'పెంపు'పై బాబుకి షాకిచ్చిన కేసీఆర్‌

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ పిల్లిమొగ్గలేస్తోన్న విషయం విదితమే. 'అదిగో పెంపు.. ఇదిగో పెంపు.. పని దాదాపుగా పూర్తయిపోయినట్లే..' అంటూ టీడీపీ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి ఇస్తోన్న 'ప్రయార్టీ' అంతా ఇంతా కాదు. 'నియోజకవర్గాల పెంపు అత్యంత ముఖ్యమైన అంశం..' అంటూ టీడీపీ నేతలు చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్లు చూసి, అంతా ఫక్కున నవ్వుకుంటున్నారు. రాష్ట్రానికి నియోజకవర్గాల పెంపుతో అదనంగా ఒరిగేదేంటి.? అన్న ప్రశ్నకు మాత్రం టీడీపీ వద్ద సమాధానం లేదు. 

నిజానికి, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి తొలుత ప్రాచుర్యం కల్పించింది తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీనే. 'నియోజకవర్గాల పెంపు జరగబోతోంది..' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన సంకేతాలతోనే, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. విపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ అది. కేసీఆర్‌ వ్యూహం బాగానే వర్కవుట్‌ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, ఇప్పుడు నియోజకవర్గాల పెంపు అంశం పరిస్థితేంటి.? అన్న విషయం ఆలోచిస్తే, కేంద్రం నుంచి లీకులు తప్ప, ఖచ్చితమైన సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరమే. వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కూడా నియోజకవర్గాల పెంపు విషయంలో చాలా శ్రద్ధపెట్టారు. ఇప్పుడాయనకి ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది. వెంకయ్య మీదే ఆశలు పెట్టుకున్న చంద్రబాబు, నియోజకవర్గాల పెంపు జరిగి తీరుతుందంటూ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నారు. 

అయితే, తాజాగా ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీ వద్ద నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావించారట. దానికి ప్రధాని, 'పరిశీలిస్తాం..' అని చెప్పారట. 'పెరిగితే మంచిదే.. పెరగకపోయినా నష్టం లేదు..' అంటూ కేసీఆర్‌, ప్రధానితో భేటీ అనంతరం చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే, ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రసక్తే లేదన్న విషయం సుస్పష్టమవుతుంది. 

కేంద్రం చేస్తుందో లేదో.. కేసీఆర్‌కి అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఇంట్రెస్ట్‌ తగ్గిపోయింది. చంద్రబాబు మాత్రం, ఇంకా ఆ అంశాన్ని పట్టుకునే వేలాడుతున్నారు. విభజన చట్టంలోనే ఈ అంశం ప్రస్తావించినాగానీ, చట్టపరమైన సమస్యలు ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారాయి. 

చివరగా.. రాజకీయ నిరుద్యోగుల కోసం తప్ప, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వల్ల ప్రజలకు ఒరిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నది నిర్వివాదాంశం.

Show comments