ఆ ప్రాణాలంటే లెక్కలేదా పవన్‌.?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ తనయుడు నిశిత్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకుని, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌, హుటాహుటిన హైద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. నారాయణ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్‌ సహా ఇతర కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ క్రమంలో పవన్‌ పలువురు టీఆర్‌ఎస్‌ నేతలతోనూ మాట్లాడటం గమనార్హం. 

ప్రాణం పోయిందంటే ఎవరైనాసరే, 'అయ్యోపాపం..' అనడం సహజమే. పరామర్శలు మామూలే. పైగా, మంత్రిగారబ్బాయ్‌.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడనగానే, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, మృతదేహానికి నివాళులర్పించడం సర్వసాధారణమైన విషయం. అయితే, కొన్నాళ్ళ క్రితమే చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఓ లారీ, 16 మంది ప్రాణాల్ని బలిగొంది. పవన్‌ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, రాజకీయ ప్రముఖుడు కూడా. 

మంత్రిగారబ్బాయ్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడనగానే పరుగు పరుగున వెళ్ళిన పవన్‌, ఇప్పటిదాకా ఏర్పేడు బాధితుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్ళకపోవడం ఆశ్చర్యకరమే. రాజకీయాల్లో వున్నాక ఇలాంటి ఫార్మాలిటీస్‌ కొన్ని పాటించాల్సి వుంటుంది. బాధిత కుటుంబాలకు అండగా వుండాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపైనా వుంటుంది మరి.! 

అన్నయ్య చిరంజీవి ఎలాగూ, రాజకీయాల గురించి మాట్లాడటం మానేశారు.. రాజకీయాల్లో వున్నాసరే. తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ది ఇంకో టైపు వ్యవహారం. ఏర్పేడు ఘటనపై స్పందిస్తూ ప్రకటన చేసేసి చేతులు దులిపేసుకోవడం ఎంతవరకు సబబో పవన్‌కళ్యాణ్‌కే తెలియాలి. 

Show comments