మూడు మార్గాలు..ఈసీ ఎటు వెళుతుంది?

ఒక వివాదం తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించడానికి రకరకాల మార్గాలు వెతుకుతారు పరిష్కర్తలు. చివరకు ఒక మార్గం ఎంచుకుంటారు. ఆ పరిష్కారం వివాదపడిన వారికి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. కాని పరిష్కారం వచ్చే వరకు ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకేలోని శశికళ, పన్నీరుశెల్వం వర్గాల పరిస్థితి ఇదే. పార్టీ ఎన్నికల చిహ్నం 'రెండాకులు' కోసం రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏప్రిల్‌లో జరగబోయే ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక. రెండాకులు ఎవరికి దక్కితే ఆ వర్గమే అసలైన అన్నాడీఎంకేగా గుర్తింపు పొందుతుంది. దీనిపై ఎన్నికల కమిషన్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందా? అని అన్నాడీఎంకే వర్గాలతోపాటు అన్ని పార్టీలూ ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. మార్చి 22న (ఎల్లుండి) ఈ పంచాయతీ జరుగుతుంది.

ఎన్నికల కమిషన్‌ ముందు కొన్ని మార్గాలున్నాయి. వాటిల్లో ఏది ఎంచుకుంటుంది? అనేది ఉత్కంఠభరితంగా మారింది. మొదటి మార్గం...శశికళ వర్గానికి ఎన్నికల చిహ్నం కేటాయించడం. ఇందుకు కారణం అది అధికారంలో ఉండటం. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొంది, అసెంబ్లీలో బలం నిరూపించుకొని ఆ వర్గం అధికారంలోకి వచ్చింది కాబట్టి చిహ్నం దానికి ఇవ్వవచ్చు. రెండో మార్గం...చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతే ఎవ్వరికీ కేటాయించకుండా కొంతకాలంపాటు నిలిపేయడం. అలా నిలిపేస్తే రెండు వర్గాలూ వేరవేరు గుర్తులపై పోటీ చేయాల్సివుంటుంది. తమిళనాడులో ఎన్నికల గుర్తుపై వివాదం రేగడం ఇది రెండోసారి. గతంలో ఎంజీఆర్‌ మరణించాక పార్టీ జయలలిత, జానకి (ఎంజీఆర్‌ భార్య) వర్గాలుగా విడిపోయింది. అప్పుడు రెండాకుల కోసం కొట్టుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్‌ దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఆ వర్గాలకు వేరువేరు గుర్తులు కేటాయించింది. ఇప్పుడూ ఇలా చేయొచ్చు.

మూడో మార్గం...యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉంచడం. దీని ప్రకారం ఈ ఉప ఎన్నిక వరకు గుర్తును శశికళ వర్గానికి ఇచ్చి తరువాత నిలిపేసి శాశ్వత పరిష్కారం చూడటం. శశికళ వర్గం వాదన ప్రకారం...పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుల్లో 95 శాతం మద్దతు ఉంది. 122 మంది ఎమ్మెల్యేలు, 37 మంది ఎంపీల మద్దతు ఉంది. పన్నీరుశెల్వం వర్గం వాదన ప్రకారం...పార్టీ కేడర్‌ మద్దతు ఉంది. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన విధానం సరిగా లేదు. కాబట్టి ఆమె ఎంపిక చట్టపరంగా చెల్లదు. శశికళ వర్గానికి చెందిన పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ అభ్యర్థిత్వం చెల్లదు. శశికళ వర్గం అసలు అన్నాడీఎంకే కాదు.

శశికళ వర్గానికి మెజారిటీ ఉన్న విషయం వాస్తవమే అయినా  తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే అభిప్రాయం ఉంది. ఈ కేసు ఎన్నికల కమిషన్‌ విచారణలో ఉంది. ఇప్పుడు ఎన్నికల గుర్తును శశి వర్గానికి ఇచ్చినట్లయితే శశికళ ఎంపికను కూడా ఎన్నికల కమిషన్‌ సమర్థించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఎన్నికలో ఆ వర్గానికి ప్రయోజనం కలిగించవచ్చు. ఆ తరువాత శశికళ ఎంపిక సరైంది కాదని ఎన్నికల కమిషన్‌ చెప్పినా దానికంత విలువ ఉండకపోవచ్చేమో...! రెండాకులు ఫ్రీజ్‌ చేసినట్లయితే శశికళ, పన్నీరుశెల్వం వారి వ్యక్తిగత ఇమేజ్‌ పైన ఆధారపడాల్సిందే. వారికి కేటాయించే గుర్తులను జనం మనసులో నాటుకునేలా చేయగలగాలి. ఒక్క రోజు ఆగితే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తెలిసిపోతుంది.

Show comments