'మణికర్ణిక' రేంజ్‌ పెంచేస్తున్నారట

సినిమా సినిమాకీ రేంజ్‌ పెంచుకుంటూ వెళుతున్నాడు దర్శకుడు క్రిష్‌. 'గమ్యం' నుంచి, 'గౌతమి పుత్ర శాతకర్ణి' వరకూ, క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రమూ ప్రత్యేకమైనదే. 'కంచె' సినిమా క్రిష్‌లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. భారీ చిత్రాల్ని పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో తీయగల సత్తా వున్న దర్శకుడన్న పేరు సంపాదించాడు క్రిష్‌. అఫ్‌కోర్స్‌, ఆ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా విషయంలో క్రిష్‌ చేసిన రీసెర్చ్‌, అందర్నీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం క్రిష్‌ మరో సినిమా కోసం రీసెర్చ్‌ పూర్తి చేశాడు. అదే 'మణికర్ణిక'. రాణీ ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత చరిత్రే ఈ 'మణికర్ణిక'. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ని పోషించనుంది బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. తెలుగులో తొలి చిత్రం 'ఏక్‌ నిరంజన్‌'తో నిరాశపర్చినా, బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, సోలో స్టార్‌డమ్‌ సంపాదించుకుందీ బ్యూటీ. 

'మణికర్ణిక' ప్రాజెక్ట్‌ అనుకున్నప్పుడే భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించాలనే ప్లాన్‌ చేశారుగానీ, ఇప్పుడు ఆ ప్లాన్స్‌కి మరింత మెరుగులు దిద్దుతున్నారు. 'బాహుబలి' సాధించిన విజయంతో, టాలీవుడ్‌ - కోలీవుడ్‌ - బాలీవుడ్‌ అన్న హద్దులు చెరిగిపోయాయి. దాంతో, ఇండియన్‌ సినిమా.. అనే ఆలోచనలతో బడ్జెట్‌ని ఏ రేంజ్‌దాకా అయినా తీసుకెళ్ళాలనుకుంటున్నారట 'మణికర్ణిక' సినిమా నిర్మాత కమల్‌ జైన్‌. కాశీలో నేడు 'మణికర్ణిక' సినిమాకి సంబంధించి ప్రారంభోత్సవం లాంఛనంగా జరగనుంది. దాంతోపాటుగా 'మణికర్ణిక'గా కంగనా లుక్‌ని కూడా నేడే విడుదల చేస్తారు.

Show comments