తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే, 106 సీట్లు గెలిచేస్తామంటూ పార్టీ శ్రేణుల్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉత్సాహపరిచే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఎవరున్నాసరే, ఇలాంటి మాటలే చెప్పాలి. లేదంటే, పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటుంది. విపక్షాలు సైతం, 'ఈసారి అధికారం మనదే..' అనే ధీమాతోనే వుండాలి.. తప్పదు మరి.!
కానీ, వాస్తవమేంటి.? అన్నది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దారుణంగా దెబ్బ తినేయాల్సి వస్తుంది. గతంలో ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాలకులు బొక్క బోర్లా పడ్డ సందర్భాల్ని చాలానే చూసేశాం. గడచిన మూడేళ్ళలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల తీరు చూస్తే, కేసీఆర్ చెప్పిన 'ఫిగర్' కొంత మేరకు కరెక్ట్.. అన్పించకమానదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అయితే, కేసీఆర్ లెక్క ఏమాత్రం తప్పలేదు. చెప్పి మరీ, పక్కాగా విజయం సాధించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వేరు, మిగతా ఎన్నికలు వేరు.. అనుకోవడానికీ వీల్లేదు. వరంగల్, మెదక్ పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.. పలు అసెంబ్లీ సెగ్మెంట్లకీ ఉప ఎన్నికలు జరిగాయి. అన్నిటా ఫలితం ఒక్కటే.. అదే టీఆర్‌ఎస్ ఘనవిజయం. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రస్తావిస్తూ, 2019 ఎన్నికల్లో చాలా ఈజీగా సెంచరీ కొట్టేస్తామంటున్నాయి. అలా చెప్పకపోతే ఇంకేమన్నా వుందా.? అధినేతకు కోపమొచ్చేస్తుంది.
ఓటరు నాడి ఎప్పుడెలా వుంటుందన్నది ఊహించడం కష్టం. 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పలేం. తెలంగాణలో టీడీపీ, బీజేపీ అడ్రస్ గల్లంతవుతాయంటూ సంకేతాలిచ్చిన కేసీఆర్, కాంగ్రెస్‌ని మాత్రం కాస్త 'సాఫ్ట్‌గా చూస్తున్నారు'. ఇదే ఎవరికీ అర్థం కాని విషయం. మొదటినుంచీ ఆయన వైఖరి ఇదే. కాంగ్రెస్‌ని దెబ్బ కొడతారు, అదే సమయంలో ఆ పార్టీలో కొందరు నేతలతో టచ్‌లో వుంటారు. జానారెడ్డి విషయంలో కేసీఆర్ 'సాఫ్ట్ కార్నర్' గురించి కొత్తగా చెప్పేదేముంది.?
కేసీఆర్ చెబుతున్నంతలా, 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలొచ్చేస్తాయని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమ ఉధృతిలోనే, టీఆర్‌ఎస్‌కి 70 సీట్లు కూడా పూర్తిగా రాలేదు. ఐదేళ్ళ పాలన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎంతో కొంత ప్రభావం చూపి తీరుతుంది. ఇప్పటికే ఆ వ్యతిరేకత కనిపిస్తున్నా.. అధికార బలంతో.. అది కనబడనీయకుండా చేయగలుగుతున్నారాయన. తనకు తాను పూర్తి మార్పులు ఇచ్చుకున్నా, గిట్టనివారికి మార్కులు తక్కువ వేసుకున్నా.. ఇదంతా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచే క్రమంలో, వారిని మభ్యపెట్టడం కోసమే. ఈ విషయం టీఆర్‌ఎస్ నేతలకీ తెలుసు.. కానీ, అధినేతని ఈ విషయంలో ప్రశ్నించగలరా.? ఛాన్సే లేదు.