ఉన్నది ఉన్నట్లుగా...'ముందస్తు ఎన్నికలు'

పూర్వం పల్లెల్లో వానల కోసం పాటలు పాడేవారు. వానల్లు కురవాలి వానదేవుడా అంటూ..

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పాడుతున్నారు. సదా మీద సేవలో అన్నట్లుండే ఆయన అనుకూల మీడియా కూడా అలాగే పాడుతోంది.

త్వరగా ఎన్నికలు రావాలి 

కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు రావాలి

మోడీ-బాబు కలిసే పోటీ చేయాలి

రాష్ట్రంలో మళ్లీ దేశం అధికారంలోకి రావాలి

ఇలా రిథమిక్ గా పాడేసుకుంటోంది పత్రికలనిండా పసుపు పూసి, అదే అందమనుకుంటున్న మీడియా. అసలు ఏమిటిదంతా? ఏమిటీ బాబుగారి యోచన. ఏమిటీ అనుకూల మీడియా బాధ. 
---
గట్టిగా మూడేళ్లు తిరగకుండానే తెలుగుదేశం పాలనలపై ఇటు రాజకీయ ఆశ్రితుల, అటు ఉద్యోగస్తుల, టీచర్ల అసంతృప్తి బయటకు వస్తోంది. ఎంత విశృంఖల అధికారం చేతిలో వున్నా కూడా మూడేళ్లదాకా మంత్రివర్గ విస్తరణ అన్నది చేయలేకపోయారు. విచ్చలివిడిగా ఇతర పార్టీల జనాలను లోపలికి తెచ్చి, తలుపులు మూసి, ఏం జరుగుతోందో తెలియకుండా వీలయినంతగా దాచారు. 

తీరా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగేసరికి తలుపులు తీసినట్లయింది. పార్టీలో లుకలుకలు, శ్రీకాకుళం(శివాజీ), విశాఖ (బండారు), తూర్పు(గోరంట్ల), చింతమనేని(వెస్ట్), ధూళిపాల (గుంటూరు), బోండా(కృష్ణా) ఇలా జిల్లాల వారీగా నిరసన స్వరాలు వినిపించాయి. ఇలా వినిపించిన స్వరాలు 'సాక్షి' సాక్షిగా వినిపిస్తుంటే, అబ్బే అంతలేదు, అంతా సర్దుకుపోయింది, ఊ.. ఉత్తుత్తినే.. హుష్ కాకి అంటూ కథనాలు వండుకోవడం అన్నది అస్మదీయ పత్రికల పనయింది.

ఈలోగా కడివెడు పాలల్లో చిటికెడు ఉప్పు అన్నట్లుగా, ఎస్సీల కోసం ఇంత చేసా, అంత చేసా, ఇంతపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తున్నా అంటూ చంద్రబాబు చెబుతుంటే, ఎస్సీలకు చేసిందేమిటీ? అంటూ నిలదీసారు తిరుపతి ఎంపీ శివప్రసాద్. ఇదంతా శివప్రసాద్ భూ భాగోతం అని బురదజల్లే పని స్టార్ట్ చేస్తే, ఊరుకోకుండా బౌన్స్ బ్యాక్ అయ్యే పని స్టార్ట్ చేసారు. 
ఇలా ఇన్ని సమస్యలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఎందుకు? కొడుకు లోకేష్ చేతిలో వారసత్వ పగ్గాలు పెట్టేందుకు తెగించి మంత్రివర్గ విసర్తణ చేయడం వల్ల. ఇప్పుడు ఎన్నాళ్లు పత్రికలు అడ్డంపెట్టి, కన్నాలు కనపడకుండా చేస్తారు? ఎన్నాళ్లు ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. భయం అన్నది అధికారం చేతిలో వున్నంత వరకే వుంటుంది. ఎన్నికలు దగ్గరలో వున్నాయి అంటే కాస్తయినా భయం వుంటుంది. ఎందుకంటే టికెట్ కావాలి కదా? అందుకే 2018 ఆఖరుకే ఎన్నికలు అంటూ ఓ కొత్త కబురుకు టముకు వేయడం ప్రారంభించారు. 

మరోపక్క జనాల్లో వ్యతిరేకత అన్నది మౌంట్ కావాలి అంటే కాస్త టైమ్ పడుతుంది. మూడేళ్లకు కొంచెమే పెరిగింది అనుకంటే అయిదేళ్లకు మరికొంచెం పెరుగుతుంది. అందుకే వీలయినంత త్వరగా ఎన్నికలు జరిగిపోతే, పెద్దగా వ్యతిరేకత వుండదు. పైగా అన్నింటికి మించి ఇల్లు కట్టుకున్నావ్ కానీ, అమరావతి కట్టలేదేం బాబూ అని అడిగే చాన్స్ వుండదు. నాలుగేళ్లలో ఎలా కడతా? అయిదో ఏడు లేకుండా పోయింది కదా? అని చెప్పుకోవచ్చు. మరి కట్టాలంటే, తాను గీయించిన డిజైను, తాను వేయించిన ప్లాను, తాను వేసుకున్న లెక్కలు అన్నీ నెరవేరాలంటే మళ్లీ తననే ఎన్నుకోమని జనాల ముందుకు వెళ్లొచ్చు. అనుభవం వున్న తనవల్ల కాక, మరెవరివల్లా కాదు అమరావతి కట్టడం అని మరోసారి చెప్పుకోవచ్చు.

