బాహుబలి-2 సందేహాలు... అభిప్రాయాలు..!

ప్రపంచవ్యాప్తంగా 8వేల స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా రిలీజైన బాహుబలి-2 సినిమాకు సంబంధించి నా అభిప్రాయాలు.

బాహుబలి-ది బిగినింగ్‌ సినిమా రికార్డులు బ్రేక్‌ చేసి, ఏకంగా జాతీయ అవార్డు  అందుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానంగా ''బాహుబలి - ది కంక్లూజన్‌''లో వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్‌ కో దాదాపు ఐదేళ్లు కష్టపడింది. బాహుబలి-2పై నావిశ్లేషణ ఇది.

1. బాహుబలి పార్ట్‌-1తో పోల్చుకుంటే పార్ట్‌-2లో విజువల్‌ ఎఫెక్ట్‌ అంతగా లేవు. కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది.

2.   మొదటి భాగంతో పోలిస్తే, బాహుబలి- ది కంక్లూజన్‌ నాకు బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఎపిసోడ్‌, ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే సన్నివేశాల కంటే బాగుంది. ఎందుకంటే ఆ భాగం సరదాగా ఉంటూనే, ఎమోషనల్‌గా కూడా కనెక్ట్‌ అయింది.

3. వాస్తవానికి యుద్ధం బాహుబలికి, భళ్లాలదేవకు మధ్య అయినప్పటికీ.... బలమైన క్యారెక్టరైజేషన్స్‌తో శివగామి, దేవసేన పాత్రలు టోటల్‌ షోను డామినేట్‌ చేశాయి. శివగామిగా రమ్యకృష్ణ నటన, రాయల్‌ లుక్‌ అదిరింది. కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్లతో రమ్యకృష్ణ పలికించిన భావాలు అద్భుతం. దేవసేనగా అనుష్క నటన చాలాబాగుంది... కాకపోతే కాస్తా బొద్దుగా కనిపించింది. డీ-గ్లామరైజ్డ్‌ రోల్‌లో కనిపించిన అనుష్క.. పార్ట్‌-2కు వచ్చేసరికి కంప్లీట్‌ వేరియేషన్‌ చూపించింది. ఇక అవంతిక పాత్రలో తమన్న చాలా తక్కువగా మెరిసింది.

4.  మొదటి భాగంలో ప్రభాస్‌-తమన్న రొమాంటిక్‌ సన్నివేశాలపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. తమన్నాను చూపించిన విధానంపై చాలా కామెంట్స్‌ వచ్చాయి. పార్ట్‌-2లో మాత్రం దర్శకుడు మహిళల్ని తెలివైన వాళ్లుగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ధైర్యవంతులుగా చూపించాడు. 

5. కట్టప్పగా సత్యరాజ్‌, బిజ్జలదేవగా నాజర్‌ మెప్పించారు. పార్ట్‌-1లోనే పాత్రల పరిచయం అయిపోయింది కాబట్టి క్యారెక్టర్స్‌ పరంగా పార్ట్‌-2లో సర్‌ప్రైజ్‌లు ఏమీలేవు. అయితే శివగామి పెంపకంలో బాహుబలి ఎందుకు మంచివాడు అయ్యాడు, భళ్లాలదేవ ఎందుకు చెడ్డవాడిగా పెరిగాడనే విషయంపై కాస్త ఫోకస్‌ పెట్టి ఉంటే బాగుం డేది. కానీ, ఒక సగటు ప్రేక్షకుడిగా అర్థం చేసుకునేది ఎంటంటే.. బిజ్జలదేవుడి ప్రభావం భళ్లాలదేవపై ఎక్కువగా కనిపించింది.

6. రాజమౌళి అండ్‌ టీం కలిసి ఇంత పెద్ద ప్రాజెక్టును ఇన్నేళ్లుగా, ఇంత భారీ స్థాయిలో తీసుకురావడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను కచ్చితంగా చెప్పలగను. బాహుబలి-2 అనేది చరిత్ర సృష్టించే సినిమా కాకపోయినా.. ఇందులో ఇంటలిజెన్స్‌ పెద్దగా కనిపించకపోయినా.. సినిమాపట్ల రాజమౌళి అండ్‌ టీం చూపించిన తపన, ఉపయోగించిన టెక్నాలజీ, అందులో విజువల్స్‌ చాలా బాగున్నాయి.

7. ఒక విషయంలో బాహుబలిని చూసి మీరు గర్వంగా ఫీల్‌ అవ్వొచ్చు. మీ ఊహల్లో ఉన్న బలవంతులైన రాజులు, అందమైన రాజ్యాలు, ఆకర్షణీయమైన యువరాణులు, కళ్లుచెదిరే భవంతుల్ని వెండితెరపై అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. అయితే ఇప్పటివరకు చూడని ఓ కొత్త అంశాన్ని మాత్రం ఇందులో ఆవిష్కరించలేకపోయారు. ఓ భారతీయ కథకు లేటెస్ట్‌ టెక్నాలజీని జోడించి గ్రాండియర్‌గా ప్రజెంట్‌ చేసిన విధానం చూసి మీరు గర్వంగా ఫీల్‌ అవ్వొచ్చు. అయితే ఈ కథలు మనం ఇంతకుముందు చూసినవే. చదువుకున్నవే. 

8.  బాహుబలి ప్రాజెక్టు టాలీవుడ్‌కు ఎన్నో కొత్తదారులు చూపించింది. బ్రాండింగ్స్‌ కుదుర్చుకోవడం, కార్పొరేట్‌ లుక్‌ తీసుకురావడం, పుస్తకంగా సినిమాను ఆవిష్కరించడం, ప్రమోషన్‌లో కొత్తట్రెండ్స్‌ ప్రవేశపెట్టడం, చిన్నారుల కోసం బాహుబలి బొమ్మలు తయారుచేయడం, వీఆర్‌ ఎక్స్‌ పీరియన్స్‌.. ఇలా ఎన్నో కొత్తదారులు చూపించారు. థియేటర్లకు మాత్రమే పరిమితం కాకుండా, అంతకుమించి అన్నట్టు బాహుబలిని జనాల్లోకి తీసుకెళ్లారు.

9. వినూత్నమైన టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చాలా బాగున్నాయి. రాజ్యాంగం, ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం,, రాజును సభకు పరిచయం చేసే విధానం.. ఇవన్నీ బాగున్నాయి.

-ఎల్‌. విజయలక్ష్మి

Show comments