వైకాపాలోకి వదినమ్మ?

ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మిగిలిన నియోజక వర్గాలు అన్నీ స్తబ్దుగానే వున్నాయి. కానీ ఒక్క విజయవాడ నియోజకవర్గం మాత్రం ఎందుకు పదే పదే తెరపైకి వస్తోంది? లగడపాటి వెళ్లి బాబును కలిసారని, నారా బ్రాహ్మిణి విజయవాడ నుంచి పోటీ చేస్తారని, కేశినేనికి మళ్లీ టికెట్ ఇవ్వకపోవచ్చని, వైకాపా తరుపున ఈ సారి పివిపి రంగంలోకి దిగుతారని, ఇలా రకరకాల ఊహాగానాలు. ఇదంతా చూస్తుంటే విజయవాడలో ఏం జరుగుతోంది అన్నది కాస్త ఆసక్తి కరంగానే వుంది. దీని వెనుక చంద్రబాబు చాణక్యం వుందనీ వినిపిస్తోంది.

విజయవాడ అసలు కథ పురంధ్రీశ్వరి దగ్గర మొదలైందని రాజకీయ వర్గాల బోగట్టా. గత ఎన్నికల సమయంలో కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి భాజపా టికెట్ పై పోటీ చేయాలని పురంధ్రీశ్వరి విశ్వ ప్రయత్నం చేసారు. కానీ వదినగారి ఫ్యామిలీ అంటే కిట్టదు కనుక బాబు మోకాలు అడ్డం వేసారు. బాబును కాదని ఆంధ్ర భాజపా చేయగలిగింది లేదు కనుక, ఆమెను ఏకంగా సీమలోని రాజంపేటకు పంపారు. అక్కడ ఆమె ఓటమి చవి చూసారు.

ఈసారి మళ్లీ ఎలాగైనా దక్షిణ కోస్తా నుంచి పోటీ చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. బాబు-భాజపా పొత్తు వీడని బంధంలా వుండే అవకాశమే ఎక్కువగా వుంది. ఎందుకంటే మోడీని వీడి బాబు కోరి కష్టాలు కొని తెచ్చుకోరు. అందువల్ల ఈ నేపథ్యంలో మరోసారి పురంధ్రీశ్వరి ఆశలు అడియాశలే అయ్యే అవకాశం ఎక్కువగా వుంది. అందుకు తగినట్లే చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

విజయవాడలో లగడపాటిని సీన్ లోకి తీసుకురావడం వెనుక ఆంతర్యం అదే కావచ్చు. ఎందుకంటే లగడపాటి భాజపా నేత వెంకయ్యకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. మరోపక్క బ్రాహ్మిణి పేరును తెరపైకి తెచ్చారు. బ్రాహ్మిణి కనుక పోటీ చేస్తే, పురంధ్రీశ్వరి విజయవాడకు రావడం కష్టం. పైగా బ్రాహ్మిణి పోటీ చేస్తే, ఇక నందమూరి బాలకృష్ణ రాజకీయాల గురించి మరిచిపోవచ్చు. ఎందుకంటే తండ్రి, కూతురు, అల్లుడు, వియ్యంకుడు అంతా కుటుంబ పాలన అంటారు. బ్రాహ్మిణికి టికెట్ ఇచ్చి, తనకు ఇవ్వకపోయినా, బాలయ్య చేసేదేమీ లేదు. ఆ విధంగా నందమూరి ఫ్యామిలీకి శాశ్వతంగా తెలుగుదేశంలో గేట్లు మూసేయవచ్చు.

Readmore!

కానీ బ్రాహ్మిణి తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని, రానని చెబుతున్నారు. అయినా కూడా బ్రాహ్మిణి పేరు పదే పదే వినిపించడం వెనుక, పురంధ్రీశ్వరికి బ్రేక్ వేయడమే కారణంగా తెలుస్తోంది. ఎందుకయినా మంచిది అని ఇప్పటి నుంచే పురంధ్రీశ్వరి వేరే నియోజకవర్గం వెదకడం ప్రారంభిస్తారు.

ఇదిలా వుంటే భాజపాలో తన ఆశలు నెరవేరకుంటే, వైకాపాలో అడుగు పెట్టడానికి పురంధ్రీశ్వరి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ టికెట్ ఇస్తే వైకాపాలోకి వస్తానని ఆమె బేరం పెడుతున్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా. అయితే ఇది జగన్ కు కాస్త ఇబ్బంది కర పరిణామమే. విజయవాడ వైకాపా టికెట్ ను ఆశించేవాళ్లు ఒకరిద్దరి కన్నా ఎక్కువే వున్నారు. అయినా పురంధ్రీశ్వరి కేవలం భాజపా-తేదేపాలపై వత్తిడి చేసేందుకే వైకాపాతో బేరం పెడుతున్నారా? లేక నిజంగా వైకాపాలోకి వెళ్లేందుకు ఆసక్తిగా వున్నారా? అన్నది క్లియర్ గా తెలియాల్సి వుంది. అయితే ఈ గ్యాసిప్ మాత్రం రాజకీయ వర్గాల్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే, వైకాపాలో లక్ష్మీ పార్వతి తరువాత చేరిన మరో నందమూరి ఫ్యామిలీ మెంబర్ పురంథ్రీశ్వరే అవుతారు. ఈ విషయం ముందుగా పసిగట్టే, పురంధ్రశ్వరికి అడ్డం కోవడం కోసం, ఆమె అవకాశాలకు ముందుగా దెబ్బ తీయడం కోసమే విజయవాడ సీటుపై ఈ ప్రచారం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Show comments