-చెప్పిందే చేస్తున్న డొనాల్డ్ జే ట్రంప్
-ఇస్లాం దేశాలపై ఆంక్షలు, భారతీయులకు షాక్!
-అమెరికా 'పెద్దన్న' హోదాకూ చేటు!
-ట్రంప్ థియరీ.. అమెరికాకే ప్రమాదం!
ఉరుములు... చెట్లను వేళ్లతో సహా పెకలించేసే తీవ్రమైన గాలులు.. దబాయించి కొట్టినట్టుగా పడే వాన హోరును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తారు. భారత్ వరకూ వీటిని తుఫాన్‌లని, ఆస్ట్రేలియాలో అయితే విల్లీవిల్లీలని, కరేబియన్ తీరంలో అయితే ఈ తరహా వాతావరణ స్థితిని టైపూన్‌లని వ్యవహరిస్తారు! భారీఎత్తున తీర ప్రాంతాన్ని కలిగిన అమెరికాలోనూ వీటికో పేరుంది. ముంచెత్తి వచ్చి.. జనజీవనంలో అలజడి రేపే గాలి వాన్లను అక్కడ హరికేన్లు అంటారు! మరి ప్రపంచం ఇలాంటి పరిస్థితులను అనుభవపూర్వకంగా చూసి.. వీటికి రకాల పేర్లు పెట్టుకుంది. తుఫాన్లను చూసి, హరికేన్ల అలజడితో అదిరిపోయి తట్టుకుని నిలబడిన ప్రపంచం.. ఇప్పుడు వీటన్నింటికీ మించిన విపత్తును ఎదుర్కొంటోంది. ట్రంప్ అనే హోరుకు తట్టుకోలేకపోతోంది! విలవిల్లాడుతోంది. ఇప్పుడు ట్రంప్ హరికేన్ అమెరికాను ముంచెత్తింది. దీని ఫలితంగా ఎక్కెడక్కడో ప్రకంపనలు పుడుతున్నాయి! మామూలుగా హరికేన్లకు ప్రకంపనలను పుట్టించేంత శక్తి ఉండదు కానీ, ట్రంప్ దెబ్బకు కొన్ని కోట్ల మందికి కాళ్లకింద భూమి చీలినట్టుగా, తాము అందులో కూరుకుపోయినట్టుగా అనిపిస్తోంది! ఇది వరకూ లేని పూర్తి కొత్త అనుభవం ఇది.
అమెరికా ఫస్ట్... అంటున్నాడు అంతే! మిగిలిన ప్రపంచం అవాక్కవుతోంది. ఉపాధి కోసమో, వ్యాపారం విషయంలోనో అమెరికా మీద ఆధారపడ్డ దేశాలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ జాబితాలో ముందు వరసలో భారతదేశం ఉండటంతో.. 'ట్రంప్' భారతీయులకు కలవరపాటును కలిగించే వ్యక్తిగా మారాడు. ప్రత్యేకించి తెలుగు గడ్డ మీద ఇప్పుడు ఎటు చూసినా 'ట్రంప్ గాడు..' అంటూ చర్చలే! అమెరికా అధ్యక్షుడిని పేరు మనోళ్ల వ్యవహారికంలో భాగం అయిపోయిందిప్పుడు. ప్రతి రెండుమూడు ఇళ్లల్లో ఒకదానికి అమెరికాతో ఏదో విధమైన సంబంధాలు ఏర్పడిపోయాయిప్పుడు! తమ కూతురో, కొడుకో, కోడలో, అల్లుడో.. ఐటీ ఉద్యోగిగా ఉంటున్నారు. ఈ రీజన్‌తోనే ఇప్పుడు ప్రతి ఇంటా ట్రంప్ గురించి చర్చ జరుగుతోంది. ట్రంప్ నిర్ణయాలు ప్రత్యక్షంగా తెలుగు గడ్డలోని కొన్ని ఇళ్ల మీద, పరోక్షంగా మరెన్నో ఇళ్ల మీద చూపుతున్నాయి! దీంతో డొనాల్డ్ జే ట్రంప్.. కదలికలను గ్రామీణ తెలుగిళ్లు కూడా ఆందోళనతో కూడిన ఆసక్తితో, భయంతో కూడిన ధ్వేష భావంతో.. గమనిస్తున్నాయి! వీడు ఎక్కడ తమ పిల్లల ఉద్యోగాలకు ముప్పుతెస్తాడో.. అనే ఆందోళనే నిండి ఉందిప్పుడు! అఖరికి మోడీ ఏం చేస్తున్నాడో.. పట్టించుకోనే తీరిక, ఆసక్తి లేని జనాలు.. ట్రంప్ చేస్తున్న పనుల గురించి మాత్రం అనునిత్యం అప్‌డేట్ అవుతున్నారంటే.. ట్రంప్ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్రాన్స్ తుమ్మితే.. యూరప్‌కు జలుబు చేస్తుందనేది అందరం హిస్టరీ బుక్స్‌లో చదువుకున్నాం. అమెరికా అధ్యక్షుడు తుమ్ముతుంటే.. ప్రపంచానికి చలి జ్వరం వస్తుండటాన్ని ఇప్పుడు గమనిస్తున్నాం.
