'ఉప' వెంకయ్య: నిస్సిగ్గుగా గర్వపడాల్సిందే.!

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఏ భాషలో మాట్లాడాల్సి వచ్చినాసరే, 'ప్రాస' కోసం పాకులాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవర్నయినా పొగడాలన్నా, ఎవర్నయినా విమర్శించాలన్నా ఆయన తర్వాతే.! మన తెలుగువాడు, జాతీయ పార్టీ అయిన బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినవాడు, పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినవాడు.. ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు.

'నేను ఉషాపతిని మాత్రమే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కాదు.. అలాంటి ఉన్నతమైన పదవుల విషయంలో ఊహాగానాలు సరికాదు..' అంటూ నిన్ననే వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. 'ఆ పదవి మీద నాకు ఆసక్తి లేదు..' అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు కూడా. కానీ, అంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని, వెంకయ్యనాయుడు గౌరవించక తప్పలేదు. నిజానికి, మాట్లాడే మాటలకీ చేసే పనులకీ అస్సలేమాత్రం పొంతన వుండదు వెంకయ్య విషయంలో. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో అయినా, ప్రత్యేక హోదా విషయంలో అయినా.. వెంకయ్య రూటే సెపరేటు.! 

ఉప రాష్ట్రపతి అంటే, రాజ్యసభ ఛైర్మన్‌. రాజ్యసభ అంటే పెద్దల సభ. ఆ పెద్దల సభకు చాలాకాలంగా వెంకయ్యనాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదే రాజ్యసభలో, మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వెంకయ్యనాయుడు నినదించారు. కేంద్ర మంత్రి అయ్యాక మాత్రం, అదే రాజ్యసభలో ప్రత్యేక హోదాకి పాతరేసేశారు వెంకయ్యనాయుడు.! చిత్రంగా, ఇప్పుడు ఇదే రాజ్యసభకు వెంకయ్యనాయుడు ఛైర్మన్‌ కాబోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అడిగిందీ ఆయనే, ఆ ప్రత్యేక హోదాకి పాతరేసిందీ అయనే. ప్రత్యేక హోదా అనే వరం ఆంధ్రప్రదేశ్‌కి హక్కుగా సంక్రమించింది రాజ్యసభలోనే.. ఆ రాజ్యసభలోనే ప్రత్యేక హోదాని అడిగి, ఆ తర్వాత పాతరేసి, ఆ రాజ్యసభకే ఛైర్మన్‌ అవుతున్నారు వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి, ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికవుతున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం గర్వపడాలా.? ప్రత్యేక హోదాకి పాతరేసిన వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతిగా, ఎంపికవుతున్నందుకు బాధపడాలా.? రాజ్యసభలో ఓ సారి ఒకలా, ఇంకోసారి ఇంకోలా మాట్లాడిన వ్యక్తి ఆ రాజ్యసభకు ఛైర్మన్‌ అవుతున్నందుకు సిగ్గుపడాలా.? 

ఏమోగానీ, 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం మారితే, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, అప్పుడు ప్రత్యేక హోదాపై చర్చ జరిగితే, ఆ సమయంలో రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు పరిస్థితేంటట.? ఒక్కటి మాత్రం నిజం, ప్రత్యేక హోదాకి సంబంధించి వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్‌ అవుతుండడమంటే, బలిపీఠమెక్కుతున్నట్లే లెక్క.!

Show comments