అత్తారింటికి దారేదీ సినిమా క్లైమాక్స్ లో పవన్ కల్యాణ్ కొన్ని బరువైన డైలాగులు చెబుతాడు. అత్తను పుట్టింటికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా హీరో పాత్రధారి అయిన పవన్ తమను గుర్తించమని ఆమెను అత్యంత ధీనంగా కోరతాడు! ఆల్ మోస్ట్ ఏడ్చేస్తూ.. “మమ్మల్ని గుర్తించు అత్తా..గుర్తించు..’ అంటూ ప్రేక్షకులను పిండేశాడు పవన్. మరి ఆ సినిమాలో అయితే అల్లుడిగా పవన్ ను ఆ అత్త గుర్తిస్తుంది కానీ.. రాజకీయ తెర మీదే పవన్ ను ఇప్పుడు గుర్తించే వాళ్లు లేకుండా పోయారు! ఒక పెద్ద సమస్య వచ్చినా, దానిపై నానా రభసా జరుగుతున్నా.. ఏ ఒక్క వర్గం కూడా పవన్ ను ‘గుర్తించడం’ లేదు.
ఒకవైపు తెలుగుదేశం ఏమో.. కాపుల అలజడి అంతా జగన్ సృష్టించినదే అని జనాలను నమ్మించాలని శతథా ప్రయత్నిస్తోంది. తాము ఇచ్చిన హామీ విషయంలో కాపులు తమను నిలదీస్తున్నా.. ఇదంతా జగన్ కుట్ర అని తెలుగుదేశం వాదిస్తోంది! ఇక ఈ సమస్య విషయంలో ఇప్పటికే కాపు ముఖ్య నేతలంతా సమావేశం అయ్యారు. ఎన్నడూ సాన్నిహిత్యం గా కనిపించని కాపు సీనియర్లు కూడా ఒక చోట కూడారు. అంతా కలిసి గర్జించారు.
ఇక కాపునాడు నేతలు ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మరోవైపు జగన్ ను కలిసి తమ పోరాటానికి మద్దతును కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచడానికి ఈ విషయంలో దీక్ష కూడా చేయాలని వీరు జగన్ ను కోరారు.
ఈ విధంగా గత పక్షం రోజులుగా కాపు ఉద్యమం విషయంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. ఈ రచ్చ తలెత్తకమునుపు అనామక స్థాయిలో ఉన్న కాపు నేతలు కూడా ఇప్పుడు క్రియాశీల నేతలయ్యారు. ఎటొచ్చీ పవన్ కల్యాణ్ నే ఎవరూ గుర్తించడం లేదు!
ప్రత్యేకించి కాపు నాడు నేతలు కానీ, కాపు ముఖ్య నేతలు కానీ.. ఈ విషయంపై పవన్ స్పందించాలని ఒక్క మాట అనలేదింత వరకూ! అటు కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖుడిగా గానీ ఇటు జనసేన అధినేతగా కానీ... ఏ హోదాలోనూ పవన్ ను ఈ జనాలు గుర్తించడం లేదు! తుని సంఘటన తర్వాత పవన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చాడు. అలాకాదు.. తెలుగుదేశం వాళ్లు పవన్ ను అప్పుడు రప్పించారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఆ తెలుగుదేశం వాళ్లు కూడా పవన్ ను రప్పించే ప్రయత్నాలు చేయడం లేదు!
కాపులకు చంద్రబాబు ఎంతో చేస్తున్నాడు.. అని వాదించే తెలుగుదేశం మంత్రులు కూడా ఇప్పుడు పవన్ ను కలిసి ఈ వాదన వినిపించడం లేదు. “చూడండి.. కాపులను బాబు ఉద్ధరిస్తుంటే అవతల ముద్రగడ, జగన్ కలిసి కాపు జనోద్ధరకుడిని ఇబ్బంది పెడుతున్నారు..’’ అని చెప్పి ఈ తెలుగుదేశం కాపు నేతలు పవన్ ను ఎందుకు మీడియా ముందుకు తీసుకరాకూడదు? గత ఎన్నికల్లో అంతా ఒకే వేదికను పంచుకున్న వారు కదా! ఇప్పటికీ పవన్ బాబు విషయంలో పాజిటివ్ గానే ఉన్నాడు కదా. అలాంటప్పుడు పవన్ అయినా ఎందుకు రాకూడదు? తెలుగుదేశం ఎందుకు అడకూడదు? మద్రగడ ను ముద్రగడ వెనుక ఉన్న జగన్ ను ఎందుకు కడిగేయ కూడదు?
పవన్ నేమో కాపులు అమితంగా ఇష్టపడతారు. కానీ వీళ్లు కూడా పవన్ ను తమ తరపున పోరాడమని అడగట్లేలేదు! ఇలా తమకు సమస్య వచ్చినప్పుడు కూడా పవన్ కు వెళ్లి చెప్పుకోవాలని కాపులకు అనిపించడం లేదంటే.. పవన్ పవర్ ను ఇంక ఎవరు గుర్తిస్తున్నట్టు?! ఇంతకీ ఇప్పుడు పవన్ రోల్ ఏమిటి? ఏమీ లేదా? అలాంటప్పుడు జనసేన ఎందుకు ఉన్నట్టు? కనీసం ఒక్కటంటే ఒక్క అంశం మీద అయినా నిశ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించకుండా ఇలా ఎన్నాళ్లు? ఇలా మిన్నకుండిపోయి ఎలక్షన్ల టైమ్ లో ప్రచారానికి దిగేస్తే ప్రతిసారీ మొన్నటి ఫలితాలే ఉంటాయా?!
ఈ నేపథ్యంలోనే ఒక అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంతకుముందులా సగంసగం మాట్లాడి వెళ్లడానికి లేదు. కాపుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్టా లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి. ముద్రగడ, తుని రైలు సంఘటన బాధ్యులపై కేసులు పెట్టాలా? తీసేయాలా? అనే అంశం మీదా మాట్లాడాలి! ఇలా ఏలా కట్టెవిరిచినా అది పవన్ కు బాబుకు ఇబ్బందులను తెచ్చిపెట్టేదే!
కాపుల ఉద్యమానికి మద్దతు పలికితే బాబును ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అలా కాదు ముద్రగడ తీరు సరికాదంటే.. కాపులు పవన్ ను పక్కన పెట్టేస్తారు! ఈ రెండూ కూడా పవన్ కోరుకోవడం లేదు. అందుకే ఇంత జరుగుతున్నా.. కాపుల్లోని సామాన్యులు రోడ్డు ఎక్కినా.. పవన్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు! మరి ఈ మేధావి నిశ్శబ్దంలోని అవకాశ వాదాన్ని.. ఇప్పటికే ఈయనను పెద్దగా పట్టించుకోని కాపులు భవిష్యత్తులో క్షమిస్తారా?!