తమిళనాడులో తమ వ్యాఖ్యానాలతో రాజకీయ రౌడీల నుంచి దాడులు ఎదుర్కొన్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ సినీ నటులు తమ అభిప్రాయాలను వెల్లడించడమో లేదా సమకాలీన అంశాలపై స్పందించడమో చేసిన సందర్భాల్లో కోపం వచ్చి వీరిపై రాజకీయ నేతల మనుషులు దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి బాధితుల జాబితా పెద్దదే!
అందులోనా అధికారంలో ఉన్న వారి గురించి మంచిగా మాట్లాడినా.. చెడుగా మాట్లాడినా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి తమిళనాట. కరుణానిధికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడిందని చెప్పి.. జయ టీవీలో ఒక కార్యక్రమాన్ని హోస్టు చేస్తున్న కుష్భూను టక్కున బయటకు పంపించారు.
జయ వైపు నుంచి అలాంటి చర్యలు తీసుకోవడంతో ఆమెకు డీఎంకే నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ స్టాలిన్ కు అనుకూలంగా కుష్బూ ఒక ప్రకటన చేయగానే.. అళగిరి మనుషులు ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఆఖరికి కరుణానిధి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాడు!
పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లకుండా రాజకీయ పరిణామాల గురించి కామెంట్లు చేయడం.. ఎవరిపై అయినా అభిమానాన్ని చాటుకోవడం వంటి చేష్టలతో ఆఖరికి కమల్ హాసన్ ,రజనీకాంత్ లే ఇబ్బందుల పాలయ్యారు. ఇలాంటి వాతావరణంలో జయలలిత మీద తన అభిమానాన్ని చాటుకుంటోంది త్రిష!
తను జయలలిత చదివిన స్కూల్ లోనే చదివానని.. జయలలిత బయోపిక్ తీస్తే తను అందులో టైటిల్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని .. త్రిష చెప్పుకొస్తోంది. ఇలాంటి మాటలు అక్కడ ఎటుపోయి ఎటొస్తాయో తెలీదు!
జయ పై బయోపిక్ మాటత్తెత్తున్న త్రిషపై అన్నాడీఎంకే శ్రేణులకే కోపం వచ్చినా రావొచ్చు! అలాగే తమిళనాట రాజకీయ పరిస్థితులు కూడా ఏమంత బావోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో జయ ఫ్యాన్ గా ముద్రపడితే.. రేపు వేరే వాళ్లు అధికారంలోకి వస్తే.. త్రిషను అనవసరంగా ఇబ్బందుల పాల్జేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పంచెకట్టుకున్న తమిళుడు ప్రధాని కావాలని కమల్ చేసిన ఏకైక వ్యాఖ్య చీరకట్టు జయకు కోపాన్ని తెప్పించింది. ఆఖరికి కమల్ ఇదేం దేశంరా బాబూ.. అనుకోవాల్సి వచ్చింది! సో.. అలాంటి వారి అనుభవాల నుంచి త్రిషలాంటి వాళ్లు పాఠాలు నేర్చుకోవాలేమో!