కేసీఆర్‌ వ్యూహాలకు ఎదురే లేదు.!

రాజకీయంగా వ్యూహాల్ని రచించడంలో కేసీఆర్‌ దిట్ట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వ్యూహాలు కొన్నిసార్లు బెడిసి కొట్టినప్పటికీ, అంతిమంగా ఆయనదే పై చేయి అయ్యింది. అన్ని రాజకీయ పార్టీల్నీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేయడంలో కేసీఆర్‌ వ్యూహం ఓ రేంజ్‌లో వర్కవుట్‌ అయిన మాట వాస్తవం. తెలంగాణ జేఏసీ లేకపోతే, తెలంగాణ ఉద్యమం పార్టీలకతీతంగా ఉధృతమయ్యేదే కాదు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌, తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. విపక్షాల్ని నిర్వీర్యం చేయడంలో ఆయన వ్యూహాలకు ఎదురే లేదు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, నిజానికి కొరివితో తల గోక్కున్నట్లే. ఏ జిల్లాని ఎలా విభజిస్తే, ఎలాంటి ఉద్యమాలు వస్తాయో తెలియని పరిస్థితి. అయినాసరే, ఓ పద్ధతి ప్రకారం కేసీఆర్‌ తన వ్యూహాల్ని అమల్లోకి తీసుకొచ్చారు. 

విపక్షాలు వద్దంటున్నాసరే, కేసీఆర్‌ తన పని తాను చేసుకుపోయారు. ఈ క్రమంలో చాలా డిమాండ్లు అటకెక్కిపోయాయి. సిరిసిల్ల, గద్వాల జిల్లాల విషయంలో కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో కొత్త జిల్లా కోసం ఆందోళనలు భగ్గుమంటున్నా, వ్యూహాత్మకంగా మౌనం దాల్చారు కేసీఆర్‌. గద్వాల జిల్లా విషయంలోనూ అదే జరిగింది. సిరిసిల్లను సాకుగా చూపి, గద్వాలను పక్కన పెట్టారుగానీ, ఈ పక్కన పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే వుందని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. 

అసెంబ్లీ సమావేశాల వేళ ఈ కొత్త జిల్లాల లొల్లి నిజానికి టీఆర్‌ఎస్‌ని ఇరకాటంలో పడేసేదే. అందుకే, వివాదాలకు ఛాన్సే లేకుండా, అసెంబ్లీ సమావేశాల్ని కేవలం జీఎస్‌టీ బిల్లుకే పరిమితం చేయించారు కేసీఆర్‌. సైలెంట్‌గా పని కానిచ్చేసి, చివరికి అటు తన కుమారుడి కోరిక మేరకు సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసి, పనిలో పనిగా గద్వాల జిల్లానీ ఓకే చేసేశారు. ప్రస్తుతానికైతే లెక్క 30గా తేలింది. అంటే, 10 జిల్లాల తెలంగాణ ఇకపై మహా తెలంగాణ.. 30 జిల్లాలతో వికసించనుందన్నమాట. 

30 జిల్లాల తెలంగాణకీ, 10 జిల్లాల తెలంగాణకీ విస్తీర్ణంలో తేడా ఏమీ రాదు. కానీ, కొత్తగా 20 జిల్లాల కేంద్రాల ఏర్పాటుతో, అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నది కేసీఆర్‌ అంచనా. ఆ అభివృద్ధి సంగతేమోగానీ, రియల్‌ వ్యాపారం మాత్రం ఓ రేంజ్‌లో నడిచే అవకాశం వుందట. ఆ దిశగా అప్పుడే అధికార పార్టీ నేతలు సంకేతాలు అందిస్తున్నారు కూడా. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లా పేరు తెరపైకొస్తోంది. అంటే లెక్క 30 కాదు, 31 అని అనుకోవాలేమో.! 

విపక్షాల్ని దెబ్బకొట్టినట్టే కొట్టి, చివరికి విపక్షాల డిమాండ్‌ని నెరవేర్చినట్లే నెరవేర్చి.. విపక్షాలకు ఇప్పుడు సౌండ్‌ లేకుండా చేసేశారు కేసీఆర్‌. ఈ సందట్లో మల్లన్నసాగర్‌ వివాదం అటకెక్కింది.. హైద్రాబాద్‌లో భారీ వర్షాలు, వరదలు, గుంతల రోడ్ల వ్యవహారం.. ఇవన్నీ అటకెక్కిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, జిల్లాల పేరుతో తెలంగాణలో విపక్షాల్ని పూర్తిగా ఔట్‌ ఫోకస్‌ చేసేశారన్నమాట కేసీఆర్‌. ఇప్పుడు చెప్పండి, రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్‌కి సాటి ఇంకెవరైనా వుంటారా.?

Show comments