చెప్పింది చేస్తున్నాడంతే!
ఇప్పుడు ఇంతగా అవాక్కవ్వడానికి ఏమీలేదు. తను చెప్పిందే చేస్తున్నాడు డొనాల్డ్ జే ట్రంప్. అమెరికా ఫస్ట్ అన్నాడు.. అమెరికాకే ప్రాధాన్యతను ఇస్తున్నాడు! మన ఉద్యోగాలను విదేశీయులు దోచుకెళ్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ అలాంటి పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి కఠినమైన చర్యలు చేపట్టాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలనే, అధికారంలోకి వచ్చాకా అమలు పెడుతున్నాడు. ప్రత్యేకించి భారతీయులు ఇంత వరకూ వస్తుందని ఊహించలేదు!
అమెరికాకే తన తొలి ప్రాధాన్యత అంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిన మాటలను విన్న భారతీయ విశ్లేషకులు.. ఆయనను ఒక సగటు భారతీయ రాజకీయ నేత లెక్కన చూశారంతే! ఇలాంటి మాటలన్నీ మామూలే, ఎన్నికల నేపథ్యంలో స్థానికులను ఆకట్టుకోవడానికి ఓట్లను వేయించుకోవడానికి ఇలాంటి మాటలు చెబుతున్నాడు.. వాస్తవంలో ఆయన ఆలోచనలను అమలు పెట్టడం సాధ్యం అయ్యేపనికాదు.. అని మనోళ్లు విశ్లేషించారు! ట్రంప్‌కు అంత సీన్‌లేదు, గెలవడు అనేది ఫస్ట్ చెప్పిన మాట. గెలిచినా.. ఆయన విధానాల అమలు సాధ్యంకాదు అనేది రెండో మాట. రెండూ అబద్ధాలే అయిపోయాయి. గెలవడూ.. వట్టి వదరబోతు, జోకర్.. అని ప్రపంచమంతా కమేడియన్‌లా చూసిన వ్యక్తి అమెరికన్ల ఆదరణ పొందాడు. సాధ్యంకావు అన్న.. మాటల అమలులో ట్రంప్ అదర గొట్టేస్తున్నాడు!
హెచ్ వన్ బీ వీసాల బిల్లులో సవరణలను ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వెళ్తుండగానే, భారతీయ ఐటీ కంపెనీలు అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ప్రత్యక్షం అయిపోయాయి. రిక్రూట్‌మెంట్స్‌ను మొదలుపెట్టేశాయి! ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు జరిగే చోటికి భారతీయ విద్యార్థులకు ప్రవేశంలేదు అని భారతీయ ఐటీ కంపెనీలే బోర్డులు పెట్టేశాయి, తమ ప్రాధాన్యత అమెరికన్ యువతకే అని అవి స్పష్టం చేసేశాయి. ఇంత జరిగింది కేవలం కొన్ని గంటల్లోనే.. అంటే, ట్రంప్ నిర్ణయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మోడీ, కేసీఆర్‌ల లాంటి వాడు కాదు!
