ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ పార్టీ ప్రభావం ఎంత? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపగలదు? అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేన అధినేత బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున కాలికి బలపం కట్టుకుని తిరగడంతో.. ఆ పార్టీలు విజయం సాధించడంతో.. అందులో కొంత క్రెడిట్ పవన్ కూ దక్కింది.
ఓట్ల శాతంలో తెలుగుదేశం కూటమి, జగన్ పార్టీల మధ్య తేడా స్వల్వమే అని.. ఆ స్వల్పమైన తేడా కు కారణం పవన్ కల్యాణే అనే వెర్రి లాజిక్ ఒకటి ఆది నుంచి వినిపించడం, పవన్ కల్యాణ్ వల్లనే టీడీపీ గెలిచింది అని రుణమాఫీ వంటి బలమైన అంశాలను వైకాపా వాళ్లే కొన్ని సార్లు తేలిక చేయడంతో.. పవన్ కు కింగ్ మేకర్ ట్యాగ్ వచ్చింది.
రేపటి ఎన్నికల్లో కూడా పవన్ ఎటు మొగ్గితే ఆయన సినీ అభిమానం అటు మొగ్గుతుంది.. వాళ్లే విజేతలు అవుతారు అని ఈ హీరో వీరాభిమానులు అంటున్నారు. పవన్ ఎప్పటికీ కింగ్ కాలేడు కానీ, కింగ్ మేకరయితే అవుతాడు.. అనేది వీరి ఉవాచ. మరి నిజంగానే అంత సీనుందా? అనేది సందేహం.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలిచింది.. పవన్ కల్యాణ్ అటు వైపు నిలిచాడు కాబట్టి అనే లాజిక్ లాగొచ్చు. అయితే అదే తెలుగుదేశం పవన్ సహాయం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించిందిగా.. అనే పాయింట్ తో చూసినప్పుడు మాత్రం పవన్ రోల్ చిన్నబోకమానదు.
పవన్ ఎవరినీ గెలిపించేంత, ఓడించేంత సీన్ ఉన్న వ్యక్తి లేదనడానికి ఈ వాదన ఊతంగా నిలుస్తుంది. మరి రేపటి ఎన్నికల్లో పవన్ ప్రభావం ఏమిటి? అనే విషయం గురించి కూడా పరిశోధించిందట ప్రశాంత్ కిషోర్ బ్యాచ్. దీంట్లో తేలిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత వరకూ జనసేన అనే పార్టీ ఒకటి ఉందనేది రూరల్ ఆంధ్రాలో తెలీదనేది.
పవన్ కల్యాణ్ పార్టీ గురించి పేపర్లు, వెబ్ సైట్లు రాసుకోవడం, సోషల్ మీడియాలో పెయిడ్ పేజెస్ రన్ కావడమే కానీ.. సామాన్య ప్రజానీకానికి పవన్ పార్టీ ఒకటుందనేది తెలీదు. ఇదీ ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్.
మరి ఎన్నికలు వచ్చే నాటికి పవన్ జనాలకు తన పార్టీ గురించి తెలియజేస్తే చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితే ఉంటే మాత్రం పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదని ప్రశాంత్ కిషోర్ తేల్చింది. ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకునేంత సత్తా కూడా జనసేన కు లేదని.. పవన్ వెళ్లి రాయలసీమలో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ సర్వే ఢంకా భజాయించింది.