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బాబు అండ్ కో తలుచుకుంటే ఏం చేయగలరన్నది పవన్ కు కూడా తెలియంది కాదు. ప్రజారాజ్యం అనుభవం ఆయనకు బోలెడు పాఠాలు నేర్పింది. అందుకే ఆయన చాలా తెలివిగా, బాబు అండ్ కో తో భుజం రాసుకుంటూనే తన పని తాను చక్కబెడుతున్నారు. జనంలో ముందు తనంటే ఓ అభిప్రాయం స్థిరంగా సంపాదించుకుని ఆపై బాబు అండ్ కో ను ఢీకొనే ఆలోచన పవన్ చేస్తునట్లు కనిపిస్తోంది. ఒక విధంగా బాబు-పవన్ ఇద్దరూ దాగుడుమూతులు ఆడుతున్నారు. ఈ ఆట క్లయిమాక్స్ కు వస్తే వుంటుంది..అసలు సిసలు పొలిటకల్ మజా.

Show comments