అమెరికా ఫస్ట్, మన ఉద్యోగాలు మనకే, మన అవకాశాలు మనకే.. అంటూ జాతీయాభిమానాన్ని, విదేశీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ.. ప్రపంచాన్ని వెక్కిరించిన స్వదేశ భావోద్వేగాలను రెచ్చగొట్టిన ట్రంప్‌ను చూసి చాలా మంది మోడీ, కేసీఆర్‌ల వంటి వాళ్లను గుర్తు చేసుకున్నారు. హిందుత్వవాదాన్ని బీజేపీ, తెలంగాణ వాదాన్ని కేసీఆర్ వాడుకుని జాతీయవాదం, రాష్ట్ర వాదాలతో అధికారాలను సొంతం చేసుకుని.. తీరా అధికారంలోకి చేతిలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలను పక్కన పెట్టారు! కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పిన మోడీ భారత దేశాన్ని కాంగ్రెస్ దిగజార్చిన స్థాయికి దిగువకే తీసుకెళ్తున్నాడు. ఇక ప్రజల్లో, యువతలో తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర బిగ్ షాట్‌లతో ఎంతలా అనుబంధాన్ని ఏర్పరుచుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కేసీఆర్ అయినా, బీజేపీ అయినా, ట్రంప్ అయినా.. ఎన్నికల సమయంలో దాదాపు ఒకే వ్యూహాన్ని అనుసరించారు, ఒకేలా జనాలను రెచ్చగొట్టారు. ఎటొచ్చీ గెలిచాకా కూడా ట్రంప్ చెప్పిందే చేస్తున్నాడు! అంతే తేడా.
తను చేస్తున్న పనులకు భవిష్యత్తుల్లో ఫలితాలుంటాయని మోడీజీ చెబుతున్నారు! మరి ఈయనకు భవిష్యత్తు ఉందో లేదో తెలీదు కానీ.. ఇంకా అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనను దూషిస్తూ పబ్బం గడుపుతున్నాడు. ఇక తెలంగాణ వెనుకబాటు తనం గురించి ఏం మాట్లాడినా.. ఆంధ్రోళ్ల పాలన .. అనే మాటలు చెప్పి కేసీఆర్ బండిలాగించేస్తున్నాడు. అయితే ట్రంప్ గతాన్ని తిట్టడం లేదు. తమ వాళ్ల కోసం తనేం చేస్తాను అన్నాడో.. అదే ఆచరణలో చూపుతున్నాడు. మిగతా ప్రపంచానికి అది మంచికావొచ్చు.. చెడుకావొచ్చు.. 'అమెరికా ఫస్ట్' నినాదంతో దూసుకుపోతున్నాడంతే!
మిగతా అధ్యక్షుల కన్నా మంచివాడే!
ఒక రకంగా చూస్తే.. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మాజీ అధ్యక్షుల కన్నా చాలా మంచోడు! ముస్లిం దేశాల మీద వైఖరి విషయంలో అయితే మరీ మంచోడు! అదేంటి.. ఇస్లాం దేశాల ప్రజలు తన దేశంలో అడుగుపెట్టనీయకుండా, ఇప్పటికే అమెరికాలో ఉండటానికి అర్హత కలిగిన వారిని కట్టడి చేయడంలో ఉన్న మంచితనమా? అని ప్రశ్నించవచ్చు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఇస్లామిక్ కంట్రీస్‌పై అమెరికన్ అధ్యక్షుల వైఖరిని గమనిస్తే.. వాళ్లంతా ఆయా దేశాలను విచ్ఛిన్నం చేశారు. ఇరాక్‌ను నాశనం చేశారు. అఫ్గాన్‌ను అల్లకల్లోలంచేశారు, సిరియాలో వినాశనం పుట్టించారు. లిబియా విఫల దేశం దిశగా నడిపించారు.. జార్జ్‌బుష్ సీనియర్, బిల్‌క్లింటన్, జార్జ్‌వాకర్ బుష్, బరాక్ ఒబామా.. వంటి అమెరికా అధ్యక్షుల హయాంలో నేటి ప్రపంచం కళ్లారా చూసిన వినాశనాలు ఇవి.
