'అమ్మ'తో పెట్టుకుంది...అంతే సంగతులు...!

'ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో తెలియాలి'...అని 'అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌. నిజమే...ఇది కామన్‌సెన్సుకు సంబంధించిన విషయం. దీన్నే ఓ పూర్వ కవి 'అలవి కాని చోట అధికులమనరాదు' అని హితవు చెప్పాడు.  జీవితంలోగాని, రాజకీయాల్లోగాని కావల్సింది జ్ఞానం కాదు. లోకజ్ఞానం. అంటే కామన్‌సెన్స్‌. దీన్నే 'బతకనేర్చిన కళ' అని చెప్పుకోవచ్చు. లౌక్యం అన్నా ఇదే. తమ బలమేమిటో చూసుకోకుండా బలవంతులతో ఢీకొంటే తమిళనాడులో అన్నాడీఎంకే ఎంపీకి పట్టిన గతే పడుతుంది. శశికళ పుష్ప పేరు గుర్తుందా? అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ అయిన ఈమె ఈమధ్యనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎగువ సభకే చెందిన డీఎంకే ఎంపీ చెంప ఛెళ్లుమనిపించింది. 

తన అధినేత, దైవం 'అమ్మ'ను (జయలలిత) ఆ ఎంపీ చులకనగా మాట్లాడి ఎద్దేవా చేశాడని ఆగ్రహించిన పుష్ప వెనకాముందు చూసుకోకుండా కొట్టేసింది. ఇలా చేసినందుకు అమ్మ శభాష్‌ అంటుందని అనుకుందేమో తెలియదు. కాని సీన్‌ రివర్స్‌ అయి పిచ్చి పని చేసి పరువు తీశావంటూ జయలలిత ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో పుష్ప ఇగో దెబ్బతింది. నమ్ముకున్న అమ్మ ఇంత పని చేయడమేమిటి అనుకొని రాజ్యసభలోనే ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ జయపై ఆరోపణలు చేసింది. ఆమె తనను కొట్టించిందని చెప్పేసింది. 

జయ వల్ల తనకు ప్రమాదముంది కాబట్టి భద్రత కావాలని వేడుకుంది. ఆమెకు భద్రత ఎంతవరకు లభించిందో చెప్పలేంగాని ఇప్పుడు అభద్రత ఎదురైంది. కష్టాలు కమ్ముకున్నాయి. ఎవరెవరో కేసుల మీద కేసులు పెడుతుండటంతో పుష్ప ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమ్మతో పెట్టుకున్నందువల్లనే ఇదంతా జరుగుతోందని నాయకులు అనుకుంటున్నారట...! ఆ కేసులను బట్టి చూస్తే అవి చాలా పాత ఘటనలు. పుష్ప తమను మోసం చేసిందని, వేధించిందని కేసులు పెట్టినవారు ఇన్నేళ్లు ఎందుకు ఊరుకున్నారో అర్థం కావడంలేదు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించగానే ఈ కేసులు తెర మీదకొచ్చాయి. 

వీటిల్లో నిజానిజాలు కోర్టులో తేలాల్సిందే. పుష్పను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత ఆమె మీద చీటింగ్‌ కేసు నమోదైంది. ఆమె ఒక కాంట్రాక్టు కోసం తన దగ్గర 20 లక్షలు తీసుకొని మోసం చేసిందని, ఆ డబ్బు ఇప్పించాలని ఒకాయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది రెండు విడతలుగా తాను డబ్బు ఇచ్చానని చెప్పాడు. తనకు కాంట్రాక్టు ఇవ్వకపోగా డబ్బు అడిగితే బెదిరిస్తోందన్నాడు. ఈ కేసు తరువాత తాజాగా మరో కేసు నమోదైంది. పుష్ప 2011 నుంచి 2014 వరకు ట్యుటికోరిన్‌ మేయర్‌గా ఉన్నారు. అప్పుట్లో ఈమె ఇంట్లో పనిచేసిన ఇద్దరు మహిళలు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమని? పుష్ప, ఆమె భర్త, కుమారుడు తమను నిర్బంధించి లైంగికంగా వేధించారని. 

అత్యున్నత పదవిలో ఉన్నవారితో పెట్టుకుంటే ఇలాగే బాధపడాల్సివుంటుంది. వైఎస్‌ జగన్‌ కాంగ్రెసు అధినేత సోనియా గాంధీతో తగాదా పెట్టుకున్నందువల్లనే సీబీఐ అతనిపై అక్రమాస్తుల కేసు పెట్టిందని అంటుంటారు. గతంలో కొందరు కాంగ్రెసు ఈ విషయం బహిరంగంగానే చెప్పారు.  ఓ కాంగ్రెసు నాయకుడు కేవలం తెల్లకాగితంపై రాసిచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.  ఫలితంగా జగన్‌ చాలాకాలం జైల్లో ఉండాల్సివచ్చింది. 'నేను ఏ తప్పు చేయలేదు' అని ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. తుది తీర్పు వచ్చేదాకా నిజానిజాలు తెలియవు. అధికారంలో ఉన్నవారు తమకు పడనివారిపై కేసులు పెట్టించడం మన దేశంలో అసాధారణం కాదు. 

కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఎలా వాడుకుంటోందో బహిరంగ రహస్యమే. మోదీ సర్కారు తనను వేధిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మొత్తుకుంటుండటం చూస్తున్నాం.'సర్కారు నన్ను, మిమ్మల్ని హత్య చేయించొచ్చు' అని కేజ్రీవాల్‌ పార్టీ నాయకుల సమావేశంలో అన్నారు. ఇది మరీ అతిశయోక్తిగా అనిపిస్తోందిగాని ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో తాజాగా ఎన్‌కౌంటర్లో చనిపోయిన నయీంను చేరదీసి పోషించింది ఎవరు? పోలీసులు. అంటే ప్రభుత్వమే. 

చివరకు అతని ఆగడాలు భరించలేక వదిలించుకుంది. నోటుకు ఓటు కేసుకు భయపడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టడంలేదని అంటున్నారు. రేపు ఒకవేళ టీడీపీ-బీజేపీ సంబంధాలు చెడిపోయి విడిపోతే మోదీ సర్కారు బాబును వేధించదనే గ్యారంటీ ఏమీ లేదు. వేధింపు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కాబట్టి ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. 

Show comments