కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికలు చంద్రబాబును తీవ్ర అసహనం, ఆవేశానికి గురిచేస్తున్నాయి. నియోజకవర్గంలో అకాల ఎన్నికలు బాబు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. శిల్పామోహన్‌రెడ్డి వైసీపీలో చేరడంతో భూమా కుటుంబానికి టికెట్ కేటాయించిన చంద్రబాబు పార్టీ గెలుపు బాధ్యతను మంత్రి అఖిల ప్రియ మీద పెట్టారు.
ఎన్నికలు జరగనున్న నంద్యాలలో పార్టీని చక్కదిద్దేందుకు, నాయకుల మధ్య సఖ్యత పెంచేందుకు బాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. నంద్యాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం సోదరులను ఆకర్శించేందుకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే ఇఫ్తార్ విందు సాక్షిగా పార్టీ విబేధాలు, వైఫల్యాలు బయటపడడంతో బాబు మంత్రి అఖిల ప్రియ, పార్టీ నేత ఫరూక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
రంజాన్ మాసాన్ని పురష్కరించుకుని ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆది నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విందును ముస్లింలు అధికంగా ఉన్న హైదరాబాద్, విజయవాడల్లో ఏర్పాటు చేసేవారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల నేపధ్యంలో అక్కడి ముస్లింలను ఆకట్టుకునేందుకు ఈసారి ఇఫ్తార్‌ను బాబు నంద్యాలలో ఏర్పాటు చేశారు.
విందుకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులను సమీకరించాలని స్థానిక పార్టీ నేతలను ఆదేశించారు. దాదాపు 50 వేల మందికి భోజనాలు సిద్ధం చేశారు. కానీ బాబు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 50 వేల మంది కాదు కదా అందులో పది శాతం 5వేల మంది కూడా ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు హాజరుకాలేదు. ఇది చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చుపెట్టి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే ప్రజలను ఎందుకు సమీకరించలేకపోయారంటూ మంత్రి అఖిల, ఫరూక్‌లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. విందు పంక్తిలో చంద్రబాబుకు ఇరువైపులా కూర్చున్న అఖిల, ఫరూక్‌లు బాబు భోంచేస్తున్నంత సేపూ దీనిపై సంజాయిషీ ఇచ్చుకున్నారట.
నంద్యాల పార్టీ నేతల్లో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలసుకునేందుకు ఇఫ్తార్ విందు పార్టీ బాబుకు సహాయపడింది. భూమా బ్రహ్మనందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ముందే తెలిసిన ఎస్పీవై, ఫరూక్ పార్టీకి తమ అనుచరులను తరలించలేదు. ఇదే విషయాన్ని అఖిల చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. దీంతో బాబు ఫరూక్‌ను తీవ్ర స్వరంతో మందలించారట.
స్వయంగా తనే విందులో పాల్గొంటున్నా జనాన్ని ఎందుకు తీసుకురాలేదంటూ ప్రశ్నించారట. సొంత వర్గంలోనే పట్టులేకుండా పార్టీ టికెట్ ఎలా ఆశించావని నిలదీశారట. మరోవైపు బీజేపీతో దోస్తీ చేస్తున్న బాబుపై రాయలసీమ ముస్లింలలో వ్యతిరేకత పెరిగిపోయింది.
ఇఫ్తార్ విందు జనాలు లేక వెలవెలబోవడానికి ఇది కూడా ఒక కారణంగా నంద్యాల ప్రజలు చెప్తున్నారు. నంద్యాల పట్టణ ఓటర్ల మీద ప్రధానంగా ఆశలు పెటుకున్న చంద్రబాబు తన పర్యటనలో అక్కడి వాస్తవ పరిస్థితిని చూసి విజయంపై ఆశలు వదులుకున్నట్టు కనబడుతున్నారని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.