నేడు ఐసిస్ అనేది పుట్టుకురావడం అయితేనేం, అంతకన్నా ముందు తాలిబన్ ఉగ్రవాదం ప్రపంచాన్ని హెచ్చరించడం వరకూ రావడానికైతేనేం, లాడెన్ అనే ఉగ్రవాది తయారు కావడానికి అయితేనేం.. కారణం అమెరికా అధ్యక్షులే! అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించి, సద్దాంను ఉరి తీయించేంత వరకూ నిద్రపోలేదు బుష్. అక్కడ తమ కనుసన్నల్లో నడిచే కోరల్లేని పాముల్లాంటి ప్రభుత్వాలను ఏర్పరిచారు. అదే అదునుగా ఉగ్రవాద మూకలు పుట్టుకొచ్చాయి. అవి నేడు ప్రపంచానికే ప్రమాదకరంగా మారాయి!
తమ స్వార్థ ప్రయోజనాల కోసం బుష్ హయాంలో ఇరాక్‌ను నాశనం చేశారు. తదనంతర కాలంలో ఇరాక్- సిరియాల నుంచి ఐసిస్ పుట్టుకొచ్చింది. మళ్లీ ఐసిస్‌తో సమరం అంటూ.. మళ్లీ కొన్ని వేలమంది ప్రాణాలను పొట్టపెట్టుకోవడం అమెరికన్ అధ్యక్షుల ఆలోచన తీరు పుణ్యమే! ఒబామా, బుష్‌ల హయాంలో ఇస్లామిక్ కంట్రీస్‌పై బాంబుల వర్షం కురిసింది. ఆ దేశాల్లోని ప్రజలను రక్షించడానికి అని కొన్నాళ్లు, ఆ దేశాల నుంచి బుసలు కొడుతున్న ఉగ్రవాదాన్ని అణచడానికి మరికొన్నాళ్లు.. అక్కడి ప్రజల నెత్తిన బాంబులేస్తూ వస్తోంది అమెరికా. ఈ మారణ హోమంలో అమెరికా శత్రువుల సంగతేమో కానీ, అమాయక ప్రజలు మాత్రం కొన్ని లక్షలమంది బలయ్యారు! అక్కడి దేశాల జనాభానే తగ్గిపోయేంత తీవ్రమైన దాడులకు పాల్పడ్డారు.. అదంతా అమెరికన్ అధ్యక్షుల యుద్ధ కాంక్షే!
గత ఇరవై ఏళ్లలో చోటు చేసుకున్న ఈ పరిణామాలకు బాధ్యులైన జార్జ్‌బుష్, బరాక్ ఒబామా లాంటి వాళ్లు ఇస్లామిక్ దేశాల అమాయకుల కోణం నుంచి చూస్తే ఏ మాత్రం క్షమార్హులు కాదు. తను వస్తూ వస్తూనే బుష్ రెచ్చిపోయాడు. ఇస్లామిక్ దేశాలపై అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఒబామా కూడా ఆ దేశాల పట్ల తేనె పూసిన కత్తిలాగానే వ్యవహరించాడు. ట్రంప్ మాత్రం వస్తూ వస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తా.. అనకుండా, ఆ దేశాలతో సంబంధాలు అవసరం లేదు, అక్కడి పౌరులు రానక్కర్లేదు అంటున్నాడు. మరి వాళ్ల ప్రాణాలు తీయడం కన్నా, వాళ్లను తమ దేశంలోకి రానివ్వం.. అని దూరంపెట్టడం కొంచెం మంచి నిర్ణయమే కదా! అది కూడా ఈ నిషేధం తాత్కాలికమే అని ట్రంప్ స్వయంగా చెబుతున్నాడు. ముందు ముందు ఎలా వ్యవహరిస్తాడో తెలీదు కానీ, ప్రస్తుతానికి అయితే.. నిషేధం అనేది మరీ తూర్పారబట్టాల్సిన నిర్ణయం ఏమీకాదు!
ఏకాకిలా బతకగలడా..?!
పనులు చేసి పెడుతున్న భారతీయులను మా ఉద్యోగాలను దోచుకొంటున్నారని తరిమేస్తాం, మెక్సికన్లు ఇటు వైపు అడుగుపెట్టే అవకాశమే ఉండదు, చైనా సరుకును అమెరికన్ వీధుల్లోకి రానివ్వం. విదేశం మీద ఆధారపడే స్వదేశీ కంపెనీల భరతం పడతాం.. ఇవీ ట్రంప్ చెబుతున్న, ఆచరిస్తున్న మాటలు. మరి ఇలా అన్ని భవబంధాలనూ తెంచేసుకుని.. అమెరికాను ఏకాకిగా మార్చి, ట్రంప్ ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తాడు? అనేది ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చే అంశంకాదు! ఈ తీరుతో.. ఒకటైతే కచ్చితం. అమెరికా 'ప్రపంచ పెద్దన్న' అనే హోదాను కోల్పోతుంది. పది మందికి ఆశ్రయం ఇచ్చేవాడు, పక్కవాళ్లకు చేదోడు వాదోడుగా ఉండేవాడు పెద్ద మనిషి. అంతేకానీ.. అక్కసు మాటలు మాట్లాడే వాడు, ఆక్రోశంతో రగిలిపోయే వాడు.. ఏనాటికీ పెద్ద మనిషి కాలేడు. ట్రంప్ హయాంలో అమెరికా 'పెద్దన్న' హోదాను కోల్పోవడం ఖాయం అయ్యింది!
అలాగే అమెరికా అంతా తనే సష్టించుకుని, అంతా తనే అనుభవించుకునే స్థితిలో ఏమీలేదు. విదేశీ పెట్టుబడుల మీద అమెరికా చాలానే ఆధారపడి ఉంది! ఆ మధ్య ఒబామా భారత్ వచ్చినప్పుడు.. ఇక్కడి బడా వ్యాపారవేత్తలతో వరస పెట్టి సమావేశాలు అయ్యాడు. రండి.. మా దేశం రండి, పెట్టుబడులు పెట్టండి.. మా దేశం వ్యాపారావకాశాల స్వర్గం.. అంటూ భారతీయ బిలియనీర్ల ముందు తన దేశాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. ఆ దేశం కూడా విదేశీ పెట్టుబడుల మీద ఎంతగా దష్టి పెట్టిందో చెప్పడానికి అదొక రుజువు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండి.. ఎవ్వరినీ రానివ్వం అంటే, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
భారత్ వంటి దేశాల ఉద్యోగుల మీద ట్రంప్ అక్కసు వెల్లగక్కుతున్నాడు. మరి ఇలాంటి దేశం గనుక అమెరికా వ్యాపారస్తుల మీద తిరిగి అదే స్థాయి ప్రతిదాడి చేస్తే, అమెరికన్ వాల్‌మార్ట్‌లు, కేఎఫ్‌సీలు ఇక్కడ నుంచి మూటాముల్లె సర్దుకుని కదలాలి.. అంటూ ఎదురుదాడి చేస్తే? అప్పుడు ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? ట్రంప్ తీరు నేటి జీవన గమనానికి సెట్ అయ్యేది కాదు.
ప్రపంచం నేడొక కుగ్రామం. ఒకరి మీద మరొకరు ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. అలాకాదు.. లేదు.. అని సాగించే మనుగడలో ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడిప్పుడు కాకపోయినా.. ముందు ముందు అయినా అమెరికాకు అర్థం అవుతుంది. ఇప్పటి వరకూ తామేదో ప్రపంచాన్ని ఉద్ధరించేశాం, ఇక ప్రపంచానికి ఆ అవకాశం ఇవ్వం అని అమెరికన్లు ఈ కాసేపు ఫీలవొచ్చు కానీ.. తమది ఒట్టి అక్కసు మాత్రమే అని ట్రంప్‌కు ట్రంప్‌ను సమర్థించేస్తున్న అక్కడి జాతీయ వాదులకు అతి త్వరలోనే అర్థం అవుతుంది! అంత వరకూ వేచి చూడటమే! ట్రంప్ తాకిడిని ఎదుర్కొనడమే!