ఈ వైనం అంతా ఇలా వుంటే, సంతలో పిల్లాడు తప్పి పోకుండా వుండాలంటే పెద్దవాళ్ల చేయి వదలరాదు. అందుకే ఇప్పుడు బాబుగారు మోడీ చేయి వదలరాదు. అలా అని బాబు చేయి వదిలేయాని మోడీగారు కూడా అనుకోరాదు. మోడీ చరిష్మా దేశంలో బాగానే వుందన్నది క్లియర్. అందుకే జమిలి ఎన్నికలోచ్. అంటూ కోరస్ పాడుతోంది. మోడీ గుడ్ లుక్స్ లో వుంటూ, వెంకయ్య లాంటి వాళ్ల సహకారంతో పొత్తు మరింత గట్టిగా వుండేలా చేసుకుంటూ, ఆ విధంగా ముందుకు వెళ్తే, ఆ గాలివాటంలో తను కూడా నెగ్గుకు ముందుకు వెళ్లిపోవచ్చు అన్నది బాబుగారి పిలాను.

అంటే ముందుగా ఎన్నికలు వస్తే మోడీ మనసు మారేలోగా, ఓటరులో వ్యతిరేకత మారేలోగా, పార్టీ జనాల్లో అసంతృప్తి పెరిగేలోగా పని కానిచ్చేయవచ్చు. లేదూ, ఇలా ఎన్నికలు రాలేదు అనుకోండి. మున్సిపల్, పంచాయతీ, మండల ఎన్నికలు చేయాల్సి రావచ్చు. మళ్లీ అదో తలనొప్పి, ఇప్పుడైతే, ఆ ఎన్నికల ఆశ చూపించి, అన్ని వర్గాల నాయకులను నీకే టికెట్.. నీకే టికెట్ అంటూ పని చేయించేసుకోవచ్చు. పైగా ఈ ఎన్నికలు ముందు జరిగితే, ఈ లోకల్ బాడీ ఎన్నికలన్నింటినీ బుట్టలో పెట్టేయచ్చు. 

2014లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ ఎన్నికలన్నింటినీ వరుస పెట్టి ముందుగా జరిపించేసి, తెలుగుదేశం పార్టీకి చాన్స్ ఇచ్చింది. బాబేమీ కాంగ్రెస్ పార్టీలా వెర్రివాడు కాదు కదా? అలా చేయడానికి. ముందుగా లోకల్ ఎన్నికలు జరిపించి, పార్టీలో లుకలుకలు అన్నీ బయటకు వచ్చేలా చేసి, ఆ ఫలితాలు మైనస్ అయితే, వాటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడేలా చేసుకోవడానికి చంద్రబాబు ఏమీ రాజకీయ పరిణితి లేని నాయకుడు కాదు కదా?

ఇక పవన్ కళ్యాణ్. ఈయన ఒకడు. ఆయన సినిమాల్లో నేలమీద స్థిరంగా నిల్చొకుండా ఊగినట్లే, రాజకీయాల్లోనూ ఊగుతుంటాడు. ఒక్కోసారి బాబు భేష్ అంటారు. అంతలోనే వైకాపా ఎంపీలు శభాష్ అంటారు. కేంద్రాన్ని తిడుతుంటారు. కానీ అదే కేంద్రం దగ్గర సాగిలపడిన బాబుగారి ప్రభుత్వాన్ని మాత్రం మోస్తుంటారు. పోటీకి రెడీ అంటారు కొన్ని స్థానాల్లోనే అంటారు. ఈయన ఇలా ఈ సంధీయుగంలో వుండగానే ఎన్నికలు వచ్చేసాయనుకోండి. తనకు అట్టే టైమ్ లేదని, 2024 నాటికి చూసుకుంటా అని మరోసారి బాబుగారికి దన్నుగా వుండిపోవచ్చు. మరి అభిమానులకు, నమ్మే కులపోళ్లకు, ఇంకా ఇంకా ఇతరత్రా వారికి చెప్పడానికైనా పవన్ కళ్యాణ్ కు ఓసాకు వుండాలి కదా? అది కూడా ఈ ముందస్తు ఎన్నికలతో సాధ్యమవుతుంది.

అందుకే అన్ని రోగాలకు ఒకటే ఒక్కమాత్ర అన్నట్లుగా మోడీ చేయిపట్టుకుని, 2018 చివరకు ఎన్నికల ముందుకు వెళ్లేటట్లయితే ఏ గొడవాలేదు. అదే ఇప్పుడు మన బాబుగారి మీడియా తక్షణ కర్తవ్యం.

Show comments