జ‌న‌సేన గ్యారేజ్ అట‌.. వాటే గ్రేట్‌ స్టోరీ...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ భావినేత‌గా ఎవ‌రివైపు చూస్తున్నారు?  ఎపిలో ఏ క‌ష్టం వ‌చ్చినా ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతున్న పేరు ఎవ‌రిది?  రాష్ట్రానికి ఆశాదీపంగా, ఓ గొప్ప మార్గ‌ద‌ర్శిగా, పోరాట యోధునిగా ప్ర‌జ‌లంతా ఎవ‌రి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇలాంటి సందేహాలు ఇంకా మీ మ‌దిలో మెదులుతున్నాయంటే మీరింకా తెలుగులో అగ్ర‌గామి చానెల్ గా పేరున్న ఓ చానెల్ వారు వండి వ‌డ్డించిన స్టోరీని తిల‌కించ‌ లేద‌న్న‌ట్టే. 

ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ త‌దిత‌ర హామీల విష‌యంలో చేతులెత్తేసి, ప్ర‌చారంతోనే ప‌బ్బం గ‌డుపుకుంటున్న అధికార పార్టీకి ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉంద‌నేది వాస్త‌వం. అయితే  అది విప‌క్షానికి అంతే స్థాయిలో సానుకూలంగా కూడా మార‌లేద‌నేది  రాజ‌కీయ పండితుల విశ్లేష‌ణ‌. అధికార పార్టీ త‌మ ఆశ‌లు వమ్ము చేయ‌డం, మీడియా ఏక‌ప‌క్ష వైఖ‌రి పుణ్య‌మాని విప‌క్షంపై  ప్ర‌జ‌లు పూర్తిగా  ఆశ‌లు పెట్టుకోలేక‌పోతున్నార‌ని,  ఎటు మొగ్గాలో తెలీని ప‌రిస్థితుల్లో ఎపి ప్ర‌జ‌లు ఉన్న‌ట్టు వీరు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా ఎపి పార్టీల‌కు రానున్న రెండేళ్లు చాలా కీల‌కంగా మార‌నున్నాయి. ఈ రెండేళ్ల‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌నున త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో పూర్తి స‌త్తా చూపిన పార్టీకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. 

ఇలాంటి అంచ‌నాల నేప‌ధ్యంలోనే ఇంత‌కాలం బాబుగారి భ‌జ‌న చేసీ చేసీ... అల‌సిపోయిన‌ప్ప‌టికీ ఆశించిన‌ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డం, పైగా ఈ క్ర‌మంలో సాధార‌ణ ప్ర‌జానీకానికి కూడా తాము వేసుకున్న‌ ప‌చ్చ‌ముసుగు స్ప‌ష్టంగా క‌న‌ప‌డిపోతుండ‌డంతో... కొన్ని చానెళ్లు కొత్త రాగం ఎత్తుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వార్త‌ల క‌వ‌రేజ్ విష‌యంలో విప‌క్షానికి ఇవ్వాల్సినంత క‌నీస ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కొన‌సాగిస్తూనే, స‌రికొత్త ప్ర‌త్యామ్నాయంగా చంద్ర‌బాబును త‌ప్ప ప్ర‌పంచంలో అంద‌రినీ విమ‌ర్శించే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఫోక‌స్ చేస్తున్నాయి. 

అందులో భాగంగానే కనిపిస్తోంది ఒక తెలుగు చానెల్‌లో ఆదివారం పొద్దున్నే వ‌చ్చిన జ‌న‌సేన గ్యారేజ్ అనే శీర్షిక‌న వండివార్చిన  స్టోరీ. ఈ క‌ధ‌నానికి జ‌న‌సేన గ్యారేజ్ అనే పేరు పెట్ట‌డంలోనే ప‌వ‌న్‌ని ఏ స్థాయిలో వీళ్లు కీర్తించ‌ద‌గల‌చుకున్నారో అర్ధ‌మైపోతుంది. ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌పై ప్రాణాల‌కు తెగించి పోరాడే హీరోని చూపించే జ‌న‌తా గ్యారేజ్ అనే సినిమా జ‌నాల‌కి స్ఫురించ‌డానికే న‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.  

ఈ క‌ధ‌నం సారాంశం ఏమిటంటే... ప్ర‌స్తుతం ఎపి ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌వ‌న్... ప‌వ‌న్ అని ప‌ల‌వ‌రిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే జ‌న‌సేనాధిప‌తి కూడా ప్ర‌తి స‌మ‌స్య‌కూ స్పందిస్తున్నాడు. జ‌నానికి అండ‌గా నిలుస్తున్నాడు. అమ‌రావ‌తి రైతుల ఆక్రంద‌న‌ల నుంచి ఉద్ధానం రోగుల స‌మ‌స్య‌ల దాకా ప్ర‌తి అంశంపైనా ప‌వ‌న్ స్పందించిన తీరు జ‌నానికి విప‌రీతంగా న‌చ్చేసింది. ఇక త‌మ స‌మ‌స్య  తీరాలంటే ప‌వ‌న్ త‌ప్ప వేరే గ‌త్యంతరం లేద‌ని జనం భావిస్తున్నార‌ట‌.

అంతేకాదు ప్ర‌భుత్వం కూడా ప‌వ‌న్ మాట్లాడిన ఏ విష‌యంపైన అయినా వెంట‌నే స్పందిస్తోంద‌ట‌. (మ‌రి ప‌వ‌న్ ఇప్ప‌టిదాకా అత్య‌ధికంగా ప్ర‌స్తావించిన‌ ప్ర‌త్యేక‌హోదా మీద ఏం చేసిందో...) స‌మ‌స్య పరిష్కారం కోసం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ట‌. కాబ‌ట్టి జ‌నానికి ప‌వ‌న్ మీద గురి కుదిరిపోయింద‌ట‌. ఇలా... సాగిపోయిందా స్టోరీ. ఈ స్టోరీలో కొస‌మెరుపు ఏమిటంటే చిన్న పిల్ల‌లు కూడా ప‌వ‌న్ కావాలంటున్నార‌ట‌. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా ఆ మ‌ధ్య ఓ చిన్నారి చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతూ ప‌వ‌న్‌ని చూడాల‌ని ఉంద‌న‌డం, వెంట‌నే ప‌వ‌న్ స్పందించి ఆ చిన్నారిని ప‌రామ‌ర్శించి రావ‌డం అనే ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. ( మ‌రికొంత మంది సినిమా స్టార్ల‌కు కూడా ఇలాంటి సంద‌ర్భాలు ఎదురైతే ఇలాగే స్పందించార‌నేది ఇక్క‌డ గ‌మ‌నార్హం). 

నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఆయ‌న అనుకూలురు కూడా అంగీక‌రించే విష‌యం ఏమిటంటే... ఏవో ఎంచుకున్న ఒక‌టి రెండు స‌మ‌స్య‌లు త‌ప్ప ఆయ‌న రాష్ట్రంలో ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. ఒక రాజ‌కీయ సంస్థ‌కు అధిప‌తిగా పోషించాల్సిన‌ పాత్ర పోషించ‌డం లేద‌ని, చాలామార్లు ట్విట్ట‌ర్‌కే ప‌రిమిత‌మై, పిలుపుల‌తో స‌రిపెడుతున్నార‌ని. అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్యేక‌హోదా అంశంలో కూడా జ‌నానికి చెప్ప‌డ‌మే త‌ప్ప తానేమీ చేయ‌డం లేద‌ని. దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీలూ ప‌వ‌న్ మ‌రింత చురుకుగా స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని అప్పుడే ఆయ‌న మాట‌ల‌కు, చేత‌ల‌కు విలువ ఉంటుంద‌ని అంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ చానెల్‌కి మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశాదీపంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళ‌మెత్తుతున్న నాయ‌కుడిగా క‌న‌ప‌డ‌డం విచిత్రం అనాలో... ఇదీ ఆ తారా-చంద్రుల లీల  అనుకోవాలో...మ‌రి.

Show comments