ఆది పెళ్లి : అంతా ‘ఆటగదరా శివా’ మాయ!

టీవీ కమెడియన్‌గా పాప్యులారిటీ ఉన్న హైపర్ ఆది గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడన్న వార్తల వ్యవహారం మొత్తం సినిమా వ్యవహారమే అని తేలిపోయింది. సినిమాల్లో కూడా ఇటీవలే కమెడియన్ వేషాలు ప్రారంభించిన ఆది, చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆటగదరా శివా’ చిత్రంలోని స్టిల్, అతని పెళ్లి స్టిల్ గా గురువారం చెలామణీలోకి వచ్చింది.

సినిమా గురించి సరదాగా భిన్నంగా ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఇలా లీక్ చేశారు. గ్రేటాంధ్ర పాఠకులకు అందించిన తర్వాత.. మీడియాలో ఆది పెళ్లి సంగతి హోరెత్తిపోయింది. చివరికి ఈ విషయంలో దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తనను సంప్రదించిన వారికి క్లారిటీ ఇచ్చారు.

రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆటగదరా శివా’ అనే చిత్ర రూపొందుతోంది. కన్నడలో గత ఏడాది వచ్చిన ‘రామా రామా రే’ అనే చిత్రానికి రీమేక్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా కొత్తనటులు ప్రధాన పాత్రలు పోషించే ఈ చిత్రంలో.. హైపర్ ఆది ఓ పాత్ర చేస్తున్నాడు. ఆయన పాత్రకు వివాహ సన్నివేశం కూడా ఉంటుంది. ఆ ఫోటోనే ప్రేక్షకులతో సరదాగా పంచుకోవడానికి ముందుగా లీక్ చేశారు.

చంద్రసిద్ధార్థ్ మార్క్ ఉన్న తతిమ్మా చిత్రాల మాదిరిగానే ‘ఆటగదరాశివా’ కూడా ఆలోచింపజేసే కథాంశంతోనే ఉంటుందని తెలుస్తోంది. గ్రేటాంధ్ర సరదాగా అందించిన ఆదిపెళ్లి ఎపిసోడ్ ను ఆస్వాదించిన పాఠకులకు, సహకరించిన సినిమా యూనిట్ కు కృతజ్ఞతలు.

